Home తాజా వార్తలు పథకాలే ప్రాణంగా..

పథకాలే ప్రాణంగా..

TRS welfare schemes

 

టిఆర్‌ఎస్ శ్రేణుల్లో విశ్వాసం

మన తెలంగాణ/హైదరాబాద్: సంక్షేమ పథకాలే అండగా, లబ్ధిదారుల ఓట్లు దండిగా వస్తాయన్న ధీమాతో అధికార టిఆర్‌ఎస్ పార్టీ విశ్వాసంతో ఉంది. శుక్రవారం రాష్ట్రంలో పోలింగ్ జరుగుతుండడంతో అన్ని పార్టీలూ ఎవరి లెక్కల్లో వారు మునిగిపోయాయి. కులాలు, వర్గాలు, ప్రాం తాల వారీ సమీకరణాల లెక్కల్లో ప్రతిపక్ష పార్టీలు ఉండగా, మోడీ హవా, కేంద్ర ప్రభు త్వ పనితీరే తమను గెలిపిస్తుందని భారతీయ జనతాపార్టీ భావిస్తోంది. చాలా కా లం తర్వాత రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో బిజెపి పోటీచేస్తోంది. ఎక్కువ నియోజకవర్గాల్లో రెండు పక్షాల మధ్యనే ప్రధాన పోటీ ఉంటుండగా, కొన్ని చోట్ల ముక్కోణపు పోటీ ఉంది. చాలా కొన్నిచోట్ల నాలుగు పక్షా ల మధ్య పోటీ ఉంది. నగరంలోని కొన్ని స్థా నాల్లో సంప్రదాయ ఓటు బ్యాంకుతో బిజెపి గట్టెక్కుతుందని ఆ పార్టీ నేతలు ధీమాగా ఉన్నారు. అన్ని పార్టీలూ విజయం తమదేననే ధీమాతో ఉన్నాయి. పైకి చెప్పుకోవడం మాత్రమే కాకుండా వస్తాయని బలంగా న మ్ముతున్నారు.

అన్ని పార్టీలూ సర్వేలపై ఆధారపడ్డాయి. గత ప్రభుత్వాల్లో చేకూరిన అభివృద్ధి, సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ నాలుగేళ్లలో జరిగినదాన్ని పోల్చి చూసుకోవాలని టిఆర్‌ఎస్ పిలుపు ఇవ్వగా, రానున్న ప్రభుత్వంలో సుపరిపాలనను అందిస్తామని కొన్ని పార్టీలు మేనిఫెస్టోల ద్వారా హామీ ఇస్తున్నాయి. ఇప్పుడు వస్తున్న లబ్ధికంటే రెట్టింపు ఇస్తామని మరికొన్ని పార్టీలు హామీ ఇస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరుగుతున్న తొలి ఎన్నికల్లోనూ ‘తెలంగాణ’ సెంటిమెంట్ గత ఎన్నికలతో పోలిస్తే మరో రూపంలో బలంగానే ఉంది. తెలంగాణ రాష్ట్ర సాధనే ఏకైక లక్షంగా ఉనికిలోకి వచ్చిన టిఆర్‌ఎస్ తొలిసారిగా అధికారంలోకి వచ్చి మరోమారు ప్రయత్నిస్తోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి రాకుండా చేసేందుకు రెండు జాతీయ పార్టీలు, పొరుగు రాష్ట్రంలోని ప్రాంతీయ పార్టీ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి. అయితే అభివృద్ధి, సంక్షేమం, విశ్వసనీయత తదితర అంశాలు ఈ ఎన్నికల్లో బలమైన పాత్రను పోషించబోతున్నాయి.

లబ్ధిదారులపైనే టిఆర్‌ఎస్ అశలన్నీ :
ప్రతిపక్ష పార్టీల లెక్కలన్నింటికీ గండి కొడుతూ లబ్ధిదారులు ఏకపక్షంగా తమకే మద్దతు ఇస్తారని, వీటి అండతో విజయం సులువేనని టిఆర్‌ఎస్ నేతలు ధీమాతో ఉన్నారు. గడచిన నాలుగున్నరేళ్ల పాలనలో అమలైన సంక్షేమ పథకాలు, మెజారిటీ వర్గాలను చేరి, లబ్ధి కలిగించాయి. కుల, మత, ప్రాంత తేడాలు లేకుండా అర్హులైనవారికి తెలంగాణ పథకాలు అందాయి. దేశంలోనే వినూత్నమైన ‘రైతుబంధు’, భూరికార్డుల ప్రక్షాళన, హరితహారం, రైతుబీమా, మిషన్ కాకతీయ తదితర పథకాలు విస్తృత ప్రజానీకానికి లబ్ధి చేకూరుస్తున్నాయి. వృద్ధాప్య, వితంతు పెన్షన్ల లబ్ధిదారులు కెసిఆర్‌ను తమ కుటుంబసభ్యునిగా భావిస్తున్నారని ఆ పార్టీ భావిస్తోంది.

టిఆర్‌ఎస్ హయాంలో అభివృద్ధి, సంక్షేమం బొమ్మాబొరుసుల్లా మారాయని, కొత్త రాష్ట్రంలో వీటిని పేదలకు అందించాలని లక్షంగా పెట్టుకున్న కెసిఆర్ సవాలుగా తీసుకొని అమలు చేశారని, ఈ ఎన్నికల్లో ఆ పథకాలే తమకు శ్రీరామరక్షగా మారనున్నాయని టిఆర్‌ఎస్ అభ్యర్ధులు కొండంత నమ్మకంతో ఉన్నారు. నియోజకవర్గ కేంద్రాలకు వెళ్లే రోడ్లను డబుల్ రోడ్లుగా మార్చేలా విధానపరమైన నిర్ణయం తీసుకోవడం గ్రామీణ ప్రాంతాల్లో పాలనలో మార్పును గమనిస్తున్నారు. సాగునీటి ప్రాజెక్టులు పూర్తిచేయడం, చెరువులు పూడికతీసి, వాటిని నింపడం, కొన్ని లక్షల ఎకరాలకు నీళ్లు పారడం, వంటివి సానుకూల అంశాలని పేర్కొన్నారు.

సాగువిస్తీర్ణం పెరగడం, దిగుబడులు పెరగడం, సేద్యం పండుగలా మారడం, రైతులకు 24 గంటల ఉచిత కరెంటు, రైతు బంధు, రైతు భీమా వంటి పథకాలతో రైతు పక్షపాతిగా సిఎం కెసిఆర్ మారాయి. పెన్షన్లు, కెసిఆర్ కిట్, గొర్రెల పంపిణీ, చేపపిల్లల ఉచిత పంపిణీ, వంటి అంశాలు గ్రామీణ ప్రాంతాల్లో సామాజిక, ఆర్ధిక స్వరూపాన్నే మార్చేశాయి. కళ్యాణలక్ష్మి, షాదీముబాకర్, రేషన్ బియ్యం, కంటి వెలుగు, విదేశీ విద్య పథకం, డబుల్ బెడ్‌రూం ఇళ్లు, జర్నలిస్టులు, ఆటోడ్రైవర్లు, హోంగార్డులకు ప్రమాద భీమా.. ఇలా చెబుతూ పోతే పెద్ద జాబితా అవుతుంది. పేదలకు భరోసా నింపే ఈ పథకాలే టిఆర్‌ఎస్‌కు శ్రీరామరక్షగా మారతాయన్న విశ్వాసం ఆ పార్టీ శ్రేణుల్లో కనిపిస్తుంది.

మేనిఫెస్టోలోనూ సంక్షేమం…
టిఆర్‌ఎస్ మేనిఫెస్టో పేదల సంక్షేమాన్ని ప్రతిబింబించింది. ఆసరా పింఛన్ వయస్సును 57 ఏళ్లకు కుదించడం, పెన్షన్‌ను రూ.2016కు పెంచడం, వికలాంగుల పెన్షన్‌ను రూ.3016కు పెంచడం, రైతు బంధు పథకం సాయం రూ.10 వేలకు పెంచడం టిఆర్‌ఎస్ పార్టీపై నమ్మకాన్ని పెంచింది. దీంతో పాటు ముఖ్యమంత్రి కెసిఆర్ విరామమెరుగని ప్రచారంతో గత వారం రోజులుగా టిఆర్‌ఎస్‌కు మొగ్గు పెరిగింది. అభ్యర్ధుల ప్రకటనలో జాప్యంతో మహాకూటమి అభ్యర్ధులు ప్రచారంలో వెనుకబడ్డారు. సోనియా, రాహుల్, చంద్రబాబుల బహిరంగ సభలతో ప్రచార వేగాన్ని పెంచినా, అవి జనాన్ని చేరడంలో విఫలమైనట్లు తెలిసింది. కూటమి అభ్యర్ధులు ఒకమారు కూడా నియోజకవర్గాన్ని చుట్టని సందర్భంలో టిఆర్‌ఎస్ అభ్యర్ధులు నాలుగు రౌండ్లు పూర్తిచేయడం గమనార్హం. ఇటీవలి ఇండియా టుడే సర్వే కూడా టిఆర్‌ఎస్ వైపే ఉండడం దీనికి బలం చేకూరుస్తుంది.

TRS Manifesto reflects the welfare of the poor

Telangana Latest News