Home ఎడిటోరియల్ ట్రాఫిక్ జామ్‌ల భారతం

ట్రాఫిక్ జామ్‌ల భారతం

Traffic jams for India have loss of Rs 15 lakh crore annually

ఢిల్లీ, ముంబయి, బెంగుళూరు, కోల్‌కతాలలో ట్రాఫిక్ జాముల వల్ల ఏటా పదిహేను లక్షల కోట్ల రూపాయల నష్టం వాటిల్లుతోందని అంచనా. లాస్ ఏంజిల్స్ నగరం ట్రాఫిక్ జామ్‌ల వల్ల ఏటా దాదాపు 13 లక్షల కోట్ల రూపాయల నష్టం భరిస్తున్నది. రోడ్లపై వ్యర్థమయ్యే సమయం వల్ల ఈ నష్టం వాటిల్లుతోంది. న్యూయార్కులో నష్టం 23 లక్షల కోట్ల రూపాయలు. సగటున ప్రతి డ్రయివరుకు రెండులక్షల రూపాయల నష్టం. శాన్ ఫ్రాన్సిస్కో నగరానికి డెబ్బయివేల కోట్ల రూపాయలు, అట్లాంట నగరంలో యాభైవేల కోట్ల రూపాయల నష్టం.

బ్రిటన్, జర్మనీ, అమెరికా దేశాల్లో గత సంవత్సరం ట్రాఫిక్ జాముల వల్ల కలిగిన నష్టం 318 లక్షల కోట్ల రూపాయలు. అంటే ప్రతి మనిషికి 67 వేల రూపాయల నష్టం. ఈ లెక్కలు ఎలా వేశారంటే వర్కర్లు ట్రాఫిక్ జాములో ఉండిపోవడంవల్ల ఉత్పత్తి నష్టం, రోడురవాణాలో జరిగిన నష్టం, నిలబడిపోయిన వాహనాల ఇంజనులో చమురు ఖర్చు వగైరా లెక్కించారు. నగరాల్లో ఒక చోటి నుంచి మరో చోటికి వెళ్ళ డం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సామాజిక, ఆర్థిక, పర్యావరణ సమస్యలకు కారణమవుతోంది. అందువల్లనే “రోడ్ రేజ్‌“ అనే పదం వాడకంలోకి వచ్చింది. రోడ్డుపై వాహనం నడిపే వ్యక్తి హఠాత్తుగా ఆగ్రహోదగ్రుడైపోయే పరిస్థితిని రోడ్ రేజ్ అంటున్నారు.భారతదేశంలో ఈ సమస్య మరింత తీవ్రంగా కనిపిస్తోంది. ఇలాంటి చాలా సంఘటనలు మన ముందుకు వస్తున్నాయి.

ఉదాహరణకు ఉత్తరప్రదేశ్, ఢిల్లీ రాష్ట్రాల్లో ఏటా జరిగే కన్వర్ యాత్ర. కన్వర్ అనేది ఒక మతపరమైన సందర్భం. శివభక్తులు గంగా నది నుంచి పవిత్ర జలాలు పట్టి తెచ్చుకోడానికి హరిద్వార్, గంగోత్రి, సుల్తాన్ గంజ్‌లకు యాత్రగా వెళ్తారు. దీన్నే కన్వర్ అంటారు. దీనివల్ల వారణాసి అలహాబాద్‌ల మధ్య సగం జాతీయ రహదారి స్తంభించిపోతుంది. ఈ యాత్ర దాదాపు ఐదు గంటల సేపు సాగుతుంది.

ఇటువంటి ట్రాఫిక్ నరకాలకు ఎస్‌పిల వంటి ఉన్నత పోలీసు అధికారులను బాధ్యులను చేయాలని కోరుతూ భారత అటార్నీ జనరల్ కెకె వేణుగోపాల్ సుప్రీంకోర్టును అభ్యర్థించారు. ఇందులో పాలుపంచుకునేవారు పవిత్ర జలాన్ని కావడిలో మోసుకుంటూ యాత్రగా వెళతారు. లౌడ్ స్పీకర్లలో భక్తిపాటలతో ఈ యాత్ర కొనసాగుతుంది. ఫుట్‌పాత్‌ల పై, పేవ్‌మెంట్లపై ఎక్కడబడితే అక్కడ టెంట్లు వేసుకుంటారు. ప్రధాన రహదారుల్లో, రోడ్లపై నాట్యం చేస్తూ, అడ్డంగా నడుస్తుంటారు. ఇది మతపరమైన వ్యవహారం, కాబట్టి దేవుడితో ఎవరూ వాదనకు దిగలేరు.
కాని ఆగష్టు 8వ తేదీన 20 కన్వరియాల గుంపు ఒక కారుపై దాడి చేసింది. కర్రలు, ఇనుపరాడ్లతో ఢిల్లీలోని రోడ్డు మధ్యనే కారుపై దాడి చేసి ధ్వంసం చేశారు. సాయంత్రం 5 గం. సమయంలో ఈ సంఘటన జరిగింది. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. చాలా మందికి ఈ సంఘటన చూసి కోపం వచ్చింది. డిన్నర్ టేబుల్ వద్ద దీనిపై చర్చలు చేసుకున్నారు. చివరకు ప్రశాంతంగా నిద్రపోయి తర్వాతి రోజు ఆఫీసుకు ట్రాఫిక్కులో వెళ్ళడానికి శారీరకంగా, మానసికంగా సిద్ధమయ్యే ప్రయత్నాల్లోపడ్డారు.

కాని, సోషల్ మీడియాలో విమర్శలు, ప్రతాపాల వల్ల దేశంలో మౌలిక సదుపాయాలు సమస్యలుగాని, ట్రాఫిక్ సమస్యలు గాని పరిష్కారం కావు. మన సమస్యలు మనమే పరిష్కరించుకోవాలి. కొత్త పద్ధతులు ఆలోచించాలి. వాటిని ఆచరణలో పెట్టాలి. అందుకే నీతిఆయోగ్ ప్రతిపాదించిన మూవ్ హ్యాక్ గురించి తెలిసినప్పుడు చాలా ఉత్కంఠ కలిగింది. భారతదేశంలో ట్రాఫిక్ సమస్యల కారణంగా ఒకచోటి నుంచి మరో చోటికి వెళ్ళడంలో ఇబ్బందులను అధిగమించడానికి ప్రపంచంలో అత్యుత్తమ పద్ధతుల ద్వారా ఇక్కడి సమస్యలకు పరిష్కారాలు చూపించే వ్యవస్థ అది. హ్యాకాథాన్ వ్యవస్థ అనేక దేశాల్లో పనిచేస్తోంది. ఇది రెండు దశలుగా ఉండే కార్యక్రమం. జస్ట్ కోడ్ ఇట్ అనేది అధునాతన సాంకేతిక పరిష్కారాలను అందిస్తుంది. జస్ట్ సాల్వ్ ఇట్ అనేది సరికొత్త బిజినెస్ మాడల్స్ అందిస్తుంది.

ఇందులో మూడు ముఖ్యంగా ఆకట్టుకునేలా ఉన్నాయి. సిటిజన్ ఫస్ట్ పద్ధతి. ప్రజల నుంచి వారి సమస్యలేమిటో తెలుసుకోకుండానే పరిష్కారాలందించే పద్ధతిలో కాకుండా, క్రౌడ్ సోర్స్ ద్వారా సమస్యలేమిటో తెలుసుకున్నారు. వినూత్న పరిష్కార ప్రతిపాదనలు ఆహ్వానించారు. వినూత్న పరిష్కారాలు ఇచ్చేవారికి ప్రోత్సాహకాలు కూడా పెట్టారు.
రెండవ విషయమేమిటంటే, హాకాథాన్ పూర్తిగా గ్లోబల్ కావడం. ప్రపంచవ్యాప్తంగా ఇందులో పాలు పంచుకునేలా ఆహ్వానించారు. ధార్మిక, సాంస్కృతిక, దౌత్యపరమైన సరిహద్దులకు అతీతంగా అందరూ ఇందులో పాల్గొనే అవకాశం ఉంటుంది. 4వ పారిశ్రామిక విప్లవం ప్రయోజనాలను మనం పొందాలంటే మనం చేయవలసింది వారధులను కట్టడం, అంతేకాని గోడలు, ఫైర్ వాల్స్ కట్టడం కాదు. మూడవ విషయం నగరాల్లో ఏరియల్ మొబిలిటీకి ప్రయత్నించడం. దీని వల్ల వినూత్నమైన కొత్త ఆలోచనలు వచ్చే అవకాశం ఉంది. పబ్లిక్ పాలసీకి సంబంధించి కూడా చాలా మార్పులు రావచ్చు.

రువాండ ఉదాహరణ తీసుకుందాం. అక్కడ డ్రోన్‌ల సహకారం తీసుకోవడం ద్వారా రక్తం అవసరమైనప్పుడు డ్రోన్ ద్వారా రక్తాన్ని పంపించడం జరుగుతుంది. డ్రోన్ సహకారం కోసం జిప్లయిన్ సేవ్ లైవ్స్ స్టార్టప్‌తో ప్రభుత్వం భాగస్వామ్యం ద్వారా ఇది అమలు చేస్తోంది. ఇలాంటి వినూత్న పద్ధతులు అమలు చేయాలంటే అవసరమైన విధానపరమైన నిర్ణయాలు తీసుకోవడం కూడ అవసరమవుతుంది.

ప్రాసెస్, కాస్ట్, టెక్నాలజీ, ఇన్నోవేషన్ – ఈ రంగాల్లో ప్రపంచవ్యాప్తంగా భారతదేశానికి పేరుంది. కాని నగరాల్లో, పట్టణాల్లో ట్రాఫిక్ వల్ల జీవనం స్తంభించే పరిస్థితుల్లో ఇవేవీ ఆశించిన ప్రయోజనాలివ్వలేవు. ఇప్పుడు భారతదేశం ఆర్ధికంగా పైకెదుగుతున్న కాలం ఇది. కార్లలో, ఆటోల్లో ట్రాఫిక్ జాముల్లో ఇరుక్కుని మిగిలిపోయే సమయం కాదు. దానివల్ల కోట్లాది రూపాయలు నష్టపోతున్నాం. ఈ సమస్యలను వినూత్న ఆలోచనలతో పరిష్కరించుకోవలసిన అవసరం ఉంది.