Home Default పండుగలా జిల్లా పార్టీ కార్యాలయానికి శంకుస్థాపన

పండుగలా జిల్లా పార్టీ కార్యాలయానికి శంకుస్థాపన

అతి తక్కువ కాలంలోనే ఎన్నో పథకాలు అందించిన పార్టీ టిఆర్‌ఎస్
టిఆర్‌ఎస్ సభ్యత్వం కోసం ప్రజలు బారులు
తిరుగులేని పార్టీగా టిఆర్‌ఎస్ పార్టీ

TRS

 

మన తెలంగాణ/సూర్యాపేట : 70 సంవత్సరాల స్వాతంత్ర భారతావనిలోని ఏ పార్టీ కూడా ప్రవేశపెట్టని సంక్షేమ పథకాలను టిఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి అన్నారు. సోమవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని నూతన ఎస్పి కార్యాలయం సమీపంలోని పార్టీ కార్యాలయానికి కేటాయించిన స్థలంలో పూజా కార్యక్రమాలు నిర్వహించి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వందల ఏళ్ల చరిత్ర ఉన్న పార్టీలకు కూడా సాధ్యం కానీ విధంగా అభివృద్ధి, సంక్షేమ ఫలాలను ప్రజలకు అందిస్తున్న ఏకైక పార్టీ టిఆర్‌ఎస్ పార్టీ అని చెప్పారు. ప్రతి సంవత్సరం కేవలం ప్రజల సంక్షేమం కోసమే 45 వేల కోట్లు ఖర్చు పెడుతున్న పార్టీ దేశంలో ఒక్క టిఆర్‌ఎస్సేనని పేర్కొన్నారు. సిఎం కెసిఆర్ చాణిక్య నీతితో గొప్ప వ్యూహంతో ప్రత్యేక రాష్ట్ర గమ్యాన్ని టిఆర్‌ఎస్ ముద్దాడిందన్నారు. ప్రభుత్వ పరంగానే కాకుండా పార్టీ పరంగా కూడా టిఆర్‌ఎస్ పార్టీ అనేక రికార్డులు సాధించిందన్నారు.

రాజకీయ పార్టీగా దేశంలో మరే పార్టీకి లేని సభ్యత్వం కోసం ప్రజలే బారులు తీరుతున్న గొప్పతనం టిఆర్‌ఎస్‌దని చెప్పారు. రాష్ట్ర సాధనే లక్ష్యంగా ఉద్యమ పార్టీగా మొదలై, ప్రజాభీష్టం మేరకు రాజకీయ పార్టీగా అవతరించిన టిఆర్‌ఎస్ పార్టీ అతి తక్కువ కాలంలో అనేక విజయాలు సొంతం చేసుకుందని గుర్తు చేశారు. ఎన్నో అణచివేతలను, కుట్రలను ఎదుర్కొని టిఆర్‌ఎస్ పార్టీ 19 ఏళ్లుగా వీరోచిత పోరాటం చేసిందని వివరించారు. తెలంగాణ రాష్ట్రానికి, ఏ విషయంలో ఏమి కావాలో అన్ని విషయాలు తెలిసిన వ్యక్తి సిఎం కెసిఆర్ అని కొనియాడారు. పార్టీని రాష్ట్ర స్థాయి నుండి గ్రామ స్థాయి వరకు క్రమ శిక్షణ గల పార్టీగా తీర్చిదిద్దామన్నారు. పార్టీ నిర్మాణం కోసం కార్యకర్తల సంక్షేమం కోసం కావాల్సిన ప్రణాళిక, సిఎం, వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్‌ల వద్ద ఉందన్నారు.

గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు అత్యంత క్రమ శిక్షణ గల పార్టీగా టీఆర్‌ఎస్ భవనాల నిర్మాణంతో మరో మైలురాయిని సాధించిందన్నారు. టిఆర్‌ఎస్ పార్టీ తెలంగాణ ప్రజలకు శ్రీరామ రక్షలాగా నిల్చిందన్నారు. తెలంగాణ ప్రజల జీవన ప్రమాణాలను మెరుగు పర్చి వారి ముఖాల్లో సంతోషం చూడడమే ద్యేయంగా పని చేస్తుందని తెలిపారు. వందేళ్లు గెలిచి నిల్చేలా, తిరుగులేని రాజకీయ శక్తిగా టీఆర్‌ఎస్ ఎదిగిందన్నారు. ఈ జిల్లా పార్టీ భవనాల నిర్మాణంతో మరింత సంస్థాగతంగా క్షేత్ర స్థాయిలో బలపడతామన్నారు.

పార్టీ కార్యాలయాల నిర్మాణాలను పూర్తి చేసుకొని వచ్చే విజయదశమి నాడు ప్రారంభోత్సవాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. పార్టీ కార్యాలయం శంకుస్థాపన కార్యక్రమానికి విచ్చేసి విజయవంతం చేసిన నేతలకు, కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపి బడుగుల లింగయ్యయాదవ్, ఎమ్మెల్యే గాదరి కిషోర్‌కుమార్, శాసనమండలి డిప్యూటి స్పీకర్ నేతి విద్యాసాగర్‌రావు, హుజూర్‌నగర్ టిఆర్‌ఎస్ ఇన్‌ఛార్జి శానంపైడి సైదిరెడ్డి, సూర్యాపేట జిల్లా పరిషత్తు ఛైర్మన్ గుజ్జ దీపికా యుగేందర్‌రావు, జిల్లా పరిషత్తు వైస్ ఛైర్మన్ గోపగాని వెంకటనారాయణగౌడ్, మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్‌రావు, సూర్యాపేట జిల్లా గ్రంధాలయ సంస్థ ఛైర్మన్ నిమ్మల శ్రీనివాస్‌గౌడ్, టిఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శి వై.వెంకటేశ్వర్లు, జిమున్సిపల్ చైర్‌పర్సన్ గండూరి ప్రవళిక ప్రకాష్, జెడ్పిటిసి, ఎంపిపిలు, ఎంపిటిసిలు, సర్పంచులు తదితురులు పాల్గొన్నారు.

 

TRS Bhavan Foundation in Suryapet by Jagadeesh Reddy