Home ఎడిటోరియల్ ట్రంప్ వాణిజ్య, దౌత్య యుద్ధం

ట్రంప్ వాణిజ్య, దౌత్య యుద్ధం

sampadakeyam

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మళ్లీ ప్రచ్ఛన్న యుద్ధానికి తెర తీస్తున్నారా! చైనా, రష్యాలపట్ల ఆయన వ్యవహరిస్తున్న తీరు ఆ దిశను సూచిస్తున్నది. చైనాతో వాణిజ్య యుద్ధం కోరుకోవటం లేదంటూనే చైనా నుంచి దిగుమతులపై సుంకాలు పెంచుతున్నారు. చైనా అందుకు ప్రతి చర్యలు తీసుకుంటున్నది. తొలి రౌండ్‌లో చైనాపై 50 బిలియన్ డాలర్ల మేర అదనపు సుంకాలు ప్రతిపాదించిన ట్రంప్, చైనా ప్రతిచర్యలకు ఆగ్రహించి మరో 100 బిలియన్ డాలర్లమేర అదనపు సుంకాలను విస్తరించే విషయాన్ని పరిశీలించాల్సిందిగా తమ వాణిజ్యమంత్రిత్వ శాఖను ఆదేశించారు. అమెరికా ఏకపక్ష, రక్షణాత్మక చర్యల గూర్చి అమెరికాతో ‘సంప్రదింపులు’ ప్రారంభించాలని చైనా ప్రపంచ వాణిజ్య సంస్థను కోరగా (డబ్లుటిఒ వివాదాల పరిష్కార సంస్థకు ఫిర్యాదు పూర్తిస్థాయి న్యాయపోరాటానికి తొలి చర్య), డబ్లుటిఒ అమెరికాకు వ్యతిరేకంగా వివక్షతో వ్యవహరిస్తోందని ట్రంప్ నిందించాడు. ఆ మాటకొస్టే డబ్లుటిఒ, ఐరాస, తదితర బహుళపక్ష సంస్థలను వ్యతిరేకిస్తూ ఆయన పలుమార్లు అభిప్రాయాలు వ్యక్తం చేశారు. అమెరికా చెప్పినట్లు ప్రపంచం నడుచుకోవాలన్న దురహంకారం ట్రంప్ విధానాల్లో మూర్తీభవించి ఉంది. ఆంక్షలు, ఒత్తిళ్లు, బెదిరింపుల ద్వారా ప్రపంచ దేశాలను లొంగదీసుకోవాలని చూస్తున్నాడు. అమెరికాకు చైనా అతిపెద్ద వాణిజ్య భాగస్వామి (2017లో చైనాకు అమెరికా ఎగుమతులు 130 బి.డాలర్లు. కాగా అమెరికాకు చైనా ఎగుమతులు 506 బి.డాలర్లు) రుణ ప్రదాత (అమెరికా బాండ్లలో చైనా పెట్టుబడి 1168 బి.డాలర్లు. 1066 బి.డాలర్లతో జపాన్ రెండవ స్థానంలో ఉంది.). అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలకు ప్రాతినిథ్యం వహిస్తున్న ఈ రెండు దేశాల మధ్య వాణిజ్య యుద్ధం వల్ల ఆ రెండు దేశాలు నష్టపోవటం మాత్రమే గాక, ఇప్పుడిప్పుడే పుంజుకుంటున్న ప్రపంచ ఆర్థిక వ్యవస్థల జిడిపి వృద్ధిపై ప్రతికూల ప్రభావం చూపుతుందని ఆర్థిక వేత్తలు ఆందోళన చెందుతున్నారు. మరోవైపున అంతర్జాతీయ వివాదాల్లో అమెరికా, దాని మిత్రరాజ్యాల వ్యూహాలకు వ్యతిరేకంగా దీటుగా నిలబడుతున్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను దెబ్బ తీయటానికి అమెరికా, ఇయు రాజ్యాలు దౌత్యవేత్తల బహిష్కరణకు ఒడిగట్టగా, అమెరికా పుతిన్ మిత్ర వ్యాపార గుత్తాధిపతులపై ఆంక్షలు విధించింది. రష్యాకు చెందిన మాజీ గూఢచారి, ఆయన కుమార్తెపై లండన్‌లో రష్యా రసాయనక్రిమి ప్రయోగం చేసిందనే ఆరోపణతో బ్రిటిష్ ప్రధాని థెరిసా మే ముందుగా రష్యన్ దౌత్యాధికారులను బహిష్కరించటం, ఆ తదుపరి అమెరికా, అనేక ఇయు దేశాలు వందల సంఖ్యల్లో అటువంటి బహిష్కరణలు చేపట్టటం, రష్యా ప్రతిస్పందించి అంతే సంఖ్యలో అమెరికా, పశ్చిమ దేశాల దౌత్యాధికారులను వెలివేయటం తెలిసిందే. కాగా అమెరికన్ అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్‌కు అనుకూలంగా రష్యా సైబర్ గూఢచర్యం, ప్రచారానికి పాల్పడిందనే ఆరోపణలను అధ్యక్షుడు ట్రంప్ నిరాకరించినప్పటికీ, అమెరికన్ కాంగ్రెస్ కమిటీ గూఢచారి సంస్థల సమాచారంతో రష్యా జోక్యాన్ని రూఢిపరుచుకుని మార్చి నెలలో 19 రష్యన్ కంపెనీలపై ఆంక్షలు విధించింది. కాగా పుతిన్‌కు వెన్నుదన్నుగా ఉన్న అతిపెద్ద 7 వ్యాపార సంస్థలపై శుక్రవారం ఆంక్షలు విధించారు. అత్యంత శక్తిమంతుడిగా ఎదిగిన పుతిన్‌ను బలహీనపరిచి తమ దారిలోకి తెచ్చుకోవటమే ఈ దౌత్య, వాణిజ్య ఆంక్షల అసలు ఉద్దేశం. “రష్యన్ ప్రభుత్వం పలు దేశాల్లో బరితెగించి సాగిస్తున్న, పెంచుతున్న దుష్ట కార్యకలాపాలను మొత్తంగా పరిగణనలోకి తీసుకుని అమెరికా ఈ చర్యలు తీసుకుంటున్నది. వారు క్రిమియాను ఆక్రమించటం, తూర్పు ఉక్రెయిన్‌లో హింసను ప్రేరేపించటం, సిరియాలో అస్సాద్ ప్రభుత్వాన్ని బలపరచటం, దుర్బుద్ధితో కూడిన సైబర్ కార్యకలాపాలు వాటిలో ఉన్నాయి” అని అమెరికన్ అధికారి చెప్పటం గమనార్హం.
1990వ దశకం ఆరంభంలో సోవియట్ యునియన్ విచ్ఛిత్తితో అంతమైన ప్రచ్ఛన్న యుద్ధం తదుపరి ప్రపంచాధిపత్యం కొరకు (ఏకధృవ ప్రపంచం) అమెరికా ప్రయత్నాలు, చేబట్టిన యుద్ధాలు ఫలించలేదు. అది ప్రపంచీకరణను విధించినప్పటికీ అంతర్జాతీయ, ప్రాంతీయ బహుళపక్షవేదికలు ఆవిర్భావంలోకి వచ్చాయి. అయితే ట్రంప్ ప్రపంచీకరణకు వ్యతిరేకంగా అమెరికా రక్షణతత్వాన్ని ముందుకు తెచ్చి ప్రపంచ వాణిజ్యాన్ని తమకు అనుకూలంగా మరల్చుకోవాలని యత్నిస్తున్నారు. కాగా సోషలిస్టు దేశమైన చైనా ప్రపంచీకరణను బలపరుస్తున్నది, దాన్ని నీరుగార్చటాన్ని వ్యతిరేకిస్తున్నది. ఇదీ నేటి చిత్రమైన పరిస్థితి!