Home మెదక్ సంగారెడ్డికి ట్రాఫికర్

సంగారెడ్డికి ట్రాఫికర్

సిగ్నల్ లేని జిల్లా కేంద్రం
సిగ్నల్ ఏర్పాటు కలేనా?
స్పందించని మంత్రులు, ఉన్నతాధికారులు

TRAFIC

మన తెలంగాణ/సంగారెడ్డి ప్రతినిధి : జిల్లా కేంద్రమైన సంగారెడ్డి పట్టణాన్ని అనాదిగా ట్రాఫిక్ సమస్య పట్టి పీడిస్తోంది. హైదరాబాద్ నగరానికి సమీపంలో వుండటం, జిల్లా కేంద్రం కావడం కారణంగా సంగారెడ్డి పట్టణంలో రద్దీ విపరీతం గా వుంటుంది. పెరుగుతు న్న రద్దీ కారణంగా ట్రాఫిక్ ను నియంత్రించేందుకు జిల్లా కేంద్రంలో సిగ్నల్స్ వ్యవస్థ లేక అస్తవ్యస్తంగా మారింది. సంగారెడ్డి జిల్లా కేంద్రంలో సిగ్నల్స్ వ్యవస్థ లేకపోవడంపై పలువురు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గత ఆరేళ్ల క్రితం మాజీ ఎమ్మెల్యే తూర్పు జయ ప్రకాష్‌రెడ్డి హయాంలో ఐదు లక్షల రూపాయలతో సిగ్నల్ అవసరమని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. కానీ ప్రభుత్వాలు మారినా, పాలకులు మారినా జిల్లా కేంద్రంలో సిగ్నల్స్ వ్యవస్థ మాత్రం ఇప్పటికీ ఏర్పాటు కాలేదు. సంగారెడ్డి పట్టణంలోని పోతిరెడ్డిపల్లి చౌరస్తా నుంచి కలెక్టరేట్, ఐటిఐ, ఐబి, కొత్తబస్టాండ్, ఎస్పీ కార్యాలయం, పాత బస్టాండ్ వరకు ట్రాఫిక్‌ను నియంత్రించేందుకు ట్రాఫిక్ సిగ్నల్స్ వుండాలి. కానీ వీటి గురించి పట్టించుకున్నవారే కరువయ్యారు. సంగారెడ్డి మండలం పోతిరెడ్డిపల్లి చౌరస్తాలో గత సంవత్సరం క్రితం ట్రాఫిక్ సిగ్నల్ ఏర్పాటు చేస్తే ఎలా వుంటుందని తెలుసుకోవడానికి తాత్కాలికంగా సిగ్నల్ ఏర్పాటు చేశారు. కానీ కొన్ని రోజులకే దాన్నీ తొలగించారు. ఈ సిగ్నల్ వ్యవస్థ ఏర్పాటు చేయడం వల్ల హైదరాబాద్, జహీరాబాద్, సంగారెడ్డి ప్రాంతాలకు వెళ్లే వాహనాలు క్రమబద్ధ్దీకరణలో వెళ్లేందుకు అవకాశం వుంటుంది. కానీ పోతిరెడ్డిపల్లి చౌరస్తాలో సిగ్నల్ వ్యవస్థ కాకుండా ట్రాఫిక్ పోలీసులు విధులు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో చౌరస్తాలో ట్రాఫిక్‌ను క్రమబద్దీకరిస్తున్న క్రమంలో ఇటీవల ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్‌ను లారీ అతివేగంగా వచ్చి ఢీకొన్నది. దీంతో ఆ ట్రాఫిక్ కానిస్టేబుల్ అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. దీంతో పాటు పోతిరెడ్డిపల్లి చౌరస్తాలో ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో సదాశివపేటకు చెందిన దంపతు లు కూడా దుర్మరణం చెందారు. ఇలా పోతిరెడ్డిపల్లి నుంచి సంగారెడ్డి పట్టణంలోని పాతబస్టాండ్ వరకు ట్రాఫిక్ నియంత్రణ ట్రాఫిక్ పోలీసులకు సమస్యగానే మారింది. జిల్లా కేంద్రం లోనే నివాసముండే ఉన్నతాధికారుల నుంచి ప్రజా ప్రతినిధుల వరకు ఎవరూ పట్టించుకోవడం లేదు. దీంతో పట్టణంలో రోజురోజుకు పెరుగుతున్న రద్దీ, వాహనాల సంఖ్య కారణంగా ట్రాఫిక్ సమస్యను నియంత్రించడంలో ట్రాఫిక్ పోలీసులకు సవాలుగా మారుతుంది. స్కూళ్ల సమయంలో ఉదయం, సాయంత్రం వేళ ఈ సమస్య మరీ తీవ్రంగా వుంటుంది. దీనికి తోడు ప్రధాన రహదారికి ఇరువైపులా వాహనాల ను అడ్డదిడ్డంగా నిలుపడంతో సమస్య మరింత జఠిలమవుతోంది. పట్టణంలోని దుకాణ సముదాయాలు నిర్మాణానికి ముందు పార్కింగ్ స్థలాలను వదలకపోవడం, రోడ్లలో సగం వరకు ఆక్రమించడంతో తరచూ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. పట్టణంలో దాదాపు ఫుట్‌పాత్ కూడా కరువైంది. మున్సిపల్ అధికారులు పలుమార్లు వ్యాపార, వాణిజ్య సముదాయ సంస్థల నిర్వాహకులకు తెలియజేసినా, దుకాణాలముందు ఫుట్‌పాత్‌ల ఆక్రమణలను కూల్చివేసినా కొన్ని రోజులకే పరిస్థితి యదావిధిగా మారుతోంది. ఫుట్‌పాత్‌ల ముందు వాహనాలను రోడ్డుకుసగం వరకు పార్కింగ్ చేయడంతో వాహనాల రాకపోలకు తీవ్ర ఆటకం కలుగుతోంది. సంగారెడ్డి పట్టణంలోని ఏ దుకాణం ముందు కూడా పార్కింగ్ కోసం స్థలాలు లేవు. దీంతో వాహనాలు రోడ్డుపై నిలుపుతుండటంతో ట్రాఫిక్ సమస్య మరింత పెరుగుతుంది. ఉన్నతాధికారులు, ప్రజా ప్రతినిధులు స్పందించి జిల్లా కేంద్రమైన సంగారెడ్డిలో సిగ్నల్ వ్యవస్థ ఏర్పాటు చేస్తే కొంత వరకు ట్రాఫిక్‌సమస్యను నివారించడానికి అవకాశం వుంటుంది.

కొత్త కలెక్టర్ కరుణించేనా?
కొత్త జిల్లాల పునర్విభజన తర్వాత సంగారెడ్డి జిల్లాకు కొత్తగా వచ్చిన కలెక్టర్ మాణిక్యరాజ్ ఇటీవల కాలంలో జిల్లా పాలనను గాడిలో పెడుతున్నారు. జిల్లాలో ముందుగా గాడి తప్పిన విద్య, వైద్య రంగాలు మెరుగైన సేవలందించేందుకు కార్యాచరణతో ముందుకుపోతున్నారు. వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పనితీరు మార్చుకోవాలని లేకుంటే కఠిన చర్యలుంటాయని ఆయన పదేపదే నిర్వహిస్తున్న సమీక్షా సమావేశాల్లో హెచ్చరిస్తున్నారు కూడా. దీంతో జిల్లా పరిపాలన కొంత పురోభివృద్ధి సాధిస్తుందనే చెప్పవచ్చు. అలాగే జిల్లా కేంద్రమైన సంగారెడ్డిలో అస్తవ్యస్థంగా మారిన ట్రాఫిక్ సమస్యను కూడా అరికట్టాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు. పట్టణంలో అవసరమైన చోట్ల సిగ్నల్ వ్యవస్థను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైనా వుందంటున్నారు. సంగారెడ్డి పట్టణంలో సిగ్నల్ వ్యవస్థ ఏర్పాటు విషయమై పోలీసు అధికారులను సంప్రదించగా ప్రభుత్వానికి నివేదిక పంపామని, ప్రభుత్వం నుంచి మంజూరు కావాల్సి వుందని సమాధానమిచ్చారు.