Home తాజా వార్తలు సిఎం కెసిఆర్ దార్శనికతతో చీకట్లను చీల్చిన ‘ప్రభా’కరుడు

సిఎం కెసిఆర్ దార్శనికతతో చీకట్లను చీల్చిన ‘ప్రభా’కరుడు

Transco and Genco CMD Prabhakar Raoతెలంగాణ ఏర్పడితే అంధకారమేననే అపహాస్యపు ప్రేలాపనలను పరిహాసం చేసి ఆరు నెలల వ్యవధి నుంచే క్రమంగా విద్యుత్ కోతలను ఎత్తివేసి ఏడాదికల్లా నిరంతరాయ విద్యుత్‌ను సరఫరా చేసే రాష్ట్రం ఆవిష్కారమైంది. వెలుగుల తెలంగాణ సాకారం వెనుక ఉద్యమ నేత కెసిఆర్ దూరదృష్టి, దార్శనికత, వ్యూహాతో పాటు దానిని తు.చ. తప్పకుండా అమలు చేయడంలో రాష్ట్ర ట్రాన్స్‌కో, జెన్‌కో సిఎండి దేవులపల్లి ప్రభాకర్‌రావు పాత్ర ప్రధానం. కరెంటును బాగు చేస్తారని రాష్ట్ర ప్రజలంతా సిఎం కెసిఆర్‌పై నమ్మకంతో ఉంటే, ఆయన మాత్రం దేవులపల్లి ప్రభాకరరావుపై నమ్మకం పెట్టుకున్నారు. కోతలు లేని తెలంగాణ కోసం వ్యూహరచన, దశల వారీ చర్యలతో నేడు దేశంలోనే తలసరి విద్యుత్ వినియోగం ఎక్కువగా ఉన్న రాష్ట్రంగా చరిత్రకెక్కింది.

తెలంగాణను పసిప్రాయంలోనే విఫలం చేద్దామనే కుట్రను పటాపంచలు చేసి యావత్తు దేశం గుర్తించే స్థాయికి తీసుకురావడంలో ప్రభాకరరావు కృషి మరువరానిది. ఆయన నేతృత్వంలో విద్యుత్ వ్యవస్థ సంస్కరణల అమలును వేగవంతం చేయడంతో పాటు నేడు దేశంలోనే వ్యవసాయ రంగానికి ఉచితంగా 24 గంటల విద్యుత్‌ను అందించే ఏకైక రాష్ట్రంగా ఆవిర్భవించింది. విద్యుత్ రంగంలోకి వచ్చి నేటికి ఐదు దశాబ్దాలు పూర్తయింది. సరిగ్గా ఫిబ్రవరి 10, 1969లో ఎపిఎస్‌ఇబి (ఎపి స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డు)లో ఉద్యోగంలో చేరారు. విద్యుత్ సంస్కరణలకు పూర్వం బోర్డులో మూడు దశాబ్ధాలు, తర్వాత రెండు దశాబ్ధాల వ్యవస్థను కళ్లారా చూసిన అనుభవ ప్రభ ఆయనది. నేటితో ఉద్యోగంలో చేరి యాభై ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా దేవులపల్లి ప్రభాకరరావుతో ‘మన తెలంగాణ’ ప్రత్యేక ఇంటర్వ్యూ.

ప్రశ్న: సర్వీసులో చేరి యాభై ఏళ్లు పూర్తి అయింది. ఇంకా అదే చిత్తశుద్ధితో, నిబద్ధతతో పనిచేస్తున్నారు.. మీలో నిత్యం శక్తిని నింపుతున్నదేంటి..?
జ: నేను అలసిపోయానని అనుకోవడంలేదు. నా వయసు పెరిగిందని కూడా అనుకోను. నేను పనిచేస్తున్న కార్యాలయం నా ఇంటికి ఒక కొనసాగింపే అనుకొని పనిచేస్తుంటా. ఇదే నా జీవన రహస్యం.
ప్ర: మీ బాల్యం.. విద్యాభ్యాసం. ఎప్పుడు విద్యుత్ సంస్థలో చేరారు.
జ: వరంగల్‌కు 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న పాలార్‌గూడ మా సొంతూరు. చిన్నతనం, విద్యాభ్యాసం, గ్రాడ్యుయేషన్ అంతా వరంగల్‌లోనే గడిచింది. మా నాన్న ఒక గ్రామాధికారి. తల్లి గృహిణి. మేం మొత్తం ఐదుగురు అన్నదమ్ములం, ముగ్గు రు అక్కచెల్లెళ్ళం. నేను అందరి కంటే చిన్నవాడ్ని. 1969, ఫిబ్రవరి 10వ తేదీన ఎపి విద్యుత్ బోర్డు (ఎపిఎస్‌ఇబి)లో డైరెక్ట్ రిక్రూటీగా చేరాను. ఆ సమయంలో తెలంగాణ ఉద్యమం ఉదృతంగా నడుస్తోంది. విద్యుత్ బోర్డులో తెలంగాణ ప్రాంతమన్నా, తెలంగాణ ప్రజలన్నా వివక్ష ఉండేది. బోర్డులో 99 శాతం మంది ఆంధ్రా ఉద్యోగులే.
ప్ర: తెలంగాణ వచ్చినప్పుడు, సర్వీసులో చేరిన మొదట్లో విద్యుత్ వ్యవస్థ స్థితిగతులెలా ఉండేవి..? ఇంత విశాలంగా ఆలోచించడానికి మిమ్మల్ని ప్రోత్సహించిదెవరు..?
జ: సర్వీసులో చేరిన కొత్తలో రాష్ట్రంలో కేవలం 25 శాతం మాత్రమే విద్యుదీకరణ ఉంది. అప్పటి సామర్థం కేవలం 300 నుంచి 400 మెగావాట్లు మాత్రమే. దేశవ్యాప్తంగా కూడా 12957 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి మాత్రమే. తలసరి విద్యుత్ వినియోగం 98 యూనిట్లు. దక్షిణాఫ్రికా నుంచి మోటివేషన్ పొందుతున్నా. అమెరికాలో 1994లో ఒక సదస్సుకు హాజరయ్యా. అక్కడ ఓ ఆఫ్రికా దేశ అధికారితో కాసేపు మాట్లాడితే, 35 శాతానికిపైగా విద్యుదీకరణ పూర్తయ్యింది. ప్రస్తుతానికి కంఫర్టబుల్‌గానే ఉన్నామని చెప్పాడు. అప్పుడే నాకు ఆలోచన వచ్చింది. ఎందుకు మనం అంతకు మించిన ప్రగతిని చూపకూడదు. పరిస్థితిని ఇంకా మెరుగుపరచాలి కదా. స్వాతంత్య్రం వచ్చేనాటికి దేశంలో కేవలం 1362 మెగావాట్ల సామర్థం మాత్రమే ఉంది.
ప్ర: 2014 ఎన్నికల కంటే ముందే కెసిఆర్‌తో కలిసి విద్యుత్ స్థితి మెరుగుపరచడంపై చర్చించారు. ఆయన ఏం చెప్పారు. మీరు ఏం చేసారు.?
జ: విజయంపై కెసిఆర్ విశ్వాసంతో ఉన్నారు. ఎన్నికలకు జరగడానికి ఒక రోజు ముందే (2014 ఏప్రిల్ 29న) కబురు పెట్టి, మరుసటి రోజు లంచ్ సమావేశానికి పిలిచారు. ఆ రోజు తెలంగాణలో ఎన్నికలు జరుగుతున్నాయి. ఆయన తన ఓటు వేసి మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో ఫాం హౌజ్‌కు వచ్చారు. రాత్రి 7 గంటల వరకు మా మధ్య చర్చలు కొనసాగాయి. కెసిఆర్ దృష్టంతా రాష్ట్రంలో విద్యుత్ పరిస్థితిని మెరుగుపరచడం ఎలా అనే అంశంపైనే. వీలైనంత త్వరగా పరిస్థితిని చక్కదిద్దాలన్న విషయంపైనే సాంకేతికంగా, సాధ్యాసాధ్యాలపైనా, ఆర్థిక ఇబ్బందులపైనా చర్చలు జరిగాయి. విద్యుత్, సాగునీరే తక్షణ ప్రాధాన్యతా రంగాలని కెసిఆర్ చెప్పారు. నాగార్జునసాగర్‌లో మేధోమధనం నిర్వహించి, విద్యుత్ స్థితిని సమూలంగా మార్చేసేందుకు స్వల్ప, మధ్యకాలిక, దీర్ఘకాలిక చర్యలు చేపట్టాలని నిర్ణయించాం. దీంతో మంచి ఫలితాలు సాధించాం. తెలంగాణ వచ్చిన రోజు 7778 మెగావాట్ల స్థాపిత సామర్ధం ఉంది. కరెంటు కోతలు బాగా ఉండేవి.
ప్ర: సమన్వయం గురించి ఏం చేశారు.?
జ: విద్యుత్ సంస్థలలకు గతంలో ఐఎఎస్ అధికారులే అధిపతు లుగా ఉండేవారు. సంస్థ లోతుపాతులు తెలుసుకునేలోపే బది లీ కావడం, ఇతర సంస్థలతో సమన్వయం లేకపోవడం జరిగే ది. కిందిస్థాయి సిబ్బందికి యాజమాన్యాన్ని కలిసే అవకాశం ఉండకపోయేది. తెలంగాణ ఏర్పడిన తర్వాత ట్రాన్స్‌కో, జెన్‌కో సంస్థలకు కెసిఆర్ నన్ను సిఎండిగా చేశారు. డిస్కంలలో కూడా అనుభవజ్ఞులైన టెక్నోక్రాట్లను నియమించారు. ఉన్నతాధికారి మొదలు క్రిందిస్థాయి సిబ్బందిమధ్య సత్సంబంధాలు ఏర్పడ్డా యి. గతంలో ఐఏఎస్‌లకు సత్వర నిర్ణయాలు తీసుకొని, అమ లు చేసే అధికారం తక్కువగా ఉండేది. కానీ సిఎం నాకు పూర్తి అధికారాలు ఇచ్చారు. సమిష్టికృషితో కెసిఆర్ ఆశించిన లక్ష్యాన్ని సాధించాం.
ప్ర: ఇంత త్వరగా పరిస్థితిని సంతృప్తకర స్థాయికి తీసుకువచ్చారు. ఇందుకోసం తీసుకున్న చర్యలేంటి? ప్రధానంగా ప్రభావితం చేసిన విషయాలేంటి?
జ: కరెంటు సమస్యను పరిష్కరించాలన్న కెసిఆర్ చిత్తశుద్ధే నాకు స్ఫూర్తి. ఆయన అనుకున్న లక్ష్యాన్ని సాధించేందుకు నాకు పూర్తి స్వేచ్చ ఇచ్చారు. విద్యుత్ సిబ్బంది సమిష్టికృషితో సాధించిన విజయమిది. తొలుత ప్లాంట్లలో పిఎల్‌ఎఫ్ (ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్)ను 60 శాతం నుంచి 80 శాతానికి పెంచాం. నష్టాలను కేవలం ఆరు నెలల్లో తగ్గించాం. 2000 మెగావాట్ల సోలార్ పవర్ ఉత్పత్తికి టెండర్లు పిలిచాం. ఎక్కడెక్కడ విద్యుత్ లభ్యత ఉందో వారి నుంచి ఒప్పందాలు చేసుకొని, కొనుగోలు చేశాం. చత్తీస్‌గడ్ నుంచీ కొనుగోలు చేశాం.
ప్ర: గతంలో కూడా కొంత మంది సిఎంలతో పనిచేశారు. కెసిఆర్‌లో చూసిన గొప్ప గుణం ఏంటి?
జ: ఆయా సమయం సందర్భాలను బట్టి అందరితోనూ ఉత్తమ పనితీరునే నేను కనబరిచా. నాక్కూడా మంచి ఎక్స్‌పీరియన్స్ అది. కెసిఆర్ మాత్రం విద్యుత్ సరఫరా, ఉత్పత్తి వ్యవహా రాల న్నీ ఒకే అధికారికి ఇవ్వాలని కాస్త భిన్నంగా ఆలోచించారు. దీంతో కింది స్థాయిలో పనితీరు సిబ్బంది కూడా కలిసి, సమ న్వయంతో పనిచేస్తారు. కెసిఆర్ ముందుచూపుతో ప్రభుత్వ రంగ సంస్థ అయిన బిహెచ్‌ఇఎల్‌కు నేరుగా జెన్‌కో ప్లాంట్ల నిర్మాణాన్ని ఇపిసి పద్ధతిలో అప్పగించారు. ఫలితంగా రూ.2800 కోట్ల మేర నిధులు, చాలా సమయం కలిసివచ్చాయి.
ప్ర: మాజీ ప్రధాని పివి నరసింహారావు రికమండేషన్‌తో మీకు ఉద్యోగం వచ్చిందా? మీకు పివి బంధువు కదా?
జ: అవును. పివి మాకు బంధువు. 1969లో నన్ను ఉద్యోగంలో చేరమని రికమండ్ చేశారు. ఆ సమయంలో తెలంగాణ ఉద్యమం ఉదృతంగా ఉండేది. అందులో పాల్గొనవద్దని నాకు పివి సూచించారు. కానీ నేను వినలేదనుకోండి…
ప్ర: రాష్ట్రంలో ప్రస్తుతం విద్యుత్ సామర్థం, డిమాండ్ ఎంత?, వచ్చే ఐదేళ్లలో మీ ప్రణాళికలేంటి.?
జ: ప్రస్తుతం రాష్ట్రంలో 16504 మెగావాట్ల విద్యుత్ సామర్థం ఉంది. మరో నాలుగేళ్లలో 11800 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్లు పూర్తవుతాయి. దీర్ఘకాలిక వ్యూహంలో భాగంగా భవిష్యత్తులో వచ్చే అవసరాలు, లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు, ఇతర డిమాండ్‌కు తగ్గట్లుగా కొత్త ప్లాంట్లు కడుతున్నాం. మరో మూడు, నాలుగేళ్లలో అవి కూడా ఉత్పత్తిని ప్రారంభిస్తాయి.
ప్ర: వ్యవసాయానికి 24 గంటల సరఫరా ఇవ్వాలన్న ఆలోచన ఎవరిది. నిరంతర కరెంటు ఇస్తామని ఎప్పుడైనా ఊహించారా? విజయంలో మీ అనుభూతి ఏంటి..?
జ: సాగుతో పాటు అన్ని వర్గాలు, రంగాలకు 24 గంటల కరెంటు ముఖ్యమంత్రి కెసిఆర్ ఆలోచనే. మాకు ఆయన ఆలోచన చెప్పి, చేయమన్నారు. అంతకు ముందు కోతలు లేని, నాణ్యమైన విద్యుత్‌ను నా జీవితకాలంలో ఇస్తామనుకోలేదు. కానీ సమిష్టి కృషితో, కెసిఆర్ ఇచ్చిన నైతిక బలంతో రైతులకు ఉచితంగా 24 గంటల విద్యుత్‌ను అందించగలుగుతున్నాం. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ విజయం ఒక విప్లవాత్మకమైనది.
ప్ర: యాభై ఏళ్ల విద్యుత్ రంగ అనుభవంలో ఎదుర్కొన్న సవాళ్లు ఏంటి?
జ: 24 గంటల విద్యుత్‌ను అన్ని వర్గాలకు ఇవ్వడం అతి పెద్ద సవాల్. నా కెరీర్‌లోనే ఊహించని ఈ సవాల్‌ను స్వీకరించి, సమిష్టి కృషితో సాధించాం. ఇందులో కెసిఆర్ గ్రేట్ విజన్, మిషన్ కూడా ఉంది. కల నిజమైంది. ఈ పథకం ప్రారంభించే సమయంలో నా అనుభూతిని మాటల్లో వర్ణించలేం. నా జీవితంలో చారిత్రక సంఘటన అది.
ప్ర: 24 గంటల సాగు విద్యుత్‌తో భూగర్భ జలాలు తగ్గుతాయని, నీరు వృధా అవుతుందన్న విమర్శలపై ఏమంటారు?
జ: అది తప్పు. భూగర్భ జలాలను రైతులు వృధా చేయరు. మన రైతులు తెలివైన వాళ్లు. నాణ్యమైన కరెంటుతో ఉపాధి అవకాశాలు కూడా పెరిగాయి. చాలా మందికి ఉపాధి దొరుకుతోంది. కానీ బ్యాటరీలు, ఇన్వర్టర్ల తయారీ కంపెనీల వ్యాపారం నిరంతర కరెంటు సరఫరాతో పడిపోయింది.
ప్ర: కేంద్రం నుంచి వచ్చిన, వస్తున్న సహకారం ఎంత.?
జ: కేంద్ర సహకారం సున్న. రాష్ట్రానికి ఇవ్వాల్సిందే ఇచ్చా రు. ఇస్తున్నారు. అదనంగా ఎట్లాంటి నిధులూ ఇవ్వలేదు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా రాష్ట్రంతో సహకరించలేదు. పిపిఎలను ఏకపక్షంగా రద్దు చేసింది. అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టింది. మరింత కసిగా పనిచేసి, స్వయం సమృద్ధ రాష్ట్రంగా, మిగులు విద్యుత్ రాష్ట్రంగా అవతరించాం.
ప్ర: కింద స్థాయి సిబ్బందికి మీరిచ్చే సందేశం.
జ: మనస్సాక్షి చెప్పినట్లు నడుచుకోవాలి. మనం చేసిది తప్పా, ఒప్పా మనస్సాక్షి చెబుతుంది.
ప్ర: ఇతర బాధ్యతల గురించి..?
జ: బ్రాహ్మణ పరిషత్‌లో సభ్యునిగా నియమిస్తున్నామని నాకు చెబితే. వద్దని చెప్పాను. 90లలోనే కులాంతర వివాహాలు మా ఇంట్లో జరిగాయి.

విద్యుత్ రంగంలో వినూత్న కృషి: ప్రపంచ బ్యాంకు భారత ప్రతినిధి బృందంలో సభ్యునిగా ఎపిఎస్‌ఇబికి ఒక బిలియన్ డాలర్ల రుణాన్ని సాధించారు.
టోక్యోలోని అతిపెద్ద హైడ్రో ప్రాజెక్ట్‌కు సంబంధించిన ఒప్పంద నియమాలు ఖరారు చేయటంతో పాటు జపాన్ బ్యాంక్ ఫర్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్‌తో చర్చలు.
ఏప్రిల్ 2018న ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లో పిఎఫ్‌సి నిర్వహించిన ‘గ్లోబల్ ఔట్ రీ ప్రోగ్రామ్’ లో పాల్గొన్నారు.
2017 మేలో స్వీడన్‌లోని ఏబిబి ఫ్యాక్టరీ తనిఖీ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
2016 జూన్ యుఎస్‌లోని శాన్‌ఫ్రాన్సిస్కోలో తెలంగాణ మంత్రి కెటిఆర్‌తో కలిసి ‘ఫస్ట్ సబ్ కాంటినెంట్ క్లీన్ ఎనర్జీ మినిస్టీరియల్ కాన్ఫరెన్స్’పై నివేదిక సమర్పించారు.
విద్యుత్ రంగానికి సంబంధించి ఇటలీ, ప్యారిస్ (2013)లో బెస్ట్ గ్లోబల్ ప్రాక్టీస్ ప్రోగ్రామ్ సభ్యునిగా వ్యవహరించారు.
1992 – 2002 వరకు ప్లానింగ్ కమిషన్ ఆన్ ఫైనలైజేషన్ ఆఫ్ రిసోర్సెస్ టు పవర్ సెక్టర్ ఇన్ ఎపి తో పాటు, 2004 నుంచి ఎపిజెన్ కో బాధ్యతలు నిర్వర్తించారు.
ఫైనాన్స్ సభ్యుడిగా విద్యుత్ రంగ సంస్కరణలు, ఆంధ్రప్రదేశ్ రాష్ర్ట ఎలక్ట్రిసిటి బోర్డ్ పునర్వ్యవస్థీకరణ చేపట్టి ఎపిఎస్‌ఇబిని ఎపిట్రాన్స్ కో, ఎపిజెన్ కో, నాలుగు డిస్ట్రిబ్యూషన్ కంపెనీలుగా విభజించారు.
‘పిజి కోర్స్ ఇన్ ఎనర్జీ మేనేజ్ మెంట్ ఆఫ్ ది యూనివర్సిటి ఆఫ్ హైదరాబాద్’ సలహా బృందంలో సభ్యుడిగా పనిచేశారు.

అవార్డులు: 

  • విద్యుత్ రంగంలో అద్వితీయమైన కృషికిగాను ‘ఎకనామిక్ టైమ్స్ అవార్డు 2018’
  • విద్యుత్ పంపిణీ రంగంలో ఉత్తమ పాత్ర పోషించినందుకుగాను ‘సిబిఐపి ప్రత్యేక గుర్తింపు అవార్డు 2018’
  • తెలంగాణ విద్యుత్ రంగం, పంపిణీలో మార్పులు, నిర్వహణ పై ‘స్కోచ్ గోల్డ్ అవార్డు 2018’
  • తెలంగాణ ప్రభుత్వం మేడే సందర్భంగా ప్రదానం చేసిన ‘టిఎస్ జెన్ కో, టిఎస్ ట్రాన్స్ కో బెస్ట్ మేనేజ్ మెంట్ అవార్డు’ గ్రహీత
  • విద్యుత్ రంగంలో విశేష కృషికిగాను ‘డాక్టర్ బూర్గుల రామకృష్ణారావు అవార్డు 2016’.
  • విద్యుత్ రంగంలో అసమాన ప్రతిభ కనబరచినందుకు ‘నేషనల్ కౌన్సిల్ ఆఫ్ పవర్ యుటిలిటీస్’ నుండి ‘ఇండియా
  • పవర్ అవార్డు 2013’.
  • ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్రాక్టికల్ అకౌంటెన్సీ, హైదరాబాద్ నుండి ‘ఎక్స్‌లెన్సీ ఇన్ అకౌంటెన్సీ అండ్ ఫైనాన్స్ అవార్డు’.

Transco and Genco CMD Prabhakar Rao Special Interview