Home తాజా వార్తలు వరంగల్ లో గులాబీ జోష్

వరంగల్ లో గులాబీ జోష్

TRSవరంగల్ రూరల్ : వరంగల్ లోక్‌సభ స్థానానికి ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో గులాబీ జోష్ కొనసాగుతుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికలో చివరి వరకూ గందరగోళ పరిస్థితులను ఎదుర్కొన్న కాంగ్రెస్ ప్రస్తుత లోక్‌సభ స్థానానికి అభ్యర్థిని ప్రకటించడంలో ముందుంది. కాంగ్రెస్ సీనియర్ నేత దొమ్మాటి సాంబయ్యను వరంగల్ పార్లమెంట్ ఎంపి అభ్యర్థిక ప్రకటించింది. అయితే వరంగల్ లోక్ సభ స్థానం పరిధిలో ఏడు నియోజకవర్గాలలోనూ కాంగ్రెస్ ప్రాభల్యం గులాబీ పార్టీతో పోల్చితే పోటీలో నెగ్గె పరిస్థితులు లేవనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వరంగల్ లోక్ సభ స్థానం పరిధిలోని ఏడు నియోజకవర్గాలైన స్టేషన్ ఘన్‌పూర్, పాలకుర్తి, పరకాల, వర్థన్నపేట, భూపాలపల్లి, వరంగల్ (తూర్పు), వరంగల్ ( పశ్చిమ)లో గత అసెంబ్లీ ఎన్నికలలో పోలైన ఓట్ల సరళిని పరిశీలిస్తే కాంగ్రెస్ ప్రభావం సగానికి సగంగా ఉండడం విశేషం. ఈ  ఏడు నియోజకవర్గాల్లో గులాబీ అభ్యర్థులందరికీ కలిపి పోలైన ఓట్లలో ఆరు లక్షలకు పైగా ఓట్లు గులాబీ అభ్యర్థులకు వచ్చాయి. కాంగ్రెస్ అభ్యర్థులకు మూడు లక్షల పైచిలుకు ఓట్లు వచ్చాయి. ఈ లెక్కన ప్రస్తుతం వరంగల్ పార్లమెంట్ స్థానానికి జరుగబోయే ఎన్నికలలో గులాబీ జోష్ కొనసాగుతుందనటంలో సందేహం లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. గత మధ్యంతర ఎన్నికల్లో వరంగల్ లోక్‌సభ స్థనం నుంచి పోటీ చేసిన గులాబీ అభ్యర్థి పసునూరి దయాకర్‌కు రికార్డు స్థాయి మెజార్టీని ప్రజలు అందించారు. ప్రస్తుతం వరంగల్ పార్లమెంట్ స్థానం పరిధిలోని ఈ ఏడు నియోజకవర్గాలలో కేవలం ఒక నియోజకవర్గం మినహా మిగిలిన ఆరు నియోజకవర్గాలు గులాబీ ఎమ్మెల్యేల స్థానాలుగా ఉన్నాయని, దీంతో గులాబీ జోష్ క్షేత్రస్థాయిలో బలపడటమే కాకుండా ప్రతిపక్షాలు ఢీలా పడ్డాయనేది ప్రస్తుత పరిస్థితులు తెలుపుతున్నాయి. అయితే ఈ సారి కాంగ్రెస్ తరుపున అభ్యర్థి దొమ్మాటి సాంబయ్యకు సైతం పరిస్థితులు అనుకూలించే పరిస్థితులు కనిపించటం లేదని, గులాబీ జోరులో హస్తం శ్రేణులు అయోమయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారని పలువురు అభిప్రాయపడుతున్నారు. మరో వైపు వరంగల్ పార్లమెంట్ స్థానం పరిధిలోని నియోజకవర్గాల్లో 16,53,474 మది ఓటర్లు ఉన్నారు. గత అసెంబ్లీ ఎన్నికలను చూసిన, అంతకు ముందు ఎంపి ఎన్నికలను పరిశీలించినా కాంగ్రెస్‌కు పోలైన ఓట్లకు, గులాబీ అభ్యర్థులకు పోలైన ఓట్లకు అందుకోనంత వ్యత్యాసం ఉంది.  ఈ లెక్కన ప్రస్తుతం  కాంగ్రెస్ అభ్యర్థికి గడ్డుపరిస్థితులే ఉంటాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే క్షేత్రస్థాయిలో గులాబీ హవా కొనసాగుతున్నప్పటికీ కాంగ్రెస్ గడ్డు పరిస్థితులను చూసి ఇక నిలదొక్కుకుకోవటం కష్టమేనని భావించిన కాంగ్రెస్ శ్రేణులు పక్క చూపులు చూస్తున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరో వైపు హస్తం గూటిలో సమన్వయం కుదరటం కష్టసాధ్యమని పలువురు భావిస్తున్నారు. ఏదిఏమైనప్పటికీ వరంగల్ పార్లమెంట్ స్థానంలో గులాబీ జోష్ కొనసాగటం ఖాయమనే అభిప్రాయాలను రాజకీయ విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు.

TRS Josh in Warangal