Home రాష్ట్ర వార్తలు రాష్ట్రంలో ఓటర్లు 2.95 కోట్లు

రాష్ట్రంలో ఓటర్లు 2.95 కోట్లు

Votersఅదనంగా చేరిన వారు 16.51లక్షల మంది
తొలగించిన వారు 1.75లక్షల మంది, 22న తుది జాబితా

హైదరాబాద్: రాష్ట్రంలో 16.51 లక్షల మంది అదనపు ఓటర్లు చేరనున్నారు. దీంతో ఈ నెల 22వ తేదీన ప్రకటించనున్న తుది జాబితాలో మొత్తం 2.95 కోట్ల మంది ఓటర్లు ఉంటారని అధికారులు అంచనా వేస్తున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమం గత డిసెంబర్ 25వ తేదీ నుంచి ఓటరు నమోదు, అభ్యంతరాల స్వీకరణ కొనసాగింది. ఈ నెల 4వ తేదీతో నియోజకవర్గం, అడ్రస్, పేర్లలో మార్పునకు గడువు ముగిసింది. మొత్తంగా 23.71 లక్షల దరఖాస్తులు వచ్చాయి. అన్ని జిల్లాల కలెక్టర్లు, రిటర్నింగ్ అధికారులు, ఇఆర్‌ఒలు, బూత్ స్థాయి అధికారులు 14వ తేదీ వరకు వచ్చిన దరఖాస్తులపై పరిశీలన చేసి పరిష్కరించారు.

మొత్తం వివిధ అభ్యర్థనల కింద వచ్చిన 23.71 లక్షల దరఖాస్తుల్లో 21.17 లక్షల దరఖాస్తులకు ఆమోదం లభించింది. మరో 15,896 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నట్లు సిఇఒ రజత్ కుమార్ శుక్రవారం మన తెలంగాణకు చెప్పారు. ఇందులో అత్యధికంగా ఫామ్6 (ఓటరు నమోదు) దరఖాస్తులు 17.97 లక్షలు రాగా 16.46 లక్షల దరఖాస్తులను ఆమోదించారు. 1.40 లక్షల దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యాయి. మరో 10,630 ఆప్లికేషన్స్ పెండింగ్‌లో ఉన్నాయి. వీటిలో మరో 5 వేల దరఖాస్తులకు ఆమోదం లభించే అవకాశం ఉన్నట్లు సిఇఒ కార్యాలయ వర్గాలు పేర్కొన్నాయి. ఫామ్ 6ఎ కింద 2091 దరఖాస్తులు రాగా 1011 ఆమోదించారు. ఫామ్ 7ఎ కింద 1.97 లక్షల దరఖాస్తులు రాగా 1.79 లక్షల ఓటర్లను తొలగించేందుకు ఆమోదించారు. పామ్ 8కు 2.22 లక్షలు, 8ఎకు 1.50 లక్షల దరఖాస్తులు వచ్చాయి.

2030 పోలింగ్ స్టేషన్‌లు
కేంద ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం పట్టణ ప్రాంతాల్లో అయితే 1400 ఓటర్లు మించకుండా, రూరల్ ప్రాంతాల్లో అయితే 1200 మించకుండా పోలింగ్ కేంద్రం ఏర్పాటు కావా ల్సి ఉంటుంది. వాస్తవానికి రాష్ట్రంలో 32,594 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. వీటికి అదనంగా 2030 ఏర్పాటు చేసేందుకు ఇసి ఆమోదం తెలిపింది. దీంతో ఈ పార్లమెంట్ ఎన్నికల్లో పెరిగిన ఓటర్ల సంఖ్యకు అనుగుణంగా 34,624 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు.

14 వరకు స్వీకరించిన ఓటరు దరఖాస్తుల వివరాలు
దరఖాస్తు నమూనా       వచ్చినవి       ఆమోదించినవి       పెండింగ్
ఫామ్ 6              1797628         1646945        10630
ఫామ్ 6ఎ            2091               1011              336
ఫామ్ 7             197818          179733             1027
ఫామ్ 8             222914           157088           2471
ఫామ్ 8ఎ          150685            132547            1432
మొత్తం          23,71,136         21,17,324           15,896

Total Voters in Telangana 2.95 Crore