Search
Friday 16 November 2018
  • :
  • :

అధ్యక్ష్యా ఇకా కొనసాగలేం

TRS Corporates ready to resign

రాజీనామాకు సిద్ధపడ్డ టిఆర్‌ఎస్ కార్పొరేటర్లు
మేయర్ వైఖరే ఎజెండా
మంత్రిని కలిసి వివరించాలని నిర్ణయం
జనన, మరణ ధృవీకరణ పత్రాల విషయంలో జాప్యం
చెత్త కుప్పలుకుప్పలుగా పేరుకుపోతుందని ఆరోపణ

కమిషనర్ తీరు సరిగ్గా లేదు. ప్రజల సమస్యల గురించి మేయర్ పట్టించుకోవడం లేదు. రూల్స్ అంటూ కమిషనర్ ఎటువంటి అనుమతులు ఇవ్వడం లేదని కార్యాలయం చుట్టూ ప్రజలు తిరిగినా ఫలితం ఉండడం లేదని అందుకు రాజీనామా చేసేందుకు సిద్ధపడ్డారు. కానీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు మరోసారి బుద్ధి చెప్పాలని నిర్ణయించుకున్నాం. ఆ తర్వాత నిర్ణయం తీసుకుంటాం. ఇది ఖమ్మం కార్పొరేషన్‌లో టిఆర్‌ఎస్ కార్పొరేటర్ల నిర్ణయం. చాలా కాలంగా కార్పొరేటర్లు, మేయర్, కమిషనర్ మధ్య ముక్కోణపు యుద్ధం నడుస్తుంది. అంతర్గతంగా కొంత కాలం సాగి ఆ తర్వాత రచ్చకెక్కి ఇప్పుడు ఏకంగా రాజీనామాలు చేస్తాం అనే వరకు వెళ్లింది. రెండు రోజులుగా వేర్వేరు చోట్ల సమావేశమైన కార్పొరేటర్లు, మేయర్, కమిషనర్‌కు వ్యతిరేకంగా పలు నిర్ణయాలు తీసుకున్నట్లు సమాచారం. 

మన తెలంగాణ/ఖమ్మం ప్రతినిధి : ఖమ్మం కార్పొరేషన్‌లో విచిత్ర పరిణామాలు చోటు చేసుకున్నాయి. అధికార పార్టీకి తిరుగులేని బలమున్న అభివృద్ది పనుల విషయంలో తర్జన భర్జన పడుతున్నారు. ఇటీవల సందీప్‌కుమార్ ఝూ కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత కార్పొరేషన్‌కు ఇవ్వాల్సిన అనుమతులు అభివృద్ది పనుల విషయంలో తీవ్ర జాప్యం జరుగుతుంది. జనన, మరణ ధృవీకరణ పత్రాల విషయంలో జాప్యం తప్పడం లేదని కార్పొరేటర్లు వాపోతున్నారు. పారిశుద్దం మెరుగపడడం లేదని చెత్త కుప్పలుకుప్పలుగా పేరుకుపోయినా పట్టించుకోవడం లేదని ఈ విషయమై ఫిర్యాదు చేస్తే స్పందించడం లేదని కార్పొరేటర్లు ఆరోపిస్తున్నారు. మేయర్ పాపాలాల్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని తనకు మామూళ్ల విషయం తప్ప మరోకటి పట్టడం లేదని టిఆర్‌ఎస్ కార్పొరేటర్లే ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో గురువారం సాయంత్రం టిఆర్‌ఎస్‌కు చెందిన 36 మంది కార్పొరేటర్లు సమావేశమై చర్చించారు. తిరిగి శుక్రవారం టిఆర్‌ఎస్ పక్ష నాయకులు కర్నాటి కృష్ణ ఇంట్లో సమావేశమైన కార్పొరేటర్లు పలు అంశాలపై చర్చించారు. కార్పొరేషన్‌లో టిఆర్‌ఎస్‌కు మేయర్ మినహా 42 మంది కార్పొరేటర్లు ఉన్నారు. వీరిలో వైకాపా నుంచి గెలిచి టిఆర్‌ఎస్‌లో చేరిన ఇద్దరు కార్పొరేటర్లు వీరితో కలిసి ప్రయాణించేందుకు సుముఖంగా లేరు. 5,13వ డివిజన్లకు చెందిన కార్పొరేటర్లు సైతం భిన్న వైఖరితో ఉండగా మరో ఇద్దరు కార్పొరేటర్లు అందుబాటులో లేకపోవడంతో 36 మంది సమావేశమయ్యారు. మేయర్, కమిషనర్ వైఖరికి నిరసనగా మూకుమ్మడిగా రాజీనామా చేయాలని తొలుత నిర్ణయించిన తర్వాత జిల్లాకు చెందిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు పై సమస్యల గురించి వివరించాలని ఆ తర్వాత మంత్రి కేటిఆర్‌కు అవసరమైతే ముఖ్యమంత్రికి విషయం వివరించి సరి కాని పక్షంలో రాజీనామాలు చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తుంది. మేయర్, కమిషనర్ వైఖరి కారణంగా డివిజన్లలో చిన్న అభివృద్ది పని కూడా చేపట్టలేకపోతున్నామని డివిజన్‌లో మేయర్ పర్యటించినప్పుడు కనీస సమాచారం కూడా ఇవ్వడం లేదని కార్పొరేటర్లు తెలిపారు. కార్పొరేటర్ల నిర్ణయం రాజకీయంగా చర్చనీయాంశమైంది. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కార్పొరేటర్ల నిర్ణయం రాజకీయ అంశంగా మారింది.

Comments

comments