Home తాజా వార్తలు బదిలీలు నేటి నుంచే

బదిలీలు నేటి నుంచే

telangana tenth class supplementary exams from June 4

వచ్చే నెల 15 వరకు 

40 శాతానికి పెంపు

రెండేళ్లు ఒకే చోట ఉంటే అర్హత ఐదేళ్లు ఉంటే తప్పనిసరి భార్యాభర్తలకు తొలి ప్రాధాన్యం
ఏడాదిలో రిటైర్ అయ్యే వారికి కోరుకున్న చోటుకు

మన తెలంగాణ / హైదరాబాద్ : ప్రభుత్వ ఉద్యోగుల సాధారణ బదిలీలపై ఇంతకాలం ఉన్న నిషేధాన్ని ఎత్తివేయడంతో పాటు శుక్రవారం నుంచి వచ్చేనెల 15వ తేదీ వరకు అన్ని ప్రభుత్వ విభాగాల్లో బదిలీలకు ప్రభుత్వం మార్గదర్శకాలను రూపొందించింది. వెంటనే అమల్లోకి వచ్చేలా ఉత్తర్వులు జారీ చేసిన ప్రభు త్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కె జోషి బదిలీలకు అవలంబించాల్సిన నిబంధనలతో పాటు బదిలీ కోసం ఉద్యోగులు చేసుకునే దరఖా స్తు నమూనాను కూడా విడుదల చేశారు. మొత్తం ఉద్యోగుల్లో సాధారణ బదిలీలు 40% మించరాదని ప్రభుత్వం స్పష్టం చేసిం ది. భార్యాభర్తలు ఉద్యోగస్తులైనట్లయితే ‘స్పౌజ్’ కేసుగా పరిగణించి తొలి ప్రాధాన్యతగా ఇవ్వడం మొదలు ఏ అంశానికి ఎ లాంటి ప్రాధాన్యత ఇవ్వాలనేది వరుసక్రమంలోనే ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది. శుక్రవారం నుంచే ప్రారంభమయ్యే బదిలీ ప్రక్రియకు నిర్దిష్ట షెడ్యూలును కూడా ప్రధాన కార్యదర్శి ఖరారు చేశారు. సాధారణ బదిలీలను చేపట్టాలని ఉద్యోగ సంఘాల నుంచి వస్తున్న వరుస విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకున్న ముఖ్యమంత్రి కెసిఆర్ ఈ నెల 16వ తేదీన ఉద్యోగ సంఘాలతో సమావేశమై ఈ ప్రక్రియను సజావుగా, పారదర్శకంగా చేపట్టడానికి వీలుగా ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ మిశ్రా అధ్యక్షతన త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేశారు. నాలుగైదు రోజుల పాటు ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో చర్చించిన ఈ కమిటీ ప్రభుత్వానికి నివేదిక సమర్పించడంతో ఆమోదం లభించింది. ఆ కమిటీ చేసిన సిఫారసుల మేరకు ప్రధాన కార్యదర్శి ఎస్‌కె జోషి మార్గదర్శకాలను విడుదల చేస్తూ గురువారం ఉత్తర్వులు జారీచేశారు. ఉద్యోగుల బదిలీలకు సంబంధించి ఆయా విభాగాల ఉన్నతాధికారులు, హెచ్‌ఓడిలు ఈ మార్గదర్శకాలను విధిగా పాటించాలని ఆ ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. వచ్చే నెల 15కల్లా ఈ ప్రక్రియ ముగుస్తున్నందున ఆ మరుసటి రోజు (జూన్ 16) నుంచి యధావిధిగా ఉద్యోగుల సాధారణ బదిలీ ప్రక్రియపై నిషేధం మొదలవుతుందని కూడా స్పష్టం చేశారు.
నిబంధనల్లో వీరికి వెసులుబాటు :
సాధారణ బదిలీల్లో భార్యాభర్తల కేసులు, పదవీ విరమణ చేయనున్నవారికి, ‘ఆర్డర్ టు సెర్వ్’ ప్రాతిపదికన పనిచేస్తున్నవారికి ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. నిర్దిష్టంగా ఒకే చోట రెండేళ్ళ కంటే ఎక్కువ కాలం నుంచి పనిచేస్తున్నట్లయితే (2018 మే 31వ తేదీ నాటికి) వారు బదిలీకి అర్హులవుతారని సిఎస్ స్పష్టం చేశారు. భార్యాభర్తలు ఒకేచోట ఉండేలా ముఖ్యమంత్రి స్పష్టత ఇచ్చినందువల్ల బదిలీ షరతు వారికి వర్తించదని, రెండేళ్ళకంటే తక్కువ సర్వీసు ఉన్నప్పటికీ భార్యాభర్తలు ఒకేచోట ఉండేలా బదిలీ ఉండవచ్చని పేర్కొన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొత్త జిల్లాల్లో ‘ఆర్డర్ టు సెర్వ్’ ప్రాతిపదికన పనిచేస్తున్న ఉద్యోగులకు కూడా ఈ షరతు వర్తించదని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఒక ఉద్యోగి ఐదేళ్ళ కంటే ఎక్కువ కాలం నుంచి కొనసాగుతున్నట్లయితే తప్పనిసరిగా బదిలీ చేయాలని పేర్కొన్న సిఎస్ ఈ నెల 31వ తేదీ నాటికి ఐదేళ్ళ సర్వీసు పూర్తిచేసుకున్నట్లయితే తప్పనిసరిగా బదిలీ కావాల్సి ఉంటుందని, ఒకవేళ వచ్చే ఏడాది మే 31 నాటికి పదవీ విరమణ చేయనున్న ఉద్యోగులకు ఈ షరతు వర్తించకపోగా వారి ఇష్టప్రకారమే బదిలీ నిర్ణయం ఉంటుందని పేర్కొన్నారు.
బదిలీల్లో ప్రాధాన్యతా క్రమం :
సాధారణ బదిలీల్లో భాగంగా ఒకే విభాగంలోని ఉద్యోగులు ఒకరికంటే ఎక్కువ మంది ఒకే నిర్దిష్ట ప్రాంతానికి ఆప్షన్ ఇచ్చినట్లయితే ఆయా విభాగాధిపతులు అనుసరించాల్సిన ప్రాధాన్యతాక్రమాన్ని కూడా సిఎస్ నిర్వచించారు. వరుసక్రమంలో ఆ ప్రాధాన్యతలు :
* భార్యాభర్తలు ఒకేచోట ఉండేందుకు వీలుగా అలాంటి ‘స్పౌజ్’ కేసులు బదిలీకి దరఖాస్తు చేసుకున్నట్లయితే తొలి ప్రాధాన్యత.
* వచ్చే ఏడాది మే 31కల్లా పదవీ విరమణ చేస్తున్నవారికి వారి ఇష్టప్రకారం బదిలీ నిర్ణయం జరగాలి.
* 70% అంగవైకల్యంతో బాధపడుతున్నట్లయితే బదిలీలో ప్రాధాన్యత ఇవ్వాలి.
* మానసిక వైకల్యంతో బాధపడుతున్న పిల్లలు ఉన్నట్లయితే ఆ ఉద్యోగులకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలి.
* కారుణ్య నియామకంలో మహిళలు ఉద్యోగం చేస్తున్నవారికి ప్రాధాన్యత
* ఉద్యోగి లేదా వారి జీవిత భాగస్వామి అనారోగ్యం కారణంగా బదిలీ చేపట్టేటప్పుడు ఆ అనారోగ్య తీవ్రతకు అనుగుణంగా ప్రాధాన్యత ఇవ్వాలి. ఆ ఉద్యోగిపై ఆధారపడే తల్లిదండ్రులు లేదా పిల్లలను దృష్టిలో పెట్టుకుని బదిలీ జరగాలి. ఆ ప్రాధాన్యతలు వరుస క్రమంలో ఇలా… క్యాన్సర్, న్యూరో సర్జరీ, కిడ్నీ మార్పిడి, లివర్ మార్పిడి, ఓపెన్‌హార్ట్ సర్జరీ, బోన్ టి.బి. అయితే ఇలాంటి వైద్య కారణాలను ఉద్యోగులు ప్రస్తావించినప్పుడు వాటిలోని వాస్తవాన్ని ఆయా విభాగాల ఉన్నతాధికారులు ధృవీకరించుకోవాలి. అవసరమైతే తగిన చర్య కోసం ప్రభుత్వాన్ని సంప్రదించాలి.
* కఠినమైన భౌగోళిక ప్రాంతాలు లేదా మారుమూల ప్రాంతాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు ప్రాధాన్యత ఇవ్వాలి. ప్రతీ ప్రభుత్వ విభాగం అలాంటి ప్రాంతాలను, అక్కడ పనిచేస్తున్న ఉద్యోగులను గుర్తించాలి.
* దీర్ఘకాలం నుంచి ఇలాంటి ప్రాంతాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు ప్రాధాన్యత.
* ఒక నిర్దిష్ట ప్రాంతంలో అన్ని కేడర్‌లలో పనిచేస్తున్న ఉద్యోగుల సర్వీసును బదిలీ సందర్భంగా పరిగణనలోకి తీసుకుంటారు.
ఆదాయాన్ని ఆర్జించే విభాగాలకు స్వంత మార్గదర్శకాలు :
ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలకు స్పష్టమైన మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేసినప్పటికీ ఆదాయాన్ని ఆర్జించే వాణిజ్యపన్నులు, ఎక్సయిజ్, స్టాంపులు రిజిస్ట్రేషన్లు, రవాణా, అటవీ పర్యావరణం తదితర శాఖలతో పాటు పోలీసు శాఖ కూడా వాటికి అనువుగా స్వంత మార్గదర్శకాలను రూపొందించుకోవచ్చని ప్రధాన కార్యదర్శి స్పష్టత ఇచ్చారు. ప్రభుత్వ గుర్తింపు పొందిన ఉద్యోగ సంఘాల ఆఫీస్ బేరర్స్ బదిలీ విషయంలో విచక్షణతో కూడిన నిర్ణయం తీసుకోవాలి.
ప్రక్రియలో పారదర్శకత :
ప్రభుత్వ ఉద్యోగుల సాధారణ బదిలీ ప్రక్రియ మొత్తం పారదర్శకంగా జరిగేందుకు స్పష్టమైన నిబంధనలను సిఎస్ పేర్కొన్నారు.
* ప్రతీ విభాగాధిపతి, హెచ్‌ఓడి ఆయా శాఖల్లో బదిలీకి అర్హత పొందిన ఉద్యోగులు, వారి స్థాయి (కేడర్), పనిచేస్తున్న ప్రాంతం, అదే ప్రాంతంలో పనిచేస్తూ ఉన్న సర్వీసు తదితరాలను పేర్కొని ఆయా కార్యాలయాల్లో ఉద్యోగులందరి పరిశీలన కోసం ప్రదర్శించాలి.
* ఉద్యోగులు ఆప్షన్లు ఇవ్వడానికి ముందుగానే ఆ విభాగంలో ఖాళీ పోస్టులను పేర్కొనాలని స్పష్టం చేశారు. తప్పనిసరిగా బదిలీ కావాల్సిన ఉద్యోగుల జాబితాను కూడా ప్రదర్శించాలి.
* ఉద్యోగులు ఏ ప్రాంతానికి వెళ్ళాలని కోరుకుంటున్నారో ఆ విభాగాధిపతి ఐదు ఆప్షన్లను వారి నుంచి కోరాలి. ఒకవేళ ఏదేని నిర్దిష్ట పరిస్థితుల్లో నిబంధనల్లో మార్పులు చేయాల్సి వస్తే ప్రత్యేక అవసరాల కోసం మార్పులు చేయవచ్చు.
* మారుమూల ప్రాంతాల్లోని విభాగాలు ఉద్యోగుల బదిలీ ప్రక్రియతో ఇబ్బంది పడకుండా ఉండేలా యధావిధిగా పనిచేసే తీరులో సిబ్బంది కొరత ఏర్పడకుండా ఆయా విభాగాధిపతులు జాగ్రత్త వహించాలి.
* ఒకవేళ మారుమూల ప్రాంతాల్లో పనిచేయడానికి ఉద్యోగులు ఆప్షన్ ఇవ్వనట్లయితే లాటరీ పద్ధతి ద్వారా ఎంపిక చేయాలి.
* ప్రతీ బదిలీని కౌన్సిలింగ్ విధానంలో పారదర్శకంగా అమలుచేయాలి. ఆన్‌లైన్ ద్వారా కౌన్సిలింగ్ జరిపే అవకాశం ఉంటే దాన్ని అవలంబించాలి.
* బదిలీ ప్రక్రియ పారదర్శకంగా జరిగేందుకు వీలుగా అర్హులైన ఉద్యోగుల జాబితా, ఖాళీ పోస్టులు, తప్పనిసరి బదిలీలు తదితర వివరాలన్నింటినీ నోటీసు బోర్డులో పెట్టాలి.
కొన్ని శాఖలకు ప్రత్యేక అవకాశాలు :
విద్యాశాఖలో ఉపాధ్యాయులు, లెక్చరర్ల బదిలీకి ఈ ‘బదిలీ మార్గదర్శకాల’కు అనుగుణంగా విడిగా ఆపరేషనల్ మార్గదర్శకాలను రూపొందించుకోవాలని సిఎస్ ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.. పోలీసు శాఖ సైతం వాటి పనితీరుకు అనుగుణంగా స్వంత మార్గదర్శకాలను రూపొందించుకోవాలని పేర్కొన్నారు. ఏయే కేడర్ స్థాయికి ఉన్నతాధికారి ఎవరు అనే అంశంపై కూడా సిఎస్ స్పష్టత ఇచ్చారు. రాష్ట్రస్థాయి కేడర్ అయినట్లయితే ఆయా విభాగాల ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, ముఖ్య కార్యదర్శి, కార్యదర్శి ఉన్నతాధికారి అవుతారని, లేదా కన్వీనర్ లాంటి వారు హెచ్‌ఓడిగా ఉన్నట్లయితే వారే ఉన్నతాధికారి అని, కొన్ని సందర్భాల్లో కార్యదర్శి చేత నియమించబడిన అదనపు కార్యదర్శి లేదా సంయుక్త కార్యదర్శి లేదా డిప్యూటీ కార్యదర్శి ఉన్నట్లయితే వారే ఉన్నతాధికారి అని స్పష్టం చేశారు. మల్టీ జోనల్ లేదా జోనల్ కేడర్ అయినట్లయితే ఆయా విభాగాల హెచ్‌ఓడిలు, అదనపు లదా సంయుక్త లేదా డిప్యూటీ కార్యదర్శి, ప్రాంతీయ అధికారి లేదా అదనపు డైరెక్టర్ లేదా సంయుక్త డైరెక్టర్‌లు ఉన్నతాధికారులుగా ఉంటారని పేర్కొన్నారు. జిల్లా స్థాయిలో పూర్వ జిల్లా కలెక్టర్ అధ్యక్షతన కొత్త జిల్లాల కలెక్టర్లు సభ్యులుగా ఉంటారని పేర్కొన్నారు. హెచ్‌ఓడిలు అయినట్లయితే పూర్వ జిల్లాల హెచ్‌ఓడి కన్వీనర్‌గా ఉంటారని, కొత్త జిల్లాల హెచ్‌ఓడిలు సభ్యులుగా ఉంటారని పేర్కొన్నారు. రాష్ట్రపతి ఉత్తర్వులు అమల్లో ఉన్నందున ఉద్యోగుల బదిలీ సందర్భంగా వాటిని పాటించాలని, జిల్లా, జోనల్, మల్టీ జోనల్ ఉద్యోగులకు ఇది వర్తిస్తుందని సిఎస్ స్పష్టం చేశారు. కొత్త జిల్లాల్లోని ఉద్యోగుల బదిలీ సందర్భంగా పాత జిల్లా స్థాయి, జోనల్ స్థాయిని దృష్టిలో పెట్టుకుని ‘కంట్రోలింగ్ అథారిటీ’ సమతుల్యాన్ని పాటించాలని స్పష్టం చేశారు. రాష్ట్రస్థాయి కేడర్‌ను బదిలీ చేసే సందర్భంగా ఈ మార్గదర్శకాలను పాటించే క్రమంలో రెండు రాష్ట్రాల మధ్య వివాదంతో ముడిపడి ఉన్నట్లయితే తుది ఉత్తర్వులకు లోబడి ఈ బదిలీ నిర్ణయం ఉంటుందని స్పష్టం చేశారు. ఈ మార్గదర్శకాలు తు.చ తప్పకుండా అమలుచేయడంలో ఆయా విభాగాల హెచ్‌ఓడిలు వ్యక్తిగతంగా బాధ్యత తీసుకోవాలని స్పష్టం చేశారు.
బదిలీ షెడ్యూలు :
సాధారణ బదిలీ ప్రక్రియను ఎప్పుడు ప్రారంభించి ఎప్పటికి ముగించాలనేదానిపై స్పష్టమైన షెడ్యూలును కూడా ప్రధాన కార్యదర్శి ఈ ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. మే 25 నుంచి బదిలీ మార్గదర్శకాలు అమల్లోకి వస్తున్నందువల్ల తొలి ఏడు రోజుల పాటు (మే 31 వరకు) ఆపరేషనల్ మెకానిజంను (కార్యాచరణ యంత్రాంగం) రూపొందించడానికి ఆయా విభాగాల అధిపతులు ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో చర్చించాలి.
ఆయా విభాగాల్లో బదిలీకి అర్హత పొందిన ఉద్యోగులెవరు, తప్పనిసరిగా బదిలీ కావాల్సిన ఉద్యోగులు, ఖాళీగా ఉన్న పోస్టులు, బదిలీకి అర్హత పొందినవారి సర్వీసు వివరాలు తదితరాలన్నింటినీ నోటీసు బోర్డులో ప్రదర్శించాల్సి ఉంటుంది. జూన్ 1 నుంచి 5వ తేదీ వరకు బదిలీకి అర్హత పొందినవారు ఆప్షన్లతో కూడిన దరఖాస్తును ఆయా విభాగాల హెచ్‌ఓడిలకు సమర్పించాల్సి ఉంటుంది. జూన్ 6 నుంచి 12 వరకు ఉద్యోగుల దరఖాస్తులను పరిశీలించి బదిలీ మార్గదర్శకాలకు అనుగుణంగా కౌన్సిలింగ్‌ను పూర్తి చేసి తుది జాబితాను తయారుచేయాల్సి ఉంటుంది. జూన్ 13 నుంచి 15వ తేదీ వరకు ఉద్యోగులకు బదిలీ ఉత్తర్వులను జారీ చేయాలి. అవి అందుకున్న మూడు రోజుల్లోపల ఉద్యోగులు పూర్వ సంస్థ నుంచి రిలీవ్ కావాల్సి ఉంటుందని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.