Home నల్లగొండ విషపు కుంపటి

విషపు కుంపటి

Toxic-Wastageదామరచర్లలో లక్షల టన్నుల డెక్కన్ క్రోమైడ్ విష వ్యర్థాలు
చర్మ, శ్వాసకోశ వ్యాధులతో ప్రజల ఇక్కట్లు
వ్యర్థాలను తరలించాలంటున్న గ్రామస్తులు

దామరచర్ల/మన తెలంగాణ: దామరచర్ల మండల కేంద్రానికి మూడు కిలోమీటర్ల దూరంలో 1998 ఆగస్టు 8న ప్రారంభించిన డెక్కన్ క్రోమైడ్ కర్మాగారాన్ని పదేళ్లపాటు నడిపించి 2009లో మూసివేశారు. ఈ కర్మాగారంలో తయారు చేసే సోడియం బైకార్భోనేట్ తయారుకు షోడా, క్రోమోర్, లైమ్‌స్టోన్‌ల ముడిపదార్థాలను కిలన్‌లో హై టెంపరేచర్‌లో గ్రైండింగ్ చేసి ట్యాంకుల్లోకి పంపి చల్లార్చి వీక్ లిక్కర్‌గా తయారు చేస్తారు. ఐదు గంటల తర్వాత అందులో సోడియం సల్పేట్‌ను మిశ్రమం చేసి సెంట్రీఫ్యూజ్‌తో సోడియం బైకార్భోనేట్‌గా తయారు చేస్తారు. వీటి నుంచి సబ్ ప్రొడక్ట్‌లుగా బేసిక్ క్రోమియం, వైట్, ఎల్లో సల్ఫేట్లను తయారు చేస్తారు. సోడియంను పెయింట్స్, మందులకు, బేసిక్ క్రోమియం సల్ఫేట్‌ను లెదర్ ఇండస్ట్రీకి, ఎల్లో, వైట్ సల్ఫేట్‌లను పేపర్ తయారీకి ఉపయోగిస్తారు. కర్మాగారం నడిచిన కాలంలో రోజుకు 40 టన్నుల వరకు ఉత్పత్తి జరిగేది. పదేళ్లపాటు ఈ ఉత్పత్తులను తీసి ఎగుమతి చేసిన యాజమాన్యం వీటి నుంచి వెలువడిన వ్యర్థాలలో ప్రధానమైనది క్రోమియం-6 విషంతో సమానమైనది. ఈ విష వ్యర్థాలను ఎప్పటికప్పుడు హైదరాబాద్‌లోని దుండిగల్‌కు తరలిం చాల్సి ఉండగా ఆ నిబంధనలను యాజమాన్యం పట్టించుకోలేదు. వ్యర్థాలను తరలించాలంటే కోట్లాది రూపాయలు ఖర్చుఅవుతుందని భావించిన యాజమాన్యం ఖర్చుకు భయపడి అధికారులు, స్థానికుల అండదండలతో వేల టన్నుల వ్యర్థాలను ఫ్యాక్టరీ పరిసరాలలో నిల్వ చేసింది. డెక్కన్ కెమికల్ కర్మాగారం నిలిచిపోయిన ఐదేళ్లకు 2013లో త్పుపట్టిన మిషనరీని గుట్టుచప్పుడు కాకుండా తరలించింది.
వాగు ద్వారా నదుల్లోకి
కర్మాగారం వద్ద నిల్వ చేసిన విష వ్యర్థాల నుంచి ఊట ఊరుతూ కెమకల్ వాటర్ పక్కనే ఉన్న బుగ్గవాగు ద్వారా సమీపంలోని మూసీ నదిలోకి కలిసి అటు తర్వాత వాడపల్లి వద్ద కృష్ణానదిలోకి కలుస్తుంది. వాడపల్లి వద్ద కృష్ణా నదిలో స్నానాలు చేస్తుంటే శరీరమంతా దురద, మంటలు వస్తున్నాయని అక్కడి పశువుల కాపర్లు, జాలర్లు పేర్కొంటున్నారు. అటవీప్రాంతంలో విచ్చలవిడిగా వ్యర్థాలు పోయడంతో ఆ నీటిని తాగిన వందలాది మూగజీవాలు, పశువులు మృత్యువాతపడుతున్నాయి. పరిసర ప్రాంతాల్లోని చేపలు సైతం మృత్యువాత పడుతున్నాయి. కర్మాగారంలో పనిచసిన కార్మికులు కూడా కెమికల్ పడి శరీరం కాలిపోయి, అనారోగ్యంపాలైన సంఘటనలున్నాయి.
క్రోమియం-6తో వ్యాధులు
కర్మాగారం వద్ద నిల్వ ఉన్న వ్యర్థాలల్లో దాగిఉన్న క్రోమియం-6తో గాలి, నీరు కలుషితమై కాన్సర్, ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులతోపాటు చర్మ సంబంధమైన వ్యాధులు సైతం ప్రభలుతన్నాయి. ఈ కర్మాగారం పరిసరాల్లోని నాలుగు గ్రామాల్లో దీని ప్రభావం ఉంటుందని కర్మాగారం సమీపంలో వేసిన బోర్లలో సైతం కలుషితమైన నీరే వస్తుందని, దీంతో పొలాల్లో వేసిన పంటలు సరిగా పండడంలేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
నూతన రసాయన కర్మాగారం ఏర్పాట్లకు సన్నాహాలు
ఇదిలా ఉంటే గతంలో ఇక్కడ రసాయన కర్మాగారాన్ని నిర్మించి, లాభాలు గడించిన యాజమాన్యం తన కర్మాగారం నుంచి వెలువడిన విష రసాయనాలతో కూడిన వ్యర్థాలను తరలించకుండా దామరచర్ల ప్రజల నెత్తిన విషపు కుంపటిని పెట్టి వదలి వెళ్లిన యాజమాన్యం కోదండ రామ కెమికల్ ఫ్యాక్టరీ పేరుతో దామరచర్లలో నూతన రసాయన కర్మాగారాన్ని నిర్మించేందుకు టీఎస్ ఐ పాస్ పేరుతో ఆన్‌లైన్లో ప్రభుత్వానికి ధరఖాస్తు చేసుకోవడం జరిగింది. అంతే కాకుండా ఫ్యాక్టరీ పరిసరాల్లో నూతన కర్మాగారం నిర్మాణం పనులను మొదలుపెట్టడంతో ప్రజలు, అధికారులు అడుకున్నారు. గ్రామపంచాతీ అత్యవసరంగా గ్రామ సభను నిర్వహించి నిర్మాణానికి వ్యతిరేకంగా తీర్మాణం చేసి ఉన్నతాధికారులకు నివేదిక సమర్పించింది. అయినప్పటికీ యాజమాన్యం నూతన రసాయన కర్మాగారం నిర్మాణం కోసం ప్రయత్నాలను మానుకోనట్లు తెలుస్తోంది.
విష వ్యర్థాలను వెంటనే తరిలించాలి : అన్నెం కర్నాకర్‌రెడ్డి
డెక్కన్ క్రోమైడ్ ఫ్యాక్టరీ ఆవరణలో నిల్వ ఉంచిన వేల టన్ను విష వ్యర్థాలను ఇక్కడి నుంచి తరలించాలి. ఇప్పటికే విష వ్యర్థాలు తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. నీరు కలుషితమవుతోంది. సమీపంలోని పంట పొలాలు నాశనమవుతున్నాయి. ప్రజల ఆరోగ్యం దెబ్బతింటోంది. ఇంకా వ్యర్థాలు ఇక్కడే ఉంటే ప్రజలు ప్రాణాంతకమైన క్యాన్సర్ బాడిన పడే అవకాశముంది. వ్యర్థాలను వెంటనే తరలించాలి.