Search
Monday 24 September 2018
  • :
  • :

భూఖండాల మార్పిడితో అంబరాన్నంటిన సంబరాలు

Bangladesh_20150801.jpg.ashxఏడు దశాబ్దాల భారత్-బంగ్లా భూఖండాల అనిశ్చితికి తెర, 50 వేల మందికి పౌరసత్వంతో అధికారిక గుర్తింపు
కూచ్ బెహర్ (పశ్చిమబెంగాల్): దాదాపు ఏడు దశాబ్దాలుగా రాజ్యరహి త అనిశ్చితిలో పౌరసత్వం కోసం ఎదురుచూస్తున్న వేలాది మంది ప్రజలు స్వేచ్ఛావాయువులు పీల్చుకున్నారు. శుక్రవారం అర్థరాత్రి దాటిన కొద్ది సెకండ్లకే భారత్, బంగ్లాదేశ్‌లలో ఉన్న భూ ఖండాల సమస్య పరిష్కారం కోసం వాటి బదలాయింపు ప్రక్రియ మొదలుకావడంతో దాదాపు 50 వేల మంది ప్రజలు సంబరాల్లో మునిగి తేలారు. 162 భూఖండాల బదలా యింపు సందర్భంగా వందలాది మంది తమ నివాసాల నుంచి బయటకు వచ్చి భారత్‌లో 51, బంగ్లాదేశ్‌లో 111 భూఖండాల్లో తమ తమ జాతీయ జెండాలను ఎగురవేశారు.

ఆనందంతో నృత్యాలు చేశారు. జూన్‌లో భారత్-బంగ్లాదేశ్‌ల మధ్య జరిగిన భూ సరిహద్దు చారిత్రక ఒప్పందం ద్వారా ఈ భూ బదలాయంపు ప్రక్రియ సాకారమైంది. ఈ భూ ఖండాల్లో దశాబ్దాలుగా రాజ్యరహిత స్థితిలో కాలం వెళ్లదీస్తూ వచ్చిన సుమారు 51 వేల మంది ప్రజలకు తాము కోరుకున్న దేశాల్లో నివసించే అవకాశం లభించింది. బంగ్లాదేశ్‌లోని భూ ఖండాల్లో నివసిస్తున్న 14 వేల మంది ఇప్పుడు భారత్‌లో విలీనమయ్యారు. ఇకనుంచి వారికి భారత పౌరసత్వం లభించినట్టే. భారత భూఖండాలన్నీ పశ్చిమబెంగాల్‌లోని కూచ్ బెహర్ జిల్లాలో ఉన్నాయి.
వెయ్యి మంది ప్రజలు మినహా తక్కిన బంగ్లాదేశ్‌లోని భారత్ భూ ఖండాల్లో నివసిస్తున్న వారంతా బంగ్లాదేశ్ పౌరులుగా గుర్తింపు పొం దుతారు. మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం మృతితో భారత్‌లో సంతాప దినాలు కొనసాగుతున్న కారణంగా ఉత్సవ కార్యక్రమాలను కుదించారు. అధికారికంగా ఈ ఉత్సవాలను నిర్వహించనప్పటికీ కూచ్ బెహర్ లోని దిన్‌బట సబ్ డివిజన్‌కు ఆనుకుని ఉన్న మధ్య మసల్‌డంగ భూఖథండంలో భారత్-బంగ్లాదేశ్ ఎన్‌క్లేవ్ ఎక్సేంజ్ కోఆర్డినేషన్ కమిటీ ఆధ్వర్యంలో ఉత్సవం జరిపారు. 1947లో జరిగిన విభజన సమయం నుంచి ఈ భూఖండాలు అస్తిత్వం చిక్కుల్లో పడటంతో అక్కిడి ప్రజలు గుర్తింపు కార్డులు, సొంత భూములు లేవు. పాఠశాలలు, కరెంటు, ఆరోగ్య సేవలు వంటి సదుపాయాలు కూడా లేని పరిస్థితిని ఎదుర్కొంటూ వచ్చారు. తాజాగా బదలాయింపు ప్రక్రియ షురూ కావడంతో తొలిసారిగా వారికి గుర్తింపు కార్డులు లభిస్తాయి. ‘మా వరకూ ఇది రెండో స్వాతంత్య్రం కింద లెక్క. ఇండియాకు 1947లో స్వాతంత్య్రం వచ్చి ఉండవచ్చు.

మాకు మాత్రం ఇవాళే స్వాతంత్య్రం వచ్చింది. ఈరోజు నుంచి మేము ఈ దేశ పౌరులమవుతాం. మేము కూడా భారతీయులుగా పిలిపించుకుంటాం’ అని త్రివర్ణ పతాకాన్ని ఊపుతూ పద్దెనిమిదేళ్ల యువకుడు ఒకరు తన సంతోషాన్ని పంచుకున్నాడు. నరేంద్ర మోడీ ప్రధాని అయిన తర్వాత ఢాకాను పర్యటించిన తర్వాతే భూ సరిహద్దు తుది ఒప్పందంపై భారత్ సంతకం చేసింది. భూ బదలాయింపు ప్రక్రియ శుక్రవారం అర్థరాత్రి నుంచి కార్యరూపంలోకి రావడంతో ఇంతవరకూ పౌరసదుపాయాలు లేని అరలక్ష మంది ప్రజలు పాఠశాలు, కరెంటు, ఆరోగ్య సేవలు వంటివి పొందగలుగుతారు. ‘భూఖండాల్లో నివసించే ప్రజలకు ఇది కేవలం ఒక చారిత్రక దినం మాత్రమే కాదు. దశాబ్దాలుగా మేము సాగిస్తున్న కృషి, ఉద్యమాలు ఫలించిన రోజు ఇది’ అని భారత్-బంగ్లాదేశ్ ఎన్‌క్లేవ్ ఎక్సేంజ్ కోఆర్డినేషన్ కమిటీ చీఫ్ కోఆర్డినేటర్ దీప్తిమాన్ సేన్ గుప్తా వ్యాఖ్యానించారు.
మమత అభినందనలు
భూ సరిహద్దుల ఒప్పందంపై సంతకాల సమయంలో హాజరైన పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సైతం భూఖండాల బదలాంపులు సందర్భంగా దశాబ్దాలుగా అక్కడే నివసిస్తున్న ప్రజలకు అభినందనలు తెలిపారు. ‘చారిత్రక ఎల్‌బిఎ ఒప్పందం అర్థరాత్రి నుంచి అమల్లోకి వచ్చింది. వేలాది మంది ప్రజలు కొత్తగా గుర్తింపు పొందుతారు. వారికి నా అభినందనలు’ అని మమత ట్వీట్ చేశారు. కాగా, భూఖండాల బదలాయింపు ప్రక్రియ ప్రారంభమైనప్పటికీ నవంబర్ వరకూ తమ ఆవాసాలను వదిలేసి కోరుకున్న ఆవాశాలకు ప్రజలు నవంబర్‌లోగా రావాల్సి ఉంటుంది. ‘నవంబర్ నుంచి ఈ ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఈ మధ్య సమయంలో అవతల నుంచి వచ్చే వారి కోసం చిన్న చిన్న నివాసాలు ఏర్పాటు చేయబోతున్నాం’ అని ఎడిఎం (కోచ్ బెహర్ ) చిరంజిబ్ ఘోష్ తెలిపారు.

Comments

comments