Home తాజా వార్తలు మళ్లీ వాణిజ్య యుద్ధం

మళ్లీ వాణిజ్య యుద్ధం

trump

 అదనంగా 10 శాతం సుంకాలతో అమెరికా రెడీ!

 ఈ పద్ధతి వినాశనానికి నాంది: చైనా

వాషింగ్టన్: అమెరికా, చైనాల మధ్య వాణిజ్య యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో మరోసారి చైనా దిగుమతులపై అదనంగా 10 శాతం..అంటే దాదాపు 200 వందల కోట్ల అమెరికా డాలర్ల సుంకాలు విధించేందుకు అమెరికా సన్నద్ధం అవుతోంది. దీంతో ప్రపంచంలోని రెండు అతి పెద్ద ఆర్థిక వ్యవస్థల మధ్య వాణిజ్య యుద్ధం మరింత తీవ్రమయ్యే సూచనలున్నాయి. చైనాకు అమెరికా ఎగుమతి చేసే వస్తువులపై చైనా కూడా 34 వందల కోట్ల సుంకాలు విధించడమేకాక, మరో 16 వందల కోట్ల సుంకాలు కూడా విధిస్తానని హెచ్చరించాక  అమెరికా ఈ చర చేపడుతున్నది. చైనా విధించిన సుంకాలను ట్రంప్ పాలకవర్గం ‘అన్యాయం’ అని అభివర్ణించింది. చైనా అనుసరిస్తున్న విధానాలకు ప్రతిగా అమెరికా జూలై 6 నుంచి 25 శాతం సుంకాలను విధించడం అమలుచేసింది. ఈ సుంకాలు చైనా ఉత్పత్తులపై రమారమి 34 వందల కోట్ల డాలర్లుంటుంది.‘అమెరికా తాజా విధించనున్న సుంకాలు చైనా దిగుమతులపై 50 వందల కోట్ల డాలర్లను కవర్ చేయనున్నాయి. చైనా పారిశ్రామిక విధానం, బలవంతంగా సాంకేతిక బదిలీ విధానాల ద్వారా ప్రయోజనం పొందే వాటికి ఈ సుంకాలు పడనున్నాయి’ అని అమెరికా వాణిజ్య ప్రతినిధి(యుఎస్‌టిఆర్) రాబర్ట్ లైథిజర్ చెప్పారు. ‘చైనా అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధంగా ఈ విధానం అనుసరిస్తోంది’ అని లైథిజర్ అన్నారు. ‘చైనా అనుసరిస్తున్న హానికారక విధానాలు నిర్మూలించేందుకు యుఎస్‌టిఆర్‌లోని 301 సెక్షన్ కింద అమెరికా చేపడుతున్న సుంకాల విధింపు సరైనదే.  పారదర్శక, బహిరంగ సమగ్ర నోటీస్ ద్వారా ముందుకు వెళతాం. తుది సుం కాల విధింపుకు ముందు వాఖ్యానిస్తాం. అది కూడా ఇదివరకు మేము విధించిన సుంకాలకు ముందు చెప్పినట్లుగానే తెలుపుతాం’ అని లైథిజర్ అన్నారు. ‘చైనా ఆర్థికేతర విధానాల ద్వారా అమెరికా టెక్నాలజీని పొందుతోంది. అమెరికా వ్యాపారాలు, కంపెనీలు కొనుగోలు చేయడానికి ప్రభుత్వ నిధులను వినియోగిస్తోంది. చైనాలో కావలసిన మేధోసంపత్తికి లైసెన్సింగ్ విధానాన్ని భారం చేస్తోం ది’ అని ఆయన వివరించారు. ‘అన్యాయపూరిత విధానాలను ఆపాలని, మార్కెట్‌ను తెరవాలని, మార్కెట్‌లో వాస్తవిక పోటీ ఉండేలా చూడాలని ట్రంప్ పాలక వర్గం ఏడాదిగా చైనాకు చెబుతూనే ఉంది. అయినప్పటికీ చైనా తన పద్ధతులు మార్చుకోలేదు. అమెరికా ఆర్థికవ్యవస్థ భవిష్యత్తును రిస్క్‌లో పడేసేలా ప్రవర్తించింది. చట్టబద్ధ విషయాలను పరిష్కరించడానికి బదులు అమెరికా వస్తువులపై ప్రతికార విధానాలు చేపట్టింది’ అని తెలిపారు. ఇదిలా ఉండగా చైనా ప్రకటన లక్షపూరితంగాకాక, నిర్లక్షపూరితంగా ఉందని సెనెట్ ఆర్థిక కమిటీ చైర్మన్ ఒర్రిన్ హాచ్ అన్నారు. ‘చైనా వాణిజ్య విధానాల విషయంలో మేము గుడ్డిగా వ్యవహరించలేము’ అని చెప్పారు.

దెబ్బకు దెబ్బ సుంకాల విధింపు : చైనా

అమెరికా తాజా విధిస్తానన్న 200 వందల కోట్ల డాలర్ల సుంకాల విధింపు ప్రపంచంలోని రెండు పెద్ద ఆర్థిక వ్యవస్థల వాణిజ్య యుద్ధాన్ని తీవ్రతరం చేసి వినాశకరంగా మారగలదని చైనా బుధవారం అభిప్రాయపడింది. పరస్పరం విధించుకునే సుంకాలు చైనాఅమెరికా వాణిజ్యంను నాశనం చేస్తుందని తెలిపింది. ‘అమెరికా విధానం ప్రపంచీకరణ ఆర్థిక విధానంలో జోక్యం చేసుకోవడమే కాగలదు. అది ప్రపంచ ఆర్థిక క్రమాన్ని దెబ్బతీయగలదు’ అని చైనా వాణిజ్య సహాయ మంత్రి లీ చెంగాంగ్ బీజింగ్‌లో ఏర్పాటైన ఓ సమావేశంలో చెప్పారు. అమెరికా శుక్రవారం చైనా ఉత్పత్తులపై 25 శాతం సుంకాన్ని.. అంటే దాదాపు 34 వందల కోట్ల డాలర్ల సుంకాన్ని విధించింది. దీనికి చైనా కూడా ధీటుగా ప్రతిస్పందించింది. దాంతో అమెరికా మళ్లీ 10 శాతం సుంకాన్ని…అంటే 200 వందల కోట్ల డాలర్ల దిగుమతి సుంకాన్ని విధిస్తానని ప్రకటించింది. ఈ తాజా సుంకాల విధింపు ప్రకటనను అమెరికా బుధవారం చేసింది. ఇదిలా ఉండగాప్రపంచంలోని రెండు అతి పెద్ద ఆర్థికవ్యవస్థల మధ్య కొనసాగుతున్న ఈ వాణిజ్య యుద్ధం ప్రపంచ దేశాలపై ప్రభావం చూపగలవని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. కాగా ‘అంతర్జాతీయ వాణిజ్యంలో ఇది అస్తవ్యస్త కాలం’ అని లీ చెంగాంగ్ అభిప్రాయపడ్డారు. ‘ఇరుదేశాలలోని కంపెనీలు నష్టపోతాయి. ఈ వాణిజ్య యుద్ధంలో విజేతలంటూ ఎవరూ ఉండరు. అమెరికా, చైనా సహకరించుకోవడం ఒక్కటే మార్గం. అమెరికా ఈ వాణిజ్య యుద్ధాన్ని తీవ్రతరం చేస్తోందనిపిస్తోంది’ అని కూడా ఆయన చెప్పుకొచ్చారు. ఇప్పటికే ఈ రెండు దేశాల వాణిజ్య యుద్ధం ప్రభావం కనిపిస్తోంది.