Home దునియా పాటల టంకశాల మన ఘంటసాల

పాటల టంకశాల మన ఘంటసాల

Ghantasala

ఘంటసాల… ఆ పేరే చాలు మనసు పులకరించి పోవడానికి , ఆ గానమే నిరంతరం కొత్త అనుభూతులనిస్త్తూ మనసును ఏవేవో లోకాల్లో విహరింపచేయిస్తుంది. అందుకే ఎందరికో ఆయన ఆ గానం అనుదినం గుర్తొచ్చి ఆనందింప చేయిస్తుంది. ఇంకా చాలా మందికి అనుక్షణం స్మరణకు వస్తూ పులకరింపచేస్తుంది. ఆయన ఒక సంగీత మూర్తి గా, సరస్వతీ పుత్రుడుగా అన్ని భాషా గాన ప్రియుల మదిని దోచుకోగలిగారు.గాయకుడి గా అడుగిడిన దశలో, సంగీత దర్శకుడుగా ఎదుగుతున్న క్రమంలో అప్పటి రంగ స్థల గాయక నటులు ఆరోహణ, ఆవరోహణలతో పులకరింప చేస్తూ , కొన్ని సందర్భాలలో కంఠాన్ని విభిన్న కంపనాలకు గురి చేస్తు ప్రేక్షక శ్రోతల హృదయలలో చక్కని చోటు దక్కించుకుంటుంటే తను ఒకకొత్త దనాన్ని స్వరంలో చూపాలని , మృదువుగా, సౌమ్యంగా ,లలితంగా , సామాన్యంగానే ఆలపిస్తూ అసమాన్య గుర్తింపు తెచ్చుకుంటూ, తన ప్రత్యేకతను చాటారు ఘంటసాల వెంకటేశ్వరరావు.

తొలి దశాబ్దంలో అంటే 1944 నుంచి లలిత గీతాలు , దేశభక్తి గీతాలు, సినీ గీతాలు , పుష్సవిలాపం వంటి వాటిని పై తరహాలోనే ఆలపిస్తూ మంత్ర ముగ్ధులను చేశారు. 1951 నుంచి పాడే పాటల తీరులో మార్పు తీసుకొచ్చారు. అక్కినేని , ఎన్.టి.ఆర్ చిత్రాల్లో వారికి పాటలు పాడుతూ తను పాడే పాట ద్వారా ఎవరికి పాడుతున్నారో వినే వారికి తెలిసేలా తన స్వరంతో బేధాన్ని చూపాలని వారి స్వరాలను అనుసరిస్తున్నట్టు లేదా అనుకరిస్తున్నట్లు పాడుతూ, ఇది అక్కినేనికి పాడిన పాట, అది ఎన్.టి.ఆర్ కి పాడిన గీతం అని ప్రేక్షకులు, శ్రోతలు విన్న క్షణంలోనే గుర్చొచ్చేలా చేసారు. అలాగే హాస్య నటులకు ఎస్‌విఆర్ వంటి వారికి పాడే తీరులోను మార్పు చూపించసాగారు. తన స్వరంతో ఒక్క దశాబ్దంలో ఒక్కో తరహాలో తన కంఠానికి పదును పెట్టి, పరిణతి వచ్చేలా గానామృతం చిలికించిన అమర గాయకుడు.

ఘంటసాలలోని ఆ ప్రతిభ కారణంగా పాటల విక్రయానికి పునాది అవుతాయని అందరు నటులకు పాడమని సంగీత దర్శకులు, దర్శక, నిర్మాతలు ఆసక్తి ప్రదర్శిస్తూ ఒత్తిడి చేసినా తప్పని సరైనప్పుడే పాడుతూ బతుకు, బతికించు, బతుకులు పండించు అనే సిద్ధాంతానికి కట్టుబడి సహచర గాయకులు కూడా చిత్రరంగంలో ఇతోధికంగా వర్ధిల్లేందుకు తన వంతు కృషి చేయడమే గాక జీవితాంతం వరకు ఆ సూత్రాన్నే అనుసరించి మార్గదర్శి అయ్యారు. అంతే కాదు ఎందరో వర్ధమాన గాయకులు వేదికల మీద కచేరీల్లోనూ ఆయన పాటలు పాడటం ద్వారా శ్రోతలను మెప్పిస్తూ చక్కని జీవనోపాధిని పొందుతున్నారు. స్వర జ్ణానం లేని వారు కూడా వీధుల్లో , రైళ్లలో , ఇతర చోట్ల ఘంటసాల పాడిన పాటలే పాడుతూ అదే సంపాదన మార్గంగా చేసుకోవడం విశేషమే ! దేశభక్తి గురించి సత్ప్రవర్తన గురించి , తండ్రి మృదంగ వాయిద్యకారుడైన ఘంటసాల సూరయ్య చెప్పిన మాటలు జీవితాంతం గుర్తుంచుకుని అనుసరించేలా చేసాయి.

క్విట్ ఇండియా ఉద్యమంలో 1942 ఆగస్ట్‌లో పాల్గొని 18 నెలలు కఠిన కారాగార శిక్షను గుడివాడ, రాజమండ్రి, బళ్లారి జైళ్లలో ఆనుభవించారు. ఆ తరువాత దేశం క్లిష్ఠ పరిస్థితుల్లో వున్నప్పుడు సంగీత కచేరీలు నిర్వహించగా వచ్చిన ఆదాయాన్ని దేశ రక్షణ నిధికి ఇచ్చేవారు. కృష్ణ్ణా జిల్లా పెదపులిపర్రులో మార్చి 3,1944 న ఘంటసాల కు సావిత్రితో వివాహమైన సందర్భంగా ఆయన నిర్వహించిన సంగీత కచేరీ విన్న సీనియర్ సముద్రాల మద్రాసు వచ్చేయమని చెప్పడంతో మే నెలలో మద్రాసు వెళ్లారు. ఘంటశాలను తన కొడుకులా ఆదరించి ఆవకాశాలు కల్పించే ప్రయత్నం చేయడంతో క్రమ క్రమంగా గాయకుడుగా ఎదిగారు. ఈ లోగా శ్రీసీతారామ జననం తదితర చిత్రాల్లో చిన్న వేషాలు వేసారు. బి. ఎన్. రెడ్డి రూపొందించిన స్వర్గ సీమలో భానుమతితో కలసి పాడటంతో ఘంటసాల గాయక ప్రస్థానాల అరే హాలే వెన్నెల చిరునవ్వులు విరజిమ్ము పఠాణీ … గీతంతో ప్రారంభమైంది.

గోపీచంద్ దర్శకత్వంలో శోభనాచల పతాకాన నిర్మించిన లక్ష్మమ్మ చిత్రానికి సంగీత దర్శకత్వం చేసే అవకాశం తొలిసారి వచ్చింది. ఈ చిత్రం చేస్తుండగా ఘంటసాల బలరామయ్య స్వీయ దర్శకత్వంలో అక్కినేనితో నిర్మించిన కీలుగుర్రం చిత్రానికి సంగీత దర్శకుడు అయ్యాడు. కీలుగుర్రం 19 ఫిబ్రవరి, 1949న విడుదలైన చిత్రంతో పాటు పాటలు ఘన విజయం సాధించాయి. లక్ష్మమ్మ 26,ఫిబ్రవరి, 1950న విడుదలై ఆ చిత్రం పాటలు హిట్టయ్యాయి. బాలరాజు చిత్రంలో అక్కినేనికి తొలిసారి , షావుకారు చిత్రంలో ఎన్.టి.ఆర్ కి తొలిసారి ఘంటసాల పాడారు. దేవదాసు పాటలు , మల్లీశ్వరి పాటలు ఘంటసాలకు తెచ్చిన పేరు అంతా ఇంతా కాదు. తొలి దశలో ఘంటసాల స్వరం బాగా లేదని తిరస్కరించిన హెచ్.ఎం.వి సంస్థ ఆ తరువాత అనేక పాటలు పాడించడం విశేషం. పంకజ్ మల్లిక్ , సైగల్ , మహమ్మద్ రఫీల గానాన్ని అధికంగా అభిమానించేవారు. నౌషాద్ సంగీతం , సాలురి రాజేశ్వరరావు సంగీతం అంటే చెవి కోసుకునేవారు ఘంటసాల.

కస్తూరీ తిలకం లలాట ఫలకే వక్షస్థలే కౌస్తుభం… శ్లోకాన్ని తొలిసారి 1956లో చింతామణి చిత్రంలో పాడారు. 1957 లో పాండురంగ మహత్యంలో పాడినప్పుడు ఇంకా వైవిధ్యం చూపారు. సప్త స్వరాలు చిత్రం కోసం 1969 లో మరో ప్రత్యేకత చూపారు. 1969 లో బుద్ధిమంతుడు చిత్రంలో పాడి కంఠంలోని తన విభిన్నత తెలిపారు. మంచి పాటలు పాడినప్పుడు మరింత సంతోషంగా వుండటమే కాదు మొహం కళ కళలాడుతూ వుండేది. పాటలు పాడేటప్పుడు నిలబడే పాడాలి.హెచ్చు స్థాయిలో పాటలు పాడేటప్పుడు కాళ్ళు బాగా నిగడదన్ని ఒళ్ళు ఎక్కువగా బిగపట్టి పాడేవారు. క్రమ క్రమంగా ఇలాంటి హెచ్చు స్థాయి లో పాటలు పాడినప్పుడు తలనొప్పి , కాళ్ల నొప్పులు చాలా ఎక్కువగా వచ్చేవి. సాహిత్యం బాగాలేని పాటలు పాడలం ఇష్టం లేకపోయినా తప్పనిసరై జాగ్రత్తగా పాడేవారు తప్ప చెడగొట్టేవారు కాదు.

తెలుగులో 88 చిత్రాలకు మిగతా భాషల్లో 22 చిత్రాలకు ఘంటసాల సంగీత దర్శకత్వం చేసారు. ఆయన సంగీత దర్శకత్వం చేసిన సినిమాల్లో పాటలు హిట్ కావడమే కాకుండా శతదినోత్సవాలు , రజతోత్సవాలు జరుపుకునేవి. సాధారణంగా రాసిన పాటలకే బాణీలు కూర్చేవారు. తనకు ఏవైనా బాణీలు నచ్చితే వాటిని తయారు చేసి ఆ ప్రకారం రాయమని కోరడం జరిగేది అప్పుడప్పుడు. సంగీత దర్శకుడుగా, గాయకుడుగా ప్రయోగాలు చేస్తున్న ఇతర సంగీత దర్శకులకు పాడేటప్పుడు తాను గాయకుడు అనే విషయాన్ని దృష్టిలో పెట్టుకుని వ్యవహరించేవారు. వారికి పూర్తి స్వాతంత్య్రం ఇస్తూ మర్యాద, మన్నన, గౌరవం పాటించేవారే కాని, వారు చేసే పనిలో జోక్యం చేసుకునేవారు కాదు. సాలూరి రాజేశ్వరరావు సంగీత దర్శకత్వంలో యశోద కృష్ణ చిత్రంలో గుమ్మడి పాత్రకు చక్కని వాడే బలే టక్కరివాడే … పాటను సుశీలతో కలసి పాడారు. 1975 లో విడుదలైన ఈ చిత్రంలోదే ఘంటసాల చివరిపాట. పాతాళ భైరవి ,పెళ్లిచేసిచూడు, పెళ్లిసందడి, గుండమ్మకథ, జయంమనదేరా , శాంతినివాసం , మాయాబజార్ , పాండవ వనవాసం, పరమానందయ్యగారి శిష్యుల కథ, లవకుశ ఇలా ఎన్నో చిత్రాలకు ఆయన కూర్చిన సంగీతం, ఆయన పాడిన, పాడించిన పాటలు రసగుళికలే. 4 డిసెంబర్ 1922 న కృష్ణాజిల్లా చౌటపల్లిలో జన్మించిన ఘంటసాల 11 ఫిబ్రవరి 1974 మద్రాసులో కాలధర్మం చెందారు.

-వి.ఎస్. కేశవరావు, 9989235320