Home ఆఫ్ బీట్ కష్టపడి కాదు.. ఇష్టపడి చేయాలి

కష్టపడి కాదు.. ఇష్టపడి చేయాలి

 Being a teacher, the decided to become a teacher

ప్రొఫెసర్, పర్వతారోహకురాలు, ప్రముఖ హోస్ట్ రేఖారావు

కొండంత ధైర్యం ఆమె సొంతం. అవలీలగా కొండ లెక్కేంత సాహసం. ప్రముఖ పర్వతారోహకురాలు బచేంద్రిపాల్‌ను ఆదర్శంగా తీసుకుంది. తనుకూడా పర్వా తాలు అధిరోహించి మహిళలకు స్ఫూర్తిగా నిలిచింది. ప్రతి మనిషికి ఓ లక్షం ఉండాలంటుంది. లక్షాలను ఎంచుకునే ముందే వాటి గురించి ఆలోచించాలి. నిరంతరం శ్రమిస్తేనే గమ్యాన్ని చేరగలమని చెబుతోంది. అవాంతరాలను తట్టుకునే స్వభావం అలవర్చుకోవాలి. పట్టుదలతో ప్రయత్నిస్తే అసాధ్యమైనది ఏదీ ఉండదు. పుట్టుకతో ఎవ్వరూ మేధావులు కారు.  ఒక రకంగా చెప్పాలంటే మేధావులందరూ విద్యావంతులు కాదు. ఎంచుకున్న లక్ష్యాలు సాధించలేక పోతే పోయిందేమీ లేదు. మరో మార్గం ఎంచుకుని పయనించడం అలవాటు చేసుకోవాలి. ఏదైన కష్టపడినా అది దక్కని పక్షంలో మనకిష్టమైన మార్గాన్ని ఎంచుకోవాలి. బాధ్యత, జవాబుదారీ తనం అనేవి జీవితంలో చాలా ముఖ్యమైనవంటున్న ప్రముఖ హోస్ట్, పర్వతారోహకురాలు రేఖారావుతో సకుటుంబం మాటా మంతీ..!

విద్యార్థి దశలోనే ఉపాధ్యాయ వృత్తిలో రాణించాలని లక్షంగా చేసుకుంది. తల్లి కూడా ఉపాధ్యాయురాలు కావడంతో టీచర్ అవ్వాలని నిర్ణయం తీసుకుంది. ఇదిలావుండగా చిన్నప్పటి నుంచే ధైర్యంగా వ్యవహరించడం అలవాటైంది. ఎన్‌సిసి, ఎన్‌ఎస్‌ఎస్‌లలో కోర్సులలో మొదటిస్థానం కోసం శ్రమించి సాధించింది. ఇంటర్ నుంచి డిగ్రీ వరకు జావా వాహనంపై కాలేజీకి వెళ్లి తనదైన శైలిని ప్రదర్శించేది. ఇప్పుడు కూడా ఇక్కడికి దగ్గరలో ఎక్కడికైనా వెళ్లాంటే హార్లిడేవిడ్‌సన్ అనే వాహనంపై వెళుతుంటానని వివరిస్తోంది. ఈక్రమంలో తాను టీచర్ కావాలన్న కోరిక నెరవేర్చుకునేందుకు లయోలా కాలేజీలో బిఇడి (ఎకనామిక్స్)పూర్తి చేసింది. అనంతరం ఎంఏ, ఎంఫిల్, స్కూల్ మేనేజ్‌మెంట్ విద్యను అభ్యసించింది. తన చిన్నప్పటి కోరిక మేరకు కొంతకాలం ఉపాధ్యాయురాలిగా పనిచేసింది. ఆపై సొంతంగా స్కూల్ ఏర్పాటు చేసుకుని అనేక మందిని ఉత్తమ విద్యార్థులుగా తీర్చిదిద్దింది. జీవితంలో ఏదో సాధించాలన్న తపన ఆమెలో మరింత పెరిగింది.

సమాజంలో ఆదర్శవంతుల జీవితాలను తిరగేసింది. తాను కూడా మహిళాలోకానికి ఆదర్శం కావాలని తలంచింది. ఈక్రమంలోనే విస్‌డమ్ అనే మ్యాగజైన్‌లో బచేంద్రిపాల్ గురించి వార్త చదివింది. ఆమెను ఆదర్శంగా తీసుకుని డార్జిలింగ్‌లో పర్వాతారోహణపై శిక్షణ తీసుకుంది. ఈ నేపథ్యంలో హిమాలయాలు, సిక్కింలో 28వేల అడుగులున్న ఫ్రీ పీక్, 20వేల అడుగులున్న డాక్టర్ బిసి రాయ్ పీక్‌లను అధిరోహించింది. పర్వతారోహణ విషయంలో పెళ్లికి ముందు అమ్మానాన్నలు ప్రోత్సహించారు. వివాహానంతరం ఇండియన్ ఆర్మీలో కర్నల్‌గా పనిచేస్తున్న తన భర్త బలాజీ దయాల్ మరింత ప్రొత్సాహించారని చెబుతోంది. ప్రస్తుతం ఓ ప్రముఖ ఇంజినీరింగ్ కాలేజీలో ప్రొఫెసర్‌గా పనిచేస్తోంది. అయితే పిల్లల అభీష్టానికి విరుద్దంగా ఇంజినీరింగ్ చదవిస్తుండటం చాలా బాధాకరం.

వారికి వేరొక రంగంలో రాణించాలను కుంటే వారి తల్లి తండ్రులు మాత్రం ఇంజనీరింగ్ పూర్తి చేసి సాఫ్ట్‌వేర్‌గా కావాలని కలలు కంటున్నారు. దీంతో కొందరు విద్యార్థులు అయిష్టంగా విద్యనభ్యసిస్తున్నారు. మరికొందరైతే కనీసం ఇంగ్లీష్‌ను అర్థం చేసుకోలేని స్థితిలో ఉన్నారు. ఇండియన్ క్రికెటర్ సచిన్ తన అభీష్టం మేరకు విద్యకు స్వస్తి పలికి ప్రపంచం గర్వించే క్రీడాకారుడిగా గుర్తింపు పొందాడని గుర్తించాలి. ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళుతున్న వారి కోసం భారతదేశంలోనే ఆయా విద్యనందించాలని ప్రణబ్ ముఖర్జీని సైతం గతంలో కలవడం జరిగింది. విద్యారంగంలోనూ సమూల మార్పులు చోటుచేసుకున్పప్పుడే ఉత్తమ విద్యార్థులను సమాజానికి అందివ్వగలుగుతామని రేఖరావు వివరిస్తున్నారు.

సామాజిక ఉద్యమాలు
ఒకరికి చెప్పడం సులభం. అదే ఆచరించి చూపించడమే రేఖారావు నైజం. సామాజిక ఉద్యమాల ద్వారా అనేక సమస్యలు పరిష్కారమౌతాయి. సంఘటితంగా పోరాడితే సమస్యలు మటుమాయం అవుతాయంటోంది. ముఖ్యంగా ప్లాస్టిక్ నిషేధించాలని చేపడుతున్న ఉద్యమానికి మంచి ఫలితాలు వస్తున్నాయి. దీర్ఘకాలంగా పట్టిపీడిస్తున్న సమస్యల కొద్దికొద్దిగా కనుమరగవుతాయని, ప్లాస్టిక్‌పై పెద్ద ఎత్తున ఉద్యమించాలన్న సంకల్పంతో ఉన్నామంటోంది. అలాగే అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నాం. అవినీతి పెట్రేగిపోవడం వల్లే ఎక్కడికక్కడ అభివృద్ధి ఆగిపోతోంది. వేధింపులకు గురైన మహిళలకు న్యాయం జరిగే విధంగా పోరాటాలు సైతం చేపడుతున్నాం. ముఖ్యంగా రెడ్ ఐ, యాంటీ డ్రగ్స్‌పై ఉద్యమిస్తున్నాం. ఏదైనా సమస్య తమ దృష్టికి వస్తే వెంటనే ఆ సమస్య పరిష్కారానికి ఉద్యమించేందుకు సిద్ధంగా ఉన్నామంటోంది. ఇప్పటి వరకు 40 సార్లు రక్తదానం చేసింది రేఖారావు.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున చేపట్టిన అనేక కార్యక్రమాలకు హోస్ట్‌గా వ్యవహరించింది. ఈ నేపథ్యంలో తెలంగాణ ఎక్సలెన్స్ కార్యక్రమంతోపాటు మరో 35 కార్యక్రమాలకు హోస్ట్‌గా వ్యవహరించి ప్రముఖుల ప్రశంసలు అందుకుంది. అలాగే ఎం.ఎ., ఎకనామిక్స్ విద్యను అభ్యసించడం వల్ల భారతదేశ ఆర్దిక వ్యవస్థలోని లోపాలు తెలుసుకోగలిగానంటోంది. కేంద్ర బడ్జెట్ ప్రవేశ పెట్టినప్పుడు వివిధ రంగాలకు కేటాయించిన బడ్జెట్‌పై జరిగే విశ్లేషణలకు తనకు జాతీయ మీడియా ఆహ్వానం పలుకుతుండటం గర్వంగా ఉందని రేఖారావు వివరిస్తున్నారు. తాను చేస్తున్నది అవార్డు, రివార్డుల కోసం కాదని మహిళలు అన్ని రంగాలలో రాణించాలన్న సందేశాన్ని మారుమూల ప్రాంతాలకు సైతం తెలియజేయడమే తన లక్షమంటోంది.

విద్య పేరిట వ్యాపారం
చిన్న తరగతుల వారికి ఐఐటి నేర్పిస్తున్నామని ప్రైవేట్ స్కూళ్లు వ్యాపారం చేస్తున్నాయి. 6వ తరగతి నుంచి ఐఐటి నేర్పించినా వారికి అర్థం కాదు. ఐఐటి మెటీరియల్ పేరిట డబ్బులు వసూలు చేయడం ప్రైవేట్ స్కూళ్లకు అలవాటుగా మారింది. ఒక్కో విద్యార్థి నుంచి 3వేల నుంచి 4వేల వరకు వసూలు చేస్తున్నారు. ఇటీవల కాలంలో భారీగా ఫీజులు చెల్లించడం ఒక ప్యాషన్ అయిపోయింది. తమ పిల్లలకు పెద్ద ఎత్తున ఫీజులు కట్టి చదివిస్తున్నామని కొందరు తల్లితండ్రులు భావిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చినట్లు చెబుతోంది. ఇలాంటి విషయాలపై తల్లిదండ్రులు అవగాహన పెంచుకోవాలని సూచిస్తుంది.

                                                                                                          – చెన్నూరి నాగ శ్రీధరశర్మ, మన తెలంగాణ ప్రతినిధి