Friday, April 26, 2024

పర్యాటక పరంగా పెరిగిన రద్దీ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : శనివారం వీకెండ్ కావడంతో పాటు క్రిస్మస్ సెలవుల నేపథ్యంలో పర్యాటక శాఖకు కాసుల వర్షం కురిపిస్తున్నాయి. క్రిస్మస్‌పండుగకు ఇప్పటికే నాలుగైదు రోజులు సెలవులు వస్తుండగా దీనికి నూతన సంవత్సర వేడుకలు కూడా తోడవుతున్నాయి. దీంతో పలువురు పర్యాటక ప్రాంతాల సందర్శనకు ప్రాధాన్యత నిస్తూ పలు ప్రాంతాలకు తరలి వెళ్తున్నారు. తిరుపతి, శ్రీకాళహస్తీ కాణిపాకం, షీర్డీ,గోవాకి వెళ్తున్న వారు కొందరైతే అందాల అరకు, కోనసీమ ప్రాంతాల సందర్శనకు మరి కొందరు ప్రాధాన్యతను ఇస్తున్నారు. ఖర్చుల గురించి ఆలోచించ కుండా ఎంజాయ్ చేసి వచ్చేవారు కొందరైతే బడ్జెట్ చూసుకుని హైదరాబాద్ భాగ్యనగరంతో పాటు తెలంగాణలోని లక్నవరం, రామప్ప దేవాలయం తదితర దర్శనీయ స్థలాలను చూసి వస్తున్నవారు మరి కొందరు ఉండడం విశేషం.

క్రిస్మస్‌కు కుదరదనుకుంటున్న వారు సంక్రాంతి సెలవుల కోసం కూడా ఇప్పటి నుండే తమ హాలిడే ప్యాకేజీలను బుక్ చేసుకుంటున్నారు. సంక్రాంతి కోసం రోజుకు సగటున నాలుగు నుండి ఐదు వేల మంది ప్యాకేజీ టూర్ల కోసం బుక్ చేసుకుంటున్నారని పర్యాటక శాఖ అధికారులు మన తెలంగాణకు తెలిపారు. కిందటి సంవత్సరం కరోనా నేపథ్యంలో పర్యాటకులు ఒకింత నిరాశ పడ్డారు. అయితే ఈ సంవత్సరం కరోనా అంతటి తీవ్రత లేక పోవడం, కొత్త తరం వేరియంట్ పైనా ఇప్పటి నుండి నిపుణులు దృష్టి పెట్టడంతో పర్యాటకులు ఆ స్థాయిలో ఆందోళన ఏమీ చెందడం లేదు.
తెలంగాణలో పర్యాటక స్థలాలు ఇవీ…
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో నాగార్జున సాగర్ ప్రాజెక్టు దర్శనీయ స్థలం. వర్షాలు వచ్చి విడుదల చేస్తే చూసేందుకు పర్యాటకులు పోటెత్తుతుంటారు. ఎత్తిపోతల జలపాతంతో పాటు నాగార్జున సాగర్ కొండ, మ్యూజిఎం, జలవిద్యుత్ కేంద్రంతో పాటు తెలంగాణ ప్రభుత్వం ఇటీవల తీర్చిదిద్ధిన బుద్ధవనం ను చూసేందుకు పర్యాటకులు ఇష్టపడుతుంటారు. బహుళార్థక సాధక ప్రాజెక్టు కావడంతో ఇక్కడ జలవిద్యుత్ కేంద్రం కూడా ఉంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో కాకతీయ ఏకశిలాతోరణం, వెంకటేశ్వర స్వామి ఆలయం, ఐనోలు మల్లన్న ఆలయం, కాజీపేట దర్గాలు చాలా ప్రముఖ మైనవి. వికారాబాద్ జిల్లాలో అనంతగిరిలోని అనంత పద్మనాభ స్వామి ఆలయం, తాండూరు గనులు చెప్పుకోదగ్గవి.
మహబూబాబాద్ జిల్లాను తీసుకుంటే ఇక్కడ ప్రపంచంలోని కాలుష్య రహిత చెరువుల్లో ఒకటిగా ఉన్న పాకాల చెరువు చెప్పుకోదగ్గది. దీన్ని గణపతి దేవుని సేనాని అయిన రుద్రుడు నిర్మించారు. మానేరుపై నిర్మించిన ఈ చెరువు రెండు గుట్టల మధ్యన ఉంటుంది. దీని పక్కనే అభయారణ్యం కూడా ఉంటుంది. జింకలు లేళ్లు దుప్పులు ఇక్కడ ఎక్కువగానే ఉంటాయి. మంచిర్యాల జిల్లాలో కవ్వాల్ పులుల సంరక్షణ కేంద్రం , ప్రాణహిత వణ్యప్రాణి సంరక్షణ కేంద్రాలు ముఖ్యమైనవి . ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో నిజాం సాగర్ ప్రాజెక్టు ముఖ్యమైనదిగా చెప్పవచ్చు. మంజీరా నదిపై ఏడో నిజాం ఈ నదిని 192331లో నిర్మించాడు.
పర్యాటకులకు కలిసివస్తున్నప్యాకేజీలు
కాగా ఆర్‌టిసి బస్సుల్లో గానీ, లేదా ప్రైవేటు టూరిస్టుల బస్సులతో పోలిస్తే తెలంగాణ టూరిజం బస్సులు అత్యంత చవక అని పర్యాటక శాఖ అధికారులు చెబుతున్నారు. తెలంగాణ టూరిజం శాఖ పర్యాటకులకు ప్రకటించిన ప్యాకేజీల వివరాలు విశ్వసనీయంగా అందిన సమాచారం మేరకు ఇలా ఉన్నాయి. తెలంగాణ టూరిజం ద్వారా తిరుపతి తిరుమల టూర్‌కు గాను పెద్దలకు రూ. 3700 పిల్లలకు రూ. 2960గా తీసుకుంటున్నారు. అదే తిరుపతి-తిరుమల కాణిపాకం కూడా చేరిస్తే పెద్దలకు రూ. 4400, పిల్లలకు గాను రూ. 3520 ఛార్జీ చేయనున్నారు. షిర్డీ – పండరీపూర్‌కు గాను పెద్దలకు రూ. 3, 100 పిల్లలకు రూ. 2,530 వసూలు చేస్తారు.

భోగతా జలపాతం కోసం పెద్దలకు రూ. 1600 పిల్లలకు రూ. 1280 చొప్పున ఛార్జీ చేస్తారు. అందాల అరకు చూడాలనుకునే వారికి తెలంగాణ టూరిజం శాఖ ప్రత్యేక ప్యాకేజీలను ఛార్జీ చేస్తోంది. నాలుగు రాత్రులు, మూడు రోజులు లెక్కన అన్నవరం, సింహాచలం, వైజాగ్, ఆర్‌కే బీచ్, మ్యూజీఎం, కైలాసగిరి, అరకు బొర్రా గుహలు అనంతగిరిని కూడా కవర్ చేస్తారు. ఇందుకోసం పెద్ద వారికి సుమారు ఏడు వేల వరకు, పిల్లలకు ఐదు వేల ఆరువందల వరకు ఛార్జీ చేయనున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్‌లో రోజు వారీగా రామోజీఫిలిం సిటికి కూడా ప్రత్యేక టూరిజం బస్సులు నడుపుతున్నారు. పెద్దలకు రూ. 1900, పిల్లలకు రూ. 1500 వరకు ఛార్జీ చేయనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News