Home జాతీయ వార్తలు ట్రబుల్ తలాక్!

ట్రబుల్ తలాక్!

ind

రాజ్యసభలో బిల్లు ప్రవేశం, రభస సెలెక్ట్ కమిటీకి పంపించాలంటూ ప్రతిపక్షం తీర్మానం ప్రతిపాదన
తీవ్ర వాగ్వాదం, గందరగోళం మధ్య రూలింగ్ ఇవ్వకుండానే సభ నేటికి వాయిదా

న్యూఢిల్లీ: ఏకబిగిన మూడుసార్లు తలాక్ చెప్పి భారకు విడాకులివడాన్ని నేరంగా పరిగణించే ముస్లిం మహిళల (వివాహ హక్కుల రక్షణ)బిల్లు 2017ను బుధవారం విపక్షాల గందరగోళంలో న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ రాజ్యసభలో ప్రవేశపెట్టారు. చట్టవ్యతిరేకమైన ఈ ఆచారాన్ని అరికట్టేందుకు బిల్లును వేగంగా ఆమోదించాలని బిజెపి సభ్యులు వాదించగా, ట్రిపుల్ తలాక్ బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపాలని విపక్షాలు పట్టుబట్టాయి. దీంతో అధికార, విపక్ష సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. మహారాష్ట్ర కుల హింసపై మూడుసార్లు సభ వాయిదా పడి మధ్యాహ్నం 3 గంటలకు తిరిగి సమావేశమైంది. ఏకబిగిన మూడుసార్లు తలాక్ చెప్పి విడాకులివ్వడాన్ని చట్ట వ్యతిరేకంగా, శిక్షార్హంగా పరిగణించి అది చెప్పిన భర్తకు కనీసం మూడేళ్ల జైలు శిక్ష విధించేందుకు ప్రతిపాదించిన ఈ బిల్లుపై ఉభయపక్షాలు వాదోపవాదాలకు దిగాయి. ట్రిపుల్ తలాక్ బిల్లుకు తాము వ్యతిరేకం కాదని కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీ స్పష్టం చేస్తూనే దాన్ని లోపరహితం చేసి మరింత బలోపేతం చే సేందుకు, లోతుగా పరిశీలించేందుకు సెలెక్ట్ కమిటీకి పంపాలని డిమాండ్ చేశాయి. లోక్‌సభ ఈ బిల్లును ఇప్పటికే డిసెంబర్ 28న ఆమోదించింది. ట్రిపుల్ తలాక్ రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు కూడా తీర్పు చెప్పినందున బిల్లును సత్వ రం ఆమోదించడం మంచిదని ప్రభుత్వం నొక్కి చెప్పింది. అయితే ఈ బిల్లు విషయం లో వివిధ వర్గాల భాగస్వాముల అభిప్రాయాలను కూడా లెక్కలోకి తీసుకోవలసి ఉందని విపక్షాలు పట్టుబట్టాయి. సభలో తీవ్ర వాదోపవాదాలు, గందరగోళం ఏర్ప డ్డం, ఎన్నిసార్లు హెచ్చరించినా సభ సాధారణ స్థితికి రాకపోవడంతో సెలెక్ట్ కమిటీకి పంపాలన్న విపక్షాల తీర్మానంపై ఎలాంటి రూలింగ్ ఇవ్వకుండానే రాజ్యసభ చైర్మన్ పి.జె.కురియన్ సభను గురువారానికి వాయిదా వేశారు. ‘ట్రిపుల్ తలాక్‌ను సుప్రీం కోర్టు రాజ్యాంగ విరుద్ధంగా పేర్కొంది. లోక్‌సభ డిసెంబర్ 28న ఆమోదించిన ఆ బిల్లు ‘చరిత్రాత్మక బిల్లు’. పార్లమెంటులో దీనిపై చట్టాన్ని చేసి తీసుకురావాలని న్యాయమూర్తులు సూచించారు. సుప్రీంకోర్టు నివారించినా, లోక్‌సభ ఆమోదించినప్పటికీ ఈ ఆచారాన్ని ఇంకా ఆచరిస్త్తూనే ఉన్నారు’ అని అంతకు ముందు మంత్రి రవిశంకర్ ప్రసాద్ అన్నారు. ఈ బిల్లును లోక్‌సభలో కాంగ్రెస్ కూడా ఆమోదించిందని పేర్కొన్నారు. ఏది ఎలా ఉన్నప్పటికీ ఈ ట్రిపుల్ తలాక్ బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపించాల్సిందేనంటూ విపక్షాలు మొండిపట్టుబట్టాయి. కాం గ్రెస్ డిప్యూటీ నాయకుడు ఆనంద్ శర్మ ఈ మేరకు తీర్మానం చేశారు. ఈ తీర్మానాన్ని కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీ, తృణమూల్ కాంగ్రెస్, ఎఐఎడిఎంకె, బిఎస్‌పి, డిఎంకె, ఎన్‌సిపి, సిపిఐ, సిపిఐ(ఎం), టిడిపి, ఆర్‌జెడి, బిజెడి, జెఎంఎం, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్, నామినేటెడ్ సభ్యుడు కెటిఎస్ తులసి ప్రతిపాదించారు. అయితే సెలెక్ట్ కమిటీకి బిల్లును సమర్పించాలని శర్మ పెట్టిన తీర్మానం ‘చెల్లదు’ అని అధికారపక్ష సభా నాయకుడు అరుణ్ జైట్లీ చెప్పారు. శర్మ అనుసరించిన విధానానికి కూడా అభ్యంతరం చెప్పారు. రాజ్యసభ నుంచి బిల్లు రానందున, శర్మ పేర్కొన్న నియమం 70 (ఉపనియమం 2ఎ) ఈ బిల్లు కు వర్తించదని జైట్లీ చెప్పారు. బిల్లును లోక్‌సభ ఆమోదించి రాజ్యసభకు పంపిందని కూడా ఆయన స్పష్టం చేశారు. అంతేకాక సెలెక్ట్ కమిటీని ఏర్పాటు చేయాలన్న నోటీసును ముందు ఇవ్వలేదని తద్వారా పార్లమెంటరీ విధానాలను ఉల్లంఘించారని జైట్లీ అభ్యంతరాన్ని లేవనెత్తారు. ట్రిపుల్ తలాక్ రాజ్యాంగ విరుద్ధమని ఆగస్టు 22న ఇద్దరు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు తీర్పు చెప్పారు. ఆ ఆచరణ సరైంది కాదని అభిప్రాయపడ్డారు. వారు తమ విచక్షణాధికారాన్ని ఉపయోగించి ట్రిపుల్ తలాక్ ఆచారాన్ని ఆరు నెలల కోసం రద్దు చేశారు. ఆ ఆరు నెలల గడువు ఫిబ్రవరి 22న ముగియనున్నది. ఈ కారణంగా ఈ బిల్లును శీఘ్రంగా ఆమోదించాలని బిజెపి సభ్యులు పట్టుపట్టారు. ఈ సందర్భంగా జైట్లీ కాంగ్రెస్‌పై విరుచుకుపడుతూ ‘సభలో ఏమిజరుగుతుందో దేశమంతా చూస్తోం ది. ఈ బిల్లును మీరు లోక్‌సభలో సమర్థించారు. కానీ ఇక్కడ(రాజ్యసభలో) గాడి తప్పిస్తున్నారు’ అన్నారు. అంతేకాక ఆయ న ఈ విషయంలో అధ్యక్షుడి రూలింగ్‌ను డిమాండ్ చేశారు.
జైట్లీ అభిప్రాయాలను కాంగ్రెస్ నాయకుడు కపిల్ సిబాల్ వ్యతిరేకిస్తూ ‘సుప్రీంకోర్టు మైనార్టీ తీర్పునే మంత్రి ప్రస్తావిస్తున్నారు. కానీ దీనిపై వేగిరం చేయాలని సుప్రీంకోర్టు మెజారిటీ తీరేమి లేదు’ అని అన్నారు. దాంతో మంత్రి సహా బిజెపి సభ్యులు రెచ్చిపోయి నిలబడి గోల చేశారు. ‘మహిళలను గౌరవించడం తప్పా?’ అని నిలదీశారు. దానికి కాంగ్రెస్ నాయకుడు శర్మ ‘మేము మహిళల హక్కులను గౌరవిస్తాం, సమర్థి స్తాం. మేమేమి వ్యతిరేకించడం లేదు. మేము మద్దతునిస్తు న్నాం. మేమేమి కపటులం(హిపోక్రైట్స) కాము. అయితే ఈ బిల్లు శాసన పరిశీలన ప్రక్రియను పూర్తిచేసుకోవాలనే కోరుకుంటున్నాం’ అన్నారు. వాగ్వాదాలు, గందరగోళం నడుమ రాజ్యసభ గురువారానికి వాయిదా పడింది.
కాంగ్రెస్‌ది పటాటోప మద్దతు: జైట్లీ
‘రాజ్యసభలో ట్రిపుల్ తలాక్ బిల్లును కాంగ్రెస్ పరోక్షంగా వ్యతిరేకిస్తోంది. ఈ వైఖరి కారణంగా ముస్లిం మహిళలు అన్యాయాన్ని ఇంకా ఎదుర్కోవలసి రావొచ్చు. లోక్‌సభలో ప్రతిపక్షం బిల్లుకు ఇచ్చిన మద్దతు కేవలం చూయించుకోడానికే(పటాటోపమే)’అని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అన్నారు. అయితే కాం గ్రెస్, ప్రతిపక్షాలు చివరికైనా దీనికి మద్దతు ఇస్తారన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. ‘రేపు (గురువారం) రాజ్యసభలో ఈ బిల్లుకు ఏమి జరగనున్నది?’ అని ఆయనని ప్రశ్నించినపుడు ‘రేపు పార్లమెంటు ముందుకు వచ్చినప్పుడు దాని సంగతి చూస్తాం’ అన్నారు.
విపక్షాలకు ముస్లిం పర్సనల్ లా బోర్డు కృతజ్ఞతలు
ట్రిపుల్ తలాక్ బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపాలని కోరిన విపక్షాలకు ఆల్ ఇండియా ముస్లిం లా బోర్డు(ఎఐఎంపిఎల్‌బి) బుధవారం కృతజ్ఞతలు తెలిపింది. వారు తమ వైఖరిపై గట్టిగా నిలబడతారన్న ఆశాభావాన్ని కూడా వ్యక్తం చేసింది. ‘ఈ బిల్లులోని లోపాలను సెలెక్ట్ కమిటీ నిర్మూలిస్తుంది’ అని ముస్లిం పర్సనల్ లా బోర్డు ప్రతినిధి మౌలానా ఖలీలురెహ్మాన్ సజ్జాద్ నోమాని వ్యాఖ్యానించారు. బిజెపి అనుసరిస్తున్న వైఖరిని తాము తీవ్రం గా వ్యతిరేకిస్తున్నామన్నారు. ఈ బిల్లు ఇదే రూపంలో ఆమోదం పొందితే ముస్లిం మహిళల కష్టాలు రెట్టింపవుతాయి అన్నారు.