Home వరంగల్ రూరల్ ఆర్టీసి బస్టాండ్ లో టాయిలెట్లు ఎక్కడ ?

ఆర్టీసి బస్టాండ్ లో టాయిలెట్లు ఎక్కడ ?

Toilets Not Available in Alkathurthy  RTC Bustand

మన తెలంగాణ/ ఎల్కతుర్తి : బస్టాండ్‌ను నిర్మించారు.. కానీ మరుగుదొడ్లు మరిచారు. కుర్చీలు వేశారు.. కానీ టాయిలెట్ల సంగతి మరిచారు. ఫ్యాన్లు బిగించారు.. కానీ ప్రయాణీకులు పడే అవస్థలను గమనించడం లేదు.. ఎవరో వస్తారని.. ఏదో చేస్తారని ఎదురు చూస్తూ మోసపోవాల్సిన పరిస్థితి ప్రయాణికులకు ఏర్పడింది. బస్టాండ్‌ను వినియోగంలోకి తీసుకొచ్చి మూ డు నెలలు గడుస్తున్నా ఇప్పటికి మరుగుదొడ్ల సంగతి పట్టించు కోక పోవడంతో ప్రయాణికులకు కనీసం ఉచ్చపోసేందుకు జాగ కూడా లేకుం డా పోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి.
మహిళల ఊపిరి బిగబట్టి అవస్థలు :
బస్సులు ఎక్కి తమ గమ్యాలకు చేరుకోవడం కోసం ఆర్‌టిసి అక్కడక్కడా గ్రామాల్లో బస్టాండ్‌లను ఏర్పాటు చేసింది. అయితే ప్రతీ బస్టాండ్‌లో తప్పకుండా మరుగుదొడ్లు, విశ్రాంతి గదులు, స్టాళ్లు ఏర్పాటు చేయడం చూస్తున్నాం. కానీ ఎల్కతుర్తి బస్టాండ్‌లో మౌళిక సదుపాయాలు పూర్తిగా లేకుండా పోయాయి. బస్టాండ్‌లోకి బస్సుల కోసం వచ్చే ప్రయాణికులు ఒంటికి, రెండుకు వెళ్లేందుకు గదులు లేవు. కనీసం వసతులు కూడా లేవు. ఇంతకు ముందు ఉన్న గదులు పూర్తిగా ధ్వంసమయ్యాయి. అందులోకి వెళ్లే పరిస్థితి లేదు. కొత్త గదులు నిర్మించలేదు. మగవారు ఇక్కడో.. అక్కడో చాటుమాటున కానిచ్చేస్తున్నారు. కానీ మహిళ పరిస్థితే హృదయ విధారకంగా మారింది. మూత్ర విసర్జన కోసం మహిళలు గంటల కొద్ది ఊపిరి బిగబట్టి, కడుపు చేత్తో పట్టుకుని తీవ్రమైన అవస్థను అనుభవి స్తున్నారు. ఎటైనా వెళ్దామంటే చుట్టూ ఎటు చూసినా మరుగుదొడ్లు కాదుకదా కనీసం చాటు కూడా లేకుండా పోయింది. అంతా జన సంచారమే కనిపిస్తుంది. ఇంత పెద్ద ఎత్తున నిధులు మంజూరీ బస్టాండ్‌కు మరమ్మతులు చేశారు. కానీ చిన్న మొత్తంతో పూర్తయ్యే మరుగుదొడ్ల నిర్మాణాల కోసం ఎందుకు నిధులు విడుదల చేయడం లేదని ప్రయాణి కులు ప్రశ్నిస్తున్నారు. ఫ్యాన్లు బిగించి, కుర్చీలు, రంగులు వేసి ఎంత హడావిడి చేసినా చివరకు మరుగుదొడ్లు లేకుంటే ఏ విధంగా ఉంటుందో ఆర్‌టిసి అధికారులు ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. గత మూడు నెలలుగా ప్రయాణికులు చెప్పుకోలేని విధమైన అవస్థలు పడుతుంటే ఏసీల్లో, ఫ్యాన్ల కింద కూర్చుని తమ గోడును పట్టించుకోవడం లేదని ప్రయాణికులు శాపనార్థాలు పెడుతున్నారు.
మంచి నీళ్లు కరువే
శిథిలావస్థలో ఉన్న బస్టాండ్‌ను పూర్వ వైభవంలోకి తీసుకొచ్చామని చెప్పుకుంటున్న ప్రజాప్రతినిధులు, అధికారులు బస్టాండ్‌లోకి వెళ్తే గానీ ప్రయాణికులకు ఏమి అవస్థలు పడుతున్నారో, వారికి ఏమేమి తక్కువ య్యాయో అర్థమవుతుంది. మరుగుదొడ్ల సమస్య పెద్ద ఎత్తున పట్టి పీడి స్తుంటే మరోవైపు తాగునీటి కొరత ప్రయాణికులను మరింత ఇబ్బందులకు గురి చేస్తున్న అంశం. బస్టాండ్‌లో ప్రయాణికులకు కనీస మంచినీటి సౌకర్యం కూడా లేకుండా పోయింది. ప్రయాణికులు వెంట బాటిళ్లు తెచ్చుకోవాల్సిన పరిస్థితులు వచ్చిపడ్డాయి. ఎల్కతుర్తి బస్టాండ్‌లోకి వచ్చే మహిళా ప్రయా ణికులు గొంతు ఎండిపోతున్నా మంచినీళ్ల జోలికే వెళ్లడం లేదు. వెంట మంచినీళ్లు తెచ్చుకున్నప్పటికీ వాటిని చూస్తేనే భయకంపితులవుతున్నారు. ఎందుకంటే మంచినీళ్లు తాగితే ఎక్కడ మూత్రం వస్తుందో, అప్పుడు తమ పరిస్థితి ఏమిటో అని జంకుతున్నారు.
ఆర్‌టిసి అధికారులారా.. స్పందించండి
పూర్వ వైభవం.. పూర్వ వైభవం అని అంటూ ప్రజాప్రతినిధులు, ఇటు అధికారులు వల్లెవేస్తూ గొప్పలు చెప్పుకుంటున్నారు. కానీ పూర్వ వైభవం అంటే ఇదేనా? అని ప్రయాణికులు ప్రశ్నిస్తున్నారు. పూర్వ వైభవం పేరుతో నాసిరకం పనులు చేయడంతో పాటు మౌళిక వసతుల కల్పనలోనూ అధికారులు నిర్లక్ష వైఖరిని ప్రదర్శించడం సరైంది కాదని ప్రయాణికులు విమర్శలు చేస్తున్నారు. కొంత మంది యువకులు బస్టాండ్ పరిస్థితి గురించి సంబంధిత అధికారులకు సోషల్ మీడియా సాధనమైన వాట్సాప్ ద్వారా తెలియపరిచినా ఫలితం లేకుండా పోతోంది. ఇప్పటికైనా ఆర్‌టిసి అధికా రులు స్పందించి ముందుగా మరుగుదొడ్లు నిర్మించి మహిళలు ఎదు ర్కొంటున్న ప్రధాన సమస్యను తొలగించాలని కోరుతున్నారు. మరుగు దొడ్లు నిర్మించకుంటే బస్టాండ్‌కు మరమ్మతులు చేసి దండుగేనని అంటున్నారు.