Home దునియా నేచురల్ బ్యూటీ.. ఊటీ

నేచురల్ బ్యూటీ.. ఊటీ

Tourist Places in Ooty of Tamilnadu State

అందానికి అందం.. అద్భుతాలకు ఆలవాలం.. మండుటెండలలో మలయమారుత నిలయం ఉదకమండలం. దీన్నే షార్ట్‌గా అంతా ఊటీ అంటారు. ప్రకృతిలో చూడగల అన్ని రకాల అందాలనూ తిలకించడానికి ఇదే గొప్ప సమయం. మండే ఎండలలో బతకలేని వారికి మరో హిమాలయం ఈ ఉదకమండలం. పచ్చదనం పరుచుకున్న కొండలు, ఆకాశాన్ని తాకే కొండల శిఖరాలు, మేఘాలనే తమ స్థాయికి దించుకునే లోయలు, పరవశింపజేసే చల్లని గాలులు, చూద్దామన్నా కానరాని కాలుష్యపు జాడలు అహో ఊటి నీకు నీవే సాటి అనిపించే విధంగా ఉంటుంది. ఈ అంతర్జాతీయ వేసవి విడిదిలో సేద తీరేందుకు ఎక్కడెక్కడి వారు ఇక్కడికి వస్తుంటారు. ఒంటి నిండా గాలిని, మనసు నిండా మనోహరమైన అనుభూతిని నింపుకుని వెళ్తుంటారు. 

ఈ నీలగిరి పర్వత ప్రాంతాలలో చూడదగ్గ ప్రదేశాలు అనేకం ఉన్నాయి. వాటిలో ముఖ్యమైన వాటిని సంక్షిప్తంగా చూద్దాం.
నీలగిరి రైల్వేస్టేషన్: దీన్ని 1908లో బ్రిటిష్‌వారు నిర్మించారు. ఇదొక వరల్డ్ హెరిటేజ్ సైట్‌గా గుర్తించారు. ఇక్కడి నుంచి 42కి.మీ. మేర తిరుగుతూ ప్రకృతి అందాలను చూపించే బొమ్మ రైలు ఉంది. ఇది మెట్టుపాళ్యెంలో బయల్దేరి ఊటికి చేరుతుంది. 5 గంటలపాటు ఉండే ఈ ప్రయాణంలో రైలు 7,200 అడుగుల ఎత్తున ట్రావెల్ చేస్తుంది. ఈ ప్రయాణంలో అనేక గుహలు, జలదరింపజేసే మలుపులు, వంతెనలు ఉంటాయి. దిల్ సే సినిమాలో షారుఖ్‌ఖాన్ నటించిన చయ్య చయ్య పాటను ఇక్కడే షూట్ చేశారు.

ఫెర్న్‌హిల్ ప్యాలెస్ : 1844వ సంవత్సరంలో నిర్మించిన ఫెర్న్‌హిల్ ప్యాలెస్ ఉంది. ఇది ఒకప్పుడు మైసూర్ మహారాజావారి వేసంగి విడిది. అలాగే 1822లో జాన్ సల్విన్ నిర్మించిన రాతిభవంతి ఉంది. దీన్ని స్టోన్ హౌస్ అని పిలుస్తారు. ప్రస్తుతం ఇది ప్రభుత్వ ఆర్ట్‌కాలేజీ. ఇందులో అందమైన శిల్పకళాఖండికలెన్నో ఉన్నాయి. అలాగే ప్రభుత్వం నిర్వహిస్తున్న మ్యూజియం కూడా ఉంది.

ఊటీలేక్ : ఊటీలో తాపీగా ఎంజాయ్ చేయదలచుకున్న వారికి ఈ లేక్ ఎంతో హాయిని ఉల్లాసాన్ని ఇస్తుంది. 1825లో నిర్మించిన ఈ చెరువు 2.5 కి.మీ పొడవుతో ఉంటుంది. చుట్టూ పచ్చని కొండలు, పూల మొక్కలు కనువిందుచేస్తూ మనసుకు హాయినింపుతాయి. ఊటీకి 10 కి. మీ. దూరంలో కామరాజ్ లేక్ ఉంది. నిజానికి ఇది ఒక డ్యామ్. ఇది అడవిలో ఉన్న లేక్ కావడం వల్ల ఎన్నో అందమైన దృశ్యాలు మనకు కనబడతాయి. స్థానికులు దీన్ని ఫిషింగ్‌కు వాడుకుంటారు.

బొటానికల్ గార్డెన్ : 22 హెక్టార్ల విస్తీర్ణంలో విస్తరించుకున్న ఉల్లాసకరమైన ఉద్యానవనమిది. ఇందులో 650 రకాల పూల, ఫల జాతుల వృక్షాలు ఉన్నాయి. ఈ గార్డెన్‌లో 20 మిలియన్ల సంవత్సరాలనాటి వృక్ష అవశేషం ఉంది. అలాగే ఈ పార్క్ సమీపంలో తొడ అనే పురాతన గిరిజన తెగ ఆవాసం ఉంది. ఈ ఊటిలోనే సిమ్స్‌పార్క్ ఉంది. 1874లో జె.డి.సిమ్స్, మేజర్ ముర్రే కలిసి ఈ పార్క్‌ను అభివృద్ధిచేశారు. 12 ఎకరాలలో ఉన్న ఈ పార్క్ లో అందమైన ల్యాండ్‌స్కేప్‌లున్నాయి. యేటా మే నెలలో కూరగాయల ప్రదర్శన ఉంటుంది. అలాగే రోజ్‌గార్డెన్ చూసి తీరాల్సిన తోట. మనదేశంలోనే అతి పెద్దదైన రోజ్‌గార్డెన్ ఇది. 10 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ గార్డెన్‌లో అనేక జాతుల రోజాలు, ఎరపు, నలుపు, పసుపు, పచ్చ, గోధుమ రంగులలో అనేక రకాల రోజాలు కనబడతాయి. మీనియేచర్ రోజాలు, హైబ్రిడ్ టీ రోజాలు, ప్లోరీబండా, రాంబ్లర్స్ వంటి జాతులు అనేక ంకనబడతాయి. సినిమావాళ్ళను అమితంగా ఆకర్షించే 6వ మైలు ఏరియా ఎంతో సుందరంగా ఉంటుంది.

టీ మ్యూజియం : దొడబెట్ట వెళ్ళే దారిలో టీ మ్యూజియం ఉంది. ఇక్కడ టీపొడి తయారుచేసే ఫ్యాక్టరీ ఉంది. ఒక ఎకరా టీ తోట ఉంది. మనం రోజూ తాగే టీకి ఉన్న చరిత్ర తెలుసుకోడానికి ఇదొక అద్భుతమైన అవకాశం.

దొడ్డబెట్ట : అద్భుతమైన కొండ శిఖరం ఈ దొడ్డబెట్ట. ఇక్కడి చేరుకునేసరకే అంతకు ముందున్న వాతావరణం మొత్తంమాయమైపోతుంది. మిట్టమధ్యాహ్నం కూడా వణికించే చల్లనిగాలులు వీస్తాయి. ఇక్కడి వాతావరణాన్ని ఎంజాయ్ చేయడానికి, ఈ ఎత్తయిన ప్రాంతం నుంచి లోయలు, కోనలు చూడడానికి ఎక్కడెక్కడి వారూ వస్తుంటారు. ఇది ఊటికి 10కి.మీ. దూరంలోఉంది. చుట్టూ వ్యాపించి ఉన్న నీలగిరులు సమున్నత సౌందర్య శిఖరాలను, పర్యావరణాన్ని సన్నిహితంగా చూడడానికి టెలిస్కోప్ కేంద్రం కూడా ఉంది.

ల్యాంబ్స్ రాక్ : కూనూర్ నుంచి 8 కి.మీ. దూరంలో ఉంది ఈ ల్యాంబ్స్ రాక్. ఇక్కడి నుంచి చూస్తే పరిసరాలలో పరచుకున్న అడవుల సౌందర్యాన్ని నేత్రపర్వంగా చూడవచ్చు. దీనికి కొద్దిపాటి దూరంలో డాల్ఫిన్స్‌నోస్ ఉంది. ఇది సముద్ర ఉపరితలానికి వెయ్యి అడుగుల ఎత్తున ఉంది. అచ్చంగా డాల్ఫిన్ ఫిష్ ముక్కులా ఉండే ఈ కొండ కూనూర్ వెళ్ళే దారిలో ఉంది. ఊహకు అందని ఈ అద్భుతాల కొండను మిస్సవకుండా చూడాలి. ఇక్కడే ఎత్తయిన కొండలలోంచి దూకే కాథెరిన్ ఫాల్స్ ఉన్నాయి.

ఆలయాలు మందిరాలు : ఇక్కడ ఎల్క్‌హిల్ సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయం ఉంది. తైపుసం అనే ఉత్సవం ఇక్కడ ఘనంగా జరుగుతుంది. సెయింట్ స్టీఫెన్ చర్చ్ కూడా చూడాల్సిన ప్రార్థనామందిరం. 1829లో నిర్మించిన ఈ చర్చికి ఉపయోగించిన భారీ కలప దుంగలను ఏనుగులు 120 కి.మీ. దూరంలో ఉన్న టిప్పుసుల్తాన్ సమ్మర్ ప్యాలెస్ ప్రాంతం నుంచి మోసుకువచ్చాయి.

ఎలా చేరుకోవాలి?: హైదరాబాద్ నుంచి ఊటీ చేరుకోడానికి రైలు సదుపాయం గానీ, విమాన సదు పాయంగానీ లేదు. రైలైతే మైసూర్ వచ్చి అక్కడి నుంచి బస్సు ద్వారా కానీ, క్యాబ్‌లో కానీ ఊటీ చేరుకోవచ్చు. విమానంలో రావాలనుకునే వారు కోయంబత్తూ రుకు చేరుకోవాలి. అక్కడి నుంచి మెట్టుపాళ్యెం అక్కడి నుంచి కూనూర్ చేరుకోవడంతో ఊటీ యాత్ర మొదలవుతుంది.