Home ఎడిటోరియల్ సంక్షోభం గట్టెక్కాలంటే మౌలిక మార్పులు : అంక్టాడ్

సంక్షోభం గట్టెక్కాలంటే మౌలిక మార్పులు : అంక్టాడ్

imfప్రపంచ డిమాండ్ కుదించుకుపోతున్నది. ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యం (పిపిపి) ప్రభుత్వ ద్రవ్యాన్ని హరిస్తున్నది. సంపన్నదేశాలవల్ల ఈ ప్రతిష్టంభన, మందగమనం ఏర్పడింది. హెచ్చుగా విదేశీ మారకద్రవ్యం దేశం వెలుపలకు వెళ్లటానికి ఎఫ్‌డిఐ దారితీస్తుంది కావున ఆ విషయంలో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. ఇవి వాణిజ్యం-అభివృద్ధిపై ఐరాస మహాసభ (అంక్టాడ్) వారి వాణిజ్యం-అభివృద్ధి నివేదిక (టిడిఆర్) 2015చేసిన హెచ్చరికలు. ప్రపంచ వృద్ధిరేటు 2.5శాతాన్ని మించకపోవచ్చన్న అంచనాతో అనేక దిద్దుబాట్లను అది సూచించింది. భారతదేశానికి సంబంధించి వృద్ధిరేటు ఏడు శాతానికి పైగా ఉంటుందన్న ప్రభుత్వ అంచనాలతో అది ఏకీభవించింది. సూక్ష్మంగా చెప్పాలంటే, దోపిడీరహిత, డిమాండ్ ను సృష్టించే, ధరలు అదుపులో ఉండే నూతన ఆర్థిక వ్యవస్థను టిడిఆర్ కోరుతున్నది.

అభివృద్ధిచెందిన ఆర్థిక వ్యవస్థలు దీర్ఘకాల మందగమనం, వినియోగదారుల డిమాండ్ క్షీణింపు, ప్రైవేటు పెట్టుబడి, వేతనాలు కనీసం 10 శాతం తగ్గుదల, ఆదాయాల మధ్య వ్యత్యాసం మరింత పెరుగుదలకు గురి అవుతుండటం పట్ల నివేదిక ప్రత్యేకించి ఆందోళన వ్యక్తం చేసింది. భారీ రుణాలిచ్చే ద్రవ్యవిధానాన్ని అనుసరిస్తున్నప్పటికీ, అనేక అభివృద్ధి చెందిన దేశాల్లో వృద్ధిరేటు పెరగకపోవటాన్ని ‘కొత్త అసాధారణ’ పరిస్థితిగా అంక్టాడ్ పేర్కొన్నది. ఈ దేశాల ఆర్థిక వ్యవస్థలు శృతిమించిన స్థాయికి పెరిగిన అప్పులు, ఆస్తి బుడగలమీద ఆధారపడుతున్నాయని వ్యాఖ్యానిం చింది. “ద్రవ్యసంక్షోభం ఏర్పడిన 8 సంవత్సరాల తదుపరి కూడా ప్రపంచాన్ని సర్వపరివేష్టిత, నిలక డైన ఆర్థిక అభివృద్ధిలోకి తీసుకెళ్ళటమెలాగో స్పష్టమైన మార్గాన్ని ప్రపంచం కనుగొనలేక పోయింది” అని పేర్కొన్నది.

అంతర్జాతీయ ద్రవ్యవ్యవస్థ (ఐఎంఎస్) సక్రమంగా పనిచేయకపోవటంవల్ల కొనసాగుతున్న ద్రవ్య అస్థిరత ఐరాస నిర్దేశించిన ‘నిలకడైన అభివృద్ధి లక్షాలను (ఎస్‌డిజిలు) దెబ్బతీయవచ్చు. ప్రపంచం ఎదుర్కొంటున్న తీవ్రమైన పరిస్థితిని ఇది సూచి స్తున్నది. డాలర్‌తో ద్రవ్యమారక రేట్లలో పెద్ద ఒడిదుడుకులుండవచ్చునని హెచ్చరిక చేసింది. వర్థమాన దేశాలు అభివృద్ధి సహాయం కొరకు ఐఎంఎఫ్‌పై ఆధారపడటం తగ్గుతున్నది. ఈ దేశాలు విదేశీ మార్కెట్ల షాక్‌నుంచి రక్షణకు తొలిదుర్గంగా పెద్ద ఎత్తున విదేశీ మారకద్రవ్యం కూడబెట్టటాన్ని 1997-98 నుండి ప్రారంభించాయి. లాటిన్ అమెరికా అనుభవం నుంచి భారత్ నేర్చుకోవచ్చు. విదేశీ డిమాండ్ తగ్గిన కారణంగా ఈ ప్రాంతం 2011 నుండి మందగమనానికి గురైంది. వృద్ధిరేటు 2015లో ఒక శాతం దిగువకు పడిపోయింది. ఎగుమతుల తగ్గుదలవల్ల పన్ను ఆదాయం తగ్గింది- భారత్‌కూడా అంత తీవ్రమైన స్థాయిలో కాకపోయి నా ఇదే పరిస్థితి ఎదుర్కొంటున్నది.

ఆస్ట్రేలియా, కెనడా, జపాన్, ఆఫ్రికాల్లో వృద్ధి కనాకష్టంగా ఉంది. నైజీరియా, అంగోలావంటి సబ్-సహారా ఆయిలు ఎగుమతి దేశాలు ప్రభుత్వ వ్యయం కోతపెడుతున్నాయి. యూరోజోన్ సంక్షోభం విస్తృత ఆర్థిక అసమతౌల్యాలనుంచి బయట పడింది. విదేశీ పెట్టుబడులు మితిమీరి గుప్పించటం వల్ల, చరిత్రలో ఏనాడులేనంత తక్కువ వడ్డీరేట్ల కారణంగా ప్రైవేటురంగం వినిమయం, గృహనిర్మాణాలపై పెట్టుబడి పెరగటంవల్ల ఇది జరిగింది. ఈ పరిస్థితి ఆ ఆర్థిక వ్యవస్థల సున్నితత్వాన్ని మరింత పెంచింది. అతిగా పెట్టుబడి సమకూర్చటం, వడ్డీరేట్ల తగ్గింపులో ఉన్న ఇబ్బందులను భారత్ అవగాహన చేసుకోవాలి. రియల్ ఎస్టేట్ బుడగ ఇప్పటికే బ్యాంకింగ్ రంగాన్ని దెబ్బతీసింది. అధిక లాభాపేక్ష, అధిక రేట్లు, పెద్ద ఎత్తున అమ్ముడుపోని లేదా నిర్మాణాలు పూర్తికాని పరిస్థితి నివాసరహిత భారీ ‘నగరాలను’ సృష్టించింది. నొయిడా, గ్రేటర్ నొయిడాలో, ఇంకా జాతీయ రాజధాని ప్రాంతంలో అనేకచోట్ల, ఇంకా అనేక నగరాల చుట్టూ ఈ పరిస్థితిని చూడవచ్చు.

1980వ దశకంలో ద్రవ్యసంక్షోభ అలల నాలుగింటిని టిడిఆర్ పేర్కొన్నది. అవి – లాటిన్ అమెరికా 1994-95, మెక్సికో సంక్షోభం 1997-98, ఆగ్నేయాసియా సంక్షోభం, 2008లో అమెరికా లో, పశ్చిమరాజ్యాల్లో సబ్-ప్రైమ్ సంక్షోభం. ఈ ప్రతి ఒక్క సంక్షోభానికి ముందు కరెంట్‌అక్కౌంట్‌లో అతిభారీగా ప్రతికూలత, దేశీయంగా పరపతి మంజూరు పెద్ద ఎత్తున పెరగటం సంభవించాయి. 1980వ దశకంనుంచీ, ప్రాదుర్భావ ఆర్థిక వ్యవస్థల్లో సంక్షోభానికి ముందు విదేశీ పెట్టుబడులు పెద్ద ఎత్తున రావడం జరిగింది. 2008 సంక్షోభం తర్వాత, అనేక అభివృద్ధిచెందిన దేశాలు ప్రైవేటు రంగం చేతిలో ధనం ఎక్కువగా ఉండే విధానాలు అనుసరించాయి. అయితే దీనివల్ల వృద్ధ్ది ప్రతిఫలాలు పరిమితంగానే ఉన్నాయి. వాస్తవానికి ప్రపంచంలో క్లిష్ట పరిస్థితి కొనసాగు తున్నది. బ్రెజిల్,రష్యన్ ఫెడరేషన్, దక్షిణాఫ్రికాల్లో మాంద్యంవల్ల ప్రపంచ ద్రవ్యమార్కెట్లు దెబ్బ తిన్నాయి. చైనా బలహీనపడుతున్నది. అమెరికా అస్థిర పరిస్థితిలో ఉంది.

ఇది చాలా సున్నితమైన పరిస్థితి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అప్పుపై ఆధారపడి ఉంది. ‘మహాసర్దుబాటు కాలం (1985-2005)లో ప్రపంచం అప్పు 1984 లోని 21 ట్రిలియన్ డాలర్లనుంచి, 2000లో 87 ట్రిలియన్ డాలర్లకు పెరిగింది. 2007 నాటికి అది మహాభయంకరంగా 142 ట్రిలియన్ డాలర్లకు చేరుకున్నది. 2008లో యూరో-యుఎస్ సంక్షోభం లో అది మరో 57 ట్రిలియన్ డాలర్లు పెరిగింది. విదేశీ కార్పొరేట్ రుణం 2008 నుండి మూడు రెట్లయి 2.6 ట్రిలియన్ డాలర్లకు చేరింది. మార్కెట్లు ఒడిదుడుకులతో, సున్నితంగా ఉన్నందున మొత్తం రుణ పరిస్థితి ఇబ్బందికరంగా పరిణమించవచ్చని టిడిఆర్ హెచ్చరించింది. అందువల్ల అంతర్జాతీయ రుణ మెకానిజంను రూపొందించటం అవసరమని కోరింది. ప్రపంచ వాణిజ్యం స్తంభించి ఉండటంపై ఈ సమస్యలన్నింటి ప్రభావం వుంది. 2003-2007లో ఏటా 7.2శాతం పెరిగిన ప్రపంచ వాణిజ్యం 2014 లో 0.3శాతం మాత్రమే పెరిగింది. 2015 పరిస్థితి ఆశాజనకంగా లేదు. “ప్రపంచవాణిజ్యం కల్లోలంగా ఉంది” అని అది వ్యాఖ్యానించింది. కార్మికుల వేతనాల తగ్గుదల, ప్రభుత్వంచేసే వ్యయంలో కోత సమస్యలను పరిష్కరించకపోగా క్షీణింపచేస్తున్నదని తెలిపింది. బాహ్యషాక్‌లు అనేక ఆర్థిక వ్యవస్థలను ఏకకాలంలో తాకుతాయని హెచ్చరిక చేసింది.

ఈ పరిస్థితిని అధిగమించే అవకాశం అభివృద్ధి బ్యాంకులకు ఉంది. అవి దీర్ఘకాలిక ఆర్థిక, సామా జిక ఫలితాలనిస్తాయి. మరింత సమన్యాయం తో కూడిన సౌత్-సౌత్ (వర్థమాన దేశాల మధ్య) సహ కారంపెరగాలి అని టిడిఆర్ వక్కాణించింది. ఏడు ట్రిలియన్‌డాలర్లకుపైగా ఉన్న సావరిన్ వెల్త్‌ఫండ్స్ లో ఆరు ట్రిలియన్‌డాలర్లు వర్థమాన దేశాల చేతిలో ఉన్నాయి. దీర్ఘకాలిక ఫైనాన్స్‌ను ప్రోత్సహించటానికి ఇది మరొక వనరు. అంతర్జాతీయ ద్రవ్యవ్యవస్థను మార్చే ప్రయత్నంలో, మౌలిక వసతుల ప్రాజెక్టులకు ఫైనాన్స్‌లో పిపిపిలు ఎక్కువప్రాధాన్యత పొందు తున్నప్పటికీ, అనేక సందర్భాల్లో అవి అదనపు ఫైనాన్స్ తేలేదు, ప్రభుత్వ బడ్జెటరీ వ్యవస్థపై బాధ్యతలు పెంచింది. వర్థమాన దేశాల్లో మౌలిక వసతుల ప్రాజెక్టులపై పెట్టుబడిలో అధిక వాటా ప్రభుత్వాలదేకాని ప్రైవేటుది కాదు. పిపిపిలు ప్రభుత్వబాధ్యతలను తగ్గించలేదు. పెట్టుబడివ్యయం లో 75నుండి 90శాతం ప్రభుత్వాలే భరిస్తున్నాయి. యూరోపియన్ యూనియన్‌లో సైతం ప్రైవేటు భాగస్వాముల పెట్టుబడి బహుస్వల్పమే. ప్రైవేటు భాగస్వాములు లాభపడుతుంటే ప్రభుత్వ వ్యవస్థ అప్పులు, బాధ్యతలభారం మోస్తున్నది.

అటువంటి భాగస్వామ్యాలు ప్రభుత్వానికి ప్రయోజనకరం కాదని టిడిఆర్ స్పష్టం చేసింది. ప్రభుత్వరంగం ద్వారా సాంప్రదాయక కొనుగోళ్ళకన్నా పిపిపిలు సర్వసాధారణంగా ఖరీదైనవి. పిపిపిల నుంచి దూరం జరగాలని గట్టిగా చెబుతూ, క్రెడిట్ రేటింగ్‌ఏజెన్సీల తీరును కూడా విమర్శించింది. అవి రాగద్వేషాలు పాటిస్తుంటా యని, వాటి అంచనాలు చాలాసార్లు వస్తుగతంగా ఉండవని వ్యాఖ్యానించింది. రేటింగ్‌లపైఅతిగా ఆధారపడటాన్ని విడనాడాలని కోరింది. ప్రపంచవ్యవస్థలో వ్యవస్థాగత మార్పులు అవసరం. అసమానతను తొలగించే నిమిత్తం కొత్త బహుళపక్ష ఏర్పాటు అవసరం. అసమానతలను అతిగా పెంచుకున్న డాలర్ ప్రామాణికతనుంచి వైదొలగాలని అది సూచించింది. వర్థమాన దేశాల అవసరాలను ఐఎంఎఫ్‌తీర్చాలని కోరింది. ప్రపంచ మార్కెట్ల ఒడిదుడుకులు, వేతనాల మెరుగుదలపై అది నిఘా పెట్టాలని సూచించింది.తద్వారా ప్రతిష్టంభన తొలగుతుందని భావించింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ప్రోత్సాహం చేకూర్చటానికి సమన్వయ పద్ధతులను రూపొందించాలని కోరింది. ఆ పనిచేస్తే అనేకదేశాలు భారత్‌లాగా అధిక జిడిపి వృద్ధిరేటులోకి వస్తాయని పేర్కొన్నది.
(ఇన్ఫా)