Home తాజా వార్తలు బ్యాంకుపై ఎగిరిన తెరాస జెండా…

బ్యాంకుపై ఎగిరిన తెరాస జెండా…

Cooperative Urban Bank

 

సిరిసిల్ల : రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని సహకార అర్భన్ బ్యాంకు పాలక వర్గ చైర్మన్‌గా గాజుల నారాయణ, వైస్ చైర్మన్‌గా గడ్డం విఠల్ శనివారం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. బ్యాంకు అధ్యక్ష,ఉపాధ్యక్ష స్థానాలను అధికార తెరాస పార్టీ సభ్యులే గెలుచుకోవడం విశేషం. బ్యాంకు పాలక వర్గంలో ప్రతిపక్ష పార్టీలకు తగిన ప్రాధాన్యత లభించక పోవడంతో తెరాస జెండా బ్యాంకుపై సునాయాసంగా ఎగుర వేసింది. అర్భన్ బ్యాంకు పాలక వర్గ సభ్యులకు శుక్రవారం ఎన్నికలు నిర్వహించారు. పాలక వర్గంలో 12 డివిజన్లకు డైరెక్టర్లను ఎన్నుకోగా 6, 8, 10 డివిజన్లకు రిజర్వేషన్లు ప్రకటించగా అవి ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 9 డివిజన్లకు శుక్రవారం ఎన్నికలు నిర్వహించి ఫలితాలు ప్రకటించారు.

1వ డివిజన్‌లో గడ్డం విఠల్, 2వ డివిజన్‌లో మందాడి శ్రీనివాసరెడ్డి, 3వ డివిజన్‌లో బొద్దుల భాస్కర్, 4వ డివిజన్‌లో కోడం సంజీవ్, 5వ డివిజన్‌లో స్వర్గం రాజు, 6వ డివిజన్‌లో ఆకునూరి అశోక్ ( ఏకగ్రీవం ) ఎన్నికయ్యారు. 7వ డివిజన్‌లో గాజుల నారాయణ,8వ డివిజన్‌లో అడ్డగట్ల శారద( ఏకగ్రీవం), 9వ డివిజన్‌లో అడిచెర్ల సాయికృష్ణ, 10వ డివిజన్‌లో ఆడెపు అనసూర్య ( ఏకగ్రీవం),11వ డివిజన్‌లో నేరెళ్ల శ్రీకాంత్,12వ డివిజన్‌లో వేముల రాములు ఎన్నికయ్యారు. కాగా శనివారం ఉదయం అధ్యక్ష, ఉపాధ్యక్షులను ఎన్నుకోవడానికి సమావేశం నిర్వహించగా అధ్యక్ష స్థానానికి గాజుల నారాయణ పేరును బొద్దుల భాస్కర్ ప్రతిపాదించగా, మందాడి శ్రీనివాసరెడ్డి బలపరిచారు.

అదే విధంగా ఉపాధ్యక్ష పదవికి గడ్డం విఠల్ పేరును ఆకునూరి అశోక్ ప్రతిపాదించగా, నేరెళ్ల శ్రీకాంత్ బలపరిచారు. ఎన్నికల నిబంధనల మేరకు అధ్యక్ష, ఉపాధ్యక్ష స్థానాలకు గాజుల నారాయణ, గడ్డం విఠల్‌ల నుండి ఒక్కో నామినేషన్ మాత్రమే దాఖలు కావడంతో వారు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి మనోజ్‌కుమార్ ప్రకటించారు. నూతన అధ్యక్ష, ఉపాధ్యక్షులను పలువురు తెరాస నాయకులు, అభిమానులు అభినందించారు. అనంతరం పట్టణంలో తెరాస శ్రేణులు విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు.

TRS Candidates Elected to Cooperative Urban Bank