Search
Wednesday 19 September 2018
  • :
  • :
Latest News

ఇదో రకం దులుపుడు

Jupally-Krishna-Rao

భలారే గులాబీ కూలీ,  ప్రజల చెవిలో క్యాబేజీ

నాగర్‌కర్నూల్ ప్రతినిధి: రాజకీయ పార్టీల కార్యక్రమాలు అంటేనే వ్యయంతో కూడిన వ్యవహారం. సభలు సమావేశాలు నిర్వహించాలన్నా, నేతలు వస్తే స్వాగతం పలకాలన్నా, హర్షం, ర్యాలీలయినా, దిష్టిబొమ్మల దహనాలయినా జనం రావల్సిందే. దానికి రాజకీయ పార్టీనేతల చేతి చమురు వదలాల్సిందే. ఇదేమీ కొత్తకాదు. ఏపార్టీ దీనికి అతీతం కాదు. పార్టీల కార్యక్రమాలకయ్యే ఖర్చుల కోసం నేతలు కొంత చెందాలు మరికొంత స్వతం జతకలపడం కూడా సర్వసాధారణం. చందాల దందాలలో అభిమానం, భయం రెండూ మిళితమై ఉండటం షరామామూలే. ఈనెల 27న వరంగల్‌లో నిర్వహిస్తున్న టిఆర్‌ఎస్ బహిరంగసభకు వెళ్లే వారిఖర్చుల కోసం ఆపార్టీ రాష్ట్ర వ్యాప్తంగా కలెక్షన్ ప్రారంభించింది.

మంత్రి కెటిఆర్ ఐస్‌క్రీంలు, జ్యూస్‌లు అమ్మినట్టు నటించి లక్షలు సంపాదిస్తే జిల్లాలోని గులాబీ ప్రముఖులు లక్షల్లో వసూలు చేస్తున్నారు. ఇచ్చేవారు ఇస్తే తీసుకునే వారు తీసుకుంటే ఎవ్వరికీ అభ్యంతరం ఉండదు. కానీ కూలీ పని నటిస్తూ దారిఖర్చులు పోగు చేస్తామంటూ గులాబీ దండు చేస్తున్న హడావిడి పలువుర్ని ముక్కున వేలువేసుకునేలా చేస్తున్నది. నాగర్‌కర్నూల్ జిల్లా మంత్రి జూపల్లి ఒక సంచి వేరు సెనగ బస్తాబుజంపై వేసుకుంటే బారీ మొత్తం పళ్లెంలో పెట్టి మరీ కూలీగా సమర్పించుకున్నారు. పెట్రోలు పోసి, రైసుమిల్లులో కూలీ ఇతర పనులు చేసి బారీగానే సంపాదించారు. నాగర్‌కర్నూల్‌లోని రెండు జిల్లాల వైద్యాదికారులకు చెందిన నర్సింగ్‌హోంలలో ఎమ్మెల్యే మర్రిజనార్ధన్ రెడ్డి, గులాబీ దండూ చీపురు పడితే సదరు అధికారులు భారీ మొత్తం చెక్కులు ముట్టచెప్పారు.

ఇక అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాల్‌రాజు కత్తిపట్టి చికన్ కొట్టి, టీపోసి, మార్కెట్‌యార్డ్‌లో శ్రమదానం చేస్తే గిట్టుబాటు బాగానే అయింది. ఎమ్మెల్సీ కసిరెడ్డి గులాబీ తట్టపట్టినందుకు , ఇతర పనులు చేసి పెద్దమొత్తంలోనే కూలీ గిట్టు బాటుచేసుకున్నారు. వారిచ్చిన కూలీ ఫోజులకు లక్షలు దులిపిన నేతలు తమ శ్రమకే ఇంత ఫలితం అంటూ చెప్పుకోవడం హాస్యాస్పదంగా మారింది. మరికొందరు నేతలు గతంలో రాజకీయ పార్టీల నేతలు మరో రకంగా వసూలు చేసేవారంటూ తామేదో చేసిన పనికి నిజాయితీగా కూలీ పొందినట్లు శ్రమకోర్చి సంపాదించినట్లు వెటకారంగా మాట్లాడుతుండటం కూడా జనాల చెవిలో గులాబీ పూలు పెట్టడం కాక మరేంటి అని పలువురు అంటున్నారు.

Comments

comments