Home ఎడిటోరియల్ గిరిజనుల గోడు

గిరిజనుల గోడు

ఆర్.అంజయ నాయక్
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి,
తెలంగాణ గిరిజన సమాఖ్య

tribesతెలంగాణ 10 జిల్లాలలో మైదానప్రాంత గిరిజనులు అధికశాతం ఉన్నారు. వీరు వ్యవ సాయం, వ్యవసాయ కూలీలుగాను పట్టణ ప్రాంతాలలో, భవన నిర్మాణం, ఆటోరిక్షా కార్మికులు గాను జీవనం సాగిస్తున్నారు. సరియైన సమయంలో వర్షాలు పడక, పనులు దొరకకా అనేకమంది గిరిజన రైతులు అప్పుల ఊబిలో చిక్కుకొని ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.
వీరి పిల్లలు నాణ్యమైన మంచి విద్యను అభ్యసించి ఉన్నతస్థానంలో రాణించే పరిస్థితులు లేవు. తండాలలో, గూడేలలో ప్రమాణాలతో కూడిన పాఠశాలలు, కాలేజీలు లేవు. అరకొర వసతులు, అధ్యాపకుల కొరత తీవ్రంగా ఉండటం వలనపై స్థానాలకు వెళ్లలేకపోతున్నారు. సక్రమం గా రిజర్వేషన్లు అమలు కావడం లేదు. వాటిపై ప్రభుత్వానికి అజమాయిషీ లేదు. గిరిజన ఆడబిడ్డలు, మధ్యతరగతి విద్యకు దూర మౌతున్నారు. గిరిజన హాస్టల్స్‌లో వసతులు లేవు. ఇరుకు గదులలో ఉంటున్నారు. మౌలిక వసతులు లేవు. నాణ్యమైన భోజనం అందటం లేదు. జీవనోపాధి లేక ఆడపిల్లలను అమ్ముకోవలసిన పరిస్థితి దాపురించింది.
నిధులు : జనాభా నిష్పత్తి ప్రకారం వీరికి వార్షిక ప్రణాళిక బడ్జెట్‌లో నిధులు కేటాయించి ఖర్చు పెట్టాలి. ఆ నిధులు వారికే ఖర్చుపెట్టాలి. కాని ప్రభుత్వాలు వీరి నిధులను దారి మళ్లిస్తున్నాయి. గిరిజనులకు బడ్జెట్‌లో 9.34% నిధులు ఖర్చు చేయాలి. మాడా, ఐటిడిఎ, ట్రైకార్ సంస్థలు, గిరిజనులకు అవసరం వచ్చే విధంగా, వారి ఆర్థిక పరిపుష్టి కోసం నిధులు ఖర్చు చేయాలి. కాని అలా చేయటం లేదు. ఎస్‌టి కార్పొరేషన్‌లలో అవినీతి పేరుకుపోయింది. దళారీలు పెరిగారు.
భూ పంపిణీ ః అటవీ హక్కుల చట్టంప్రకారం ఒక గిరిజన కుటుంబానికి 10 ఎకరాల భూమి పంచ వచ్చు. గిరిజనులకు అటవీ భూమిపై హక్కులను కల్పించాల్సి ఉన్న గత పాలకులు, ఆ చట్టానికి తూట్లుపొడిచి చేతులు దులుపుకున్నారు. రాష్ట్రం లో అనేకమంది గిరిజనులు పోడు వ్యవ సాయం చేసుకుంటున్నారు. వారికి పట్టాలు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు హరితహారం ప్రాజెక్టుల పేరుతో అడవి భూములను కొల్లగొట్టి గిరిజను లను నిరాశ్రయులను చేస్తున్నారు.
టిఆర్‌ఎస్ పార్టీ వాగ్దానం : టిఆర్‌ఎస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో దళిత/గిరిజనులకు మూడు ఎకరాల భూమి ఇస్తానని చెప్పింది. ఇప్పు డు దళిత/గిరిజనుల ఐక్యత దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తున్నది. దళితుల మాదిరిగానే నిరుపేద గిరిజన కుటుంబాలకు మూడు ఎకరాల భూమిని ఇవ్వాలని తెలంగాణ గిరిజన సమాఖ్య రాష్ట్ర ప్రభుత్వానికి సూచన చేసింది.
ఆర్భాటంగా 10 మంది దళితులకు భూ పంపిణీ చేసి గిరిజనుల విషయంలో ఆ మాట కూడా ప్రస్తావించటం లేదు. ఇప్పుడు నిరంతర ప్రక్రియ అని మాట మార్చారు.
-గత ప్రభుత్వం కోనేరు రంగారావు కమిటీ సిఫారసు ప్రకారం ఒక గిరిజన కుటుంబానికి 10 ఎకరాల భూమి పంచవచ్చని సిఫారసు చేసింది. కాని ఈ ప్రభుత్వం కనీసం మూడు ఎకరాల భూమిని ఇవ్వటంలో కూడా గిరిజనులను విస్మరి స్తుంది.
– బ్యాక్‌లాగ్ ఉద్యోగాలను గిరిజన నిరుద్యోగుల భర్తీ చేయటం ద్వారా కొంతమేరకైనా నిరుద్యోగ సమస్యను నిర్మూలించవచ్చు. అనేక రంగాలలో గల ఉద్యోగ ఖాళీల భర్తీలో గిరిజన రిజర్వేషన్లు అమలు పరచాలి.
– తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రకటన ల్లో గిరిజనులకు 10% రిజర్వేషన్లు ప్రకటించ వలసి ఉండగా 6% మాత్రమే చేస్తున్నది.
– విదేశాలలో విద్యను అభ్యసించడానికి వెళ్లే గిరిజన విద్యార్థులకు ప్రభుత్వం పూర్తిగా ఆర్థిక సహాయం అందించాలి. ఈ సాయాన్ని 25 లక్షల నుండి 50లక్షలకు పెంచాలి. ఐఎఎస్/ ఐఎఫ్ ఎస్/ ఐఆర్‌ఎస్ కోచింట్ సెంటర్లలో విద్యను అందించాలి.
జనాభా : రాష్ట్రంలో 13 ఉపతెగలు కలిగిన గిరిజ నుల సంక్షేమం పట్ల ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే వీరి అభివృద్ధికి బాసటగా నిలవాలి. 500 జనాభా కల్గిన తండాలను పంచాయతీలుగా గుర్తించాలని గత కొన్ని సం॥ల నుండి ప్రభు త్వాలపైన పోరాటాలద్వారా ఉద్యమాల ద్వారా ఒత్తిడి చేస్తున్నారు. ఆ మేరకు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. కాని, అమలు చేయటంలో నిర్లక్షం వహిస్తున్నది.
– తండాలు/గూడేలకు అభివృద్ధికోసం తండాల అభివృద్ధి సంస్థను ఏర్పాటు చేయాలని గిరిజన సమాఖ్య కోరుతున్నది.
– 12% ఇతర ఉప తెగలను కలుపుకోవటం ద్వారా 12% రిజర్వేషన్ అమలు పరుస్తామనటం సరైంది కాదు. ఎట్టి పరిస్థితులలోనూ ఇతరులను ఎస్‌టిలలో కలుపుకునే పరిస్థితి ఉండకూడదు. రాజ్యాంగ బద్ధతలేని చెల్లప్ప కమిషన్‌ను వేశారు. దానిని రద్దు చేయాలని గిరిపుత్రులు కోరుకుం టున్నారు. సుప్రీంకోర్టు సూచన ప్రకారం రిజర్వేషన్లు 50% దాటకూడదు. గిరిజనులకు 12% ఇస్తే పరిధి దాటుతుంది. ఇది ప్రభుత్వానికి తెలియంది కాదు. కాని కేవలం కాలయాపన చేసి గిరిజనులను మోసం చేసే వ్యూహాన్ని ఈ ప్రభుత్వం అవలంబిస్తున్నది. గిరిజనుల పండుగ లు/ఆచారాలను ఆచరణలో హరింపచేస్తున్నారు. గిరిపుత్రులు అనేక విధాలుగా అణచివేతకు గురి అవుతున్నారు. పిసా, అట్రాసిటి చట్టాలలో మార్పు లు రావాలి. వీటిలోను వీరికి తగిన న్యాయం జరగటం లేదు. గిరిజనులకు/గిరిజనేతరులకు మధ్య వివాదం పెరుగుతున్నది.సామాజికంగా ను, ఆర్థికంగానూ, రాజకీయంగాను గిరిజనుల ను అణగద్రొక్కుతున్నారు. అంతేకాకుండా, రాజ కీయాలలో సముచిత స్థానం కల్పించటం లేదు.
– 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశ ఆదివాసీ జనాభా 9 కోట్లు. 461 ఉపతెగలు ఉన్నాయి. 92% జీవనాధారం అడవి భూములే,
– బ్రిటీష్ హయాంలో తెల్లదొరలు ఆదివాసులను అడవులనుంచి దూరం చేసేందుకు ప్రయత్నిం చారు. ఇప్పుడు ఈ పాలకులు కూడా అదే చేస్తున్నారు.
– అడవులపై ఆదివాసీలకు సంపూర్ణ హక్కులు ఇస్తే బహుళజాతి కంపెనీలకు, ప్రాజెక్టులకు తమ ఇష్టానుసారం అడవుల్ని బదలాయించటం సాధ్యం కాదన్న లోపాయి కారి కుట్ర ఈ ప్రభు త్వాలది. లాబీల ముందు గిరిజనుల చారిత్రక హక్కుల పునరుద్ధరణ బలాదూరై పోయింది. రాజ్యాంగం 5వ షెడ్యూల్ పరిధిలోకి వచ్చే రాష్ట్రం లో 1996లో వచ్చిన పిసా చట్టం ఎప్పుడో అట కెక్కింది. 23% మేర అటవీ భూములు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో గిరిజన జనాభా 2011 లెక్కల ప్రకారం 9.34% ఎస్‌కెఎస్ ప్రకారం 9,91 శాతంగా గుర్తించారు.
పెరుగుతున్న జనాభా నిష్పత్తి ప్రకారం వారికి రిజర్వేషన్లు కల్పించాలని రాజ్యాంగం చెప్తున్నా పాలకులు పట్టించుకోవటం లేదు. ఆదివాసీ సమాజంలో నిరాశా నిస్పృహలు తొల గించడానికి పాలకులు చిత్తశుద్ధితో పని చేయాలి. గనుల తవ్వకాలు, భూసేకరణ వంటి వివాదా స్పద అంశాల్లో పెట్టుబడి దారులకన్నా గిరిజనుల మనోభావాలకు విలువ ఇవ్వాలి.