Search
Friday 16 November 2018
  • :
  • :
Latest News

అమెరికా, చైనాల మధ్య మొదలైన ట్రేడ్‌వార్

Trade war between America and China

వాషింగ్టన్/బీజింగ్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేల్చిన ట్రేడ్‌వార్ బులెట్‌పై చైనా తీవ్రస్థాయిలో మండిపడింది. 34 బిలియన్ డాలర్ల విలువైన చైనా ఉత్పత్తులపై  25 శాతం టారిఫ్‌లను శుక్రవారం   అర్ధరాత్రినుంచి అమలులోకి తీసుకు రానున్నట్లు అమెరికా ప్రకటించింది. దీనిపై చైనా తీవ్రస్థాయిలో మండిపడుతోంది. ఆర్థిక చరిత్రలోనూ అతిపెద్ద వాణిజ్య యుద్ధంగా  అభివర్ణించింది. తమ దేశ ప్రయోజనాలను కాపాడడానికి అంతే స్థాయిలో ప్రతీకార చర్యలు ఉంటాయని కూడా ప్రకటించింది. ఆ ప్రతీకార చర్యలను చైనా ప్రకటించలేదు కానీ, అంతే స్థాయిలో చర్యలు ఉంటాయని వాణిజ్య మంత్రిత్వ శాఖ ఇంతకు ముందే ప్రకటించడం తెలిసిందే. ప్రపంచంలో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థలయిన ఈ రెండు దేశాల మధ్య వాణిజ్య యుద్ధం మొదలు కావడంతో ప్రపంచవ్యాప్తంగా వినియోగదారులు, కంపెనీలు  అత్యంత ప్రమాదకరమైన జోన్లలోకి అడుగుపెడుతున్నారని వాణిజ్య విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. అయితే ఇది ప్రారంభం మాత్రమే. ఎందుకంటే  మరో 16 బిలియన్ డాలర్ల విలువైన చైనా ఉత్పత్తులపై 25 శాతం టారిఫ్‌లను విధిస్తామని అమెరికా అంటోంది. ప్రతీకార చర్యలు అదే స్థాయిలో ఉండి తీరుతాయని చైనా కూడా ప్రకటనల మీద ప్రకటనలు చేస్త్తోంది.ఒక వేళ బీజింగ్‌నుంచి ఏవైనా చర్యలు వస్తే తమ ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని ట్రంప్ హెచ్చరిస్తున్నారు. ఈ వివాదానికి ఇక్కడితో ముగింపు పలకాలని, లేదంటే ట్రేడ్ వార్ మరింత ఉధృతం అవుతుందని  మరో వైపు చైనా అంటోంది.

దెబ్బకు దెబ్బ అనే రీతిలో రెండు దేశాలు ప్రవర్తిస్తున్న దృష్టా ఈ వార్ ఇప్పట్లో ఆగకపోవచ్చని  సిఎన్‌ఎన్ అంటోంది. సైబర్ చోరీలు, బలవంతపు మేథోసంపత్తి బదిలీలు, ప్రభుత్వ ప్రోత్సాహిత కార్పొరేట్ స్వాధీనాలు లాంటివాటి ద్వారా చైనా  అమెరికా సాంకేతిక పరిజ్ఞానాన్ని దొంగిలించడం ద్వారా తన పారిశ్రామిక అధిపత్యాన్ని విస్తరంపజేసుకుంటోందని, దీనివల్ల తమదేశ ప్రజల ప్రయోజనాలు దెబ్బతింటున్నాయని అమెరికా ఆరోపిస్తోంది. అయితే అమెరికా ఒక్క చైనాతోనే కాదు, కెనడా,  యూరోపియన్ యూనియన్‌తోను ట్రేడ్‌వార్ సాగిస్తోంది. ఆయా దేశాలనుంచి దిగుమతి అయ్యే అల్యూమినియం, స్టీల్ ఉత్పత్తులపై భారీగా సుంకాలు విధించింది. దానికి ప్రతిగా ఆయా దేశాలు అమెరికా ఉత్పత్తులపైనా సుంకాలు విధించాయి. అయితే ఈ టారిఫ్‌ల కారణంగాచైనాలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న అమెరికా బహుళజాతి సంస్థల ప్రయోజనాలు దెబ్బతింటాయని విశ్లేషకులు భయపడుతున్నారు. వాస్తవానికి శుక్రవారం అమెరికా ప్రకటన వెలువడిన తర్వాత చైనా స్టాక్ మార్కెట్లు పెరిగాయి. దాదాపు ఒక శాతం మేర పెరిగిన షాంఘై కాంపోజిట్ ఇండెక్స్, షెంజెన్ ఇండెక్స్‌లు ఆ తర్వాత కొంత మేరకు పడిపోయినా చివరికి అరశాతం దాకా లాభపడ్డాయి. సుంకాల ద్వారా అమెరికా మొత్త ప్రపంచంపైనే కాల్పులు జరుపుతోందని చైనా ఆరోపిస్తోంది. అమెరికా సుంకాలు విధిస్తున్న సరకులు వాస్తవంగా అమెరికా సహా విదేశీ పెట్టుబడులతో కంపెనీలు తయారు చేస్త్తున్నవేనని కూడా అంటోంది.

Comments

comments