Home వార్తలు పదునెక్కిన  ఫీల్డింగ్

పదునెక్కిన  ఫీల్డింగ్

cricketఏడాది క్రితం వరకూ టీమిండియా ప్రధాన సమస్యల్లో ఫీల్డింగ్ ఒకటి. జట్టులో ఒకరిద్దరిని మినహాయిస్తే మిగిలిని వారందరూ బద్దకస్తులే. బ్యాటింగ్, బౌలింగ్‌లలో మెరుగైనా ప్రదర్శన చేసినా చెత్త ఫీల్డింగ్‌తో ఓటమి చవిచూసిన సందర్భాలెన్నో ఉన్నాయి. అయితే ఏడాదిగా టీమిండియా ఫీల్డింగ్ మార్పు కనిపిస్తోంది. టీ-20ల ప్రభావమో లేక మెరుగైన ఫీల్డింగ్ అవసరమని గుర్తించారో జట్టులో ప్రతి ఫీల్డరూ అద్భుత విన్యాసాలతో ఆకట్టుకుంటున్నారు.

కోహ్లి చొరవతోనే..
టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లి చొరవ చూపడంతోనే భారత్ ఫీల్డింగ్ ప్రమాణాలు మెరుగుపడ్డాయని ఫీల్డింగ్ కోచ్ ఆర్ శ్రీధర్ అంటున్నాడు. బౌలింగ్, బ్యాటింగ్‌లతో పాటు ఫీల్డింగ్‌కు కూడా ప్రాధాన్యమివ్వాలనే ఉద్దేశంతో టీమిం డియాకు ఆడే ప్రతి ఒక్కరూ ఫీల్డింగ్ ప్రాక్టీస్ చేయాలనే నిబం ధన శ్రీలంక పర్యటనకు ముందు కెప్టెన్ కోహ్లి తీసుకు వచ్చాడు. దీనిలో భాగంగా ప్రతిరోజూ జరిగే జట్టు ప్రాక్టీస్ సెషన్‌లో కనీసం 20 నిమిషాలైనా క్యాచ్‌ల ప్రాక్టీస్ చేయాలని ఆటగాళ్లను కోరాడు. ఆ ఒక్క మార్పుతోనే టీమిండియా ఫీల్డింగ్ మెరుగుపడిందని శ్రీధర్ తెలిపాడు.

మహమ్మద్ అజాహరుద్దీన్, రాబిన్ సింగ్, మహమ్మద్ కైఫ్, యువరాజ్ సింగ్.. భారతకు ఆడిన మెరుపు ఫీల్డర్లు ఎవరు అనగానే ముందు గుర్తొచ్చే ఆటగాళ్లు వీళ్లే. టీమిండియాకు ఆడిన వారిలో దిగ్గజ బ్యాట్స్‌మెన్, దిగ్గజ బౌలర్లు లెక్కలేనంత మంది ఉన్నా.. మెరికలాంటి ఫీల్డర్లు మాత్రం చాలా తక్కువే. భారత ఫీల్డర్లలో చాలా మంది ప్రత్యర్థి బ్యాట్స్‌మన్ కొట్టిన బంతి తమకు అంగులం దూరంలోనే వెడుతున్నా… మరో ఫీల్డర్‌కు చేయి చూపించే దృశ్యాలు మనం చాలానే చూశాం. ఆస్ట్రేలియా, దక్షిణా ఫ్రికాలాంటి పటిష్ట జట్లతో పాటు పసికూన ఐర్లాండ్, బంగ్లాదేశ్ ఫీల్డర్లు కూడా రెప్పపాటులో బౌండరీకి వెళ్లే బంతిని తమ అద్భుత విన్యాసాలతో ఆపి స్కోరుబోర్డుపై ఒకటి, రెండు పరుగులు ఆపుతుంటే అరే.. మనకు ఎప్పుడు ఇలాంటి ఫీల్డర్లు దొరికేదని బాధపడని భారత అభిమాని ఉండడు. టీమిండియా ఫీల్డింగ్ ప్రమాణాలు పెంచడానికి గతంలో జట్టు మేనేజ్‌మెంట్ ఎంత ప్రయత్నం చేసినా వృథానే అయింది. అయితే గత ఏడాదిగా భారత అభిమాని గర్వపడేలా టీమిండియా ఫీల్డింగ్ మెరుగైంది. టీ-20ల ప్రభావమో లేక జట్టులోకి యువ రక్తం చేరడమో.. ఒకరిద్దరూ కాకుండా జట్టుకు ఎంపికైన ప్రతి ఒక్కరూ ఫీల్డింగ్‌లో మెరుపు విన్యాసాలతో ఆకట్టుకుంటున్నారు. తాజాగా సఫారీలతో ముగిసిన టెస్టు సిరీసే దీనికి ఉదాహరణ. బెంగళూరులో జరిగిన రెండో టెస్టు తొలిరోజు ప్రమాదకర ఏబీ డివిల్లియర్స్ ఇచ్చిన క్లిష్టమైన క్యాచ్‌ను వికెట్‌కీపర్ సాహా కళ్లకు నమ్మశక్యం కాని రీతిలో అందుకొని అందరిని ఆశ్చర్యానికి గురిచేశాడు. ఢిల్లీలో జరిగిన నాల్గో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో క్రీజులో ఒంటరిపోరాటం చేస్తున్న ఏబీ క్యాచ్‌ను బౌండరీ లైన్ వద్ద అద్భుతంగా ఒడిసిపట్టుకున్నాడు. ఇక శ్రీలంక పర్యటనలో సంగక్కర ఇచ్చిన క్యాచ్‌ను స్లిప్‌లో అజింక్యా రహానె ఒంటి చేత్తో డైవ్ చేసి అందుకోగా, మరో టెస్టులో మాథ్యూస్ క్యాచ్‌ను గల్లీలో రోహిత్‌శర్మ క్షణం పాటులో నేలను తాకే బంతిని గాల్లో ఎగిరి అందుకున్నాడు. వీరే కాదు జట్టులో చోటు దక్కించుకుం టున్న ఓపెనర్లు ధావన్, విజయ్, పుజారా, జడేజా, అశ్విన్ ఇలా ప్రతి ఒక్కరూ మెరుపు ఫీల్డింగ్‌తో పరుగులను నియంత్రిస్తూ బ్యాట్స్‌మన్‌పై ఒత్తిడి పెంచుతున్నారు.
క్రీడావిభాగం