Home సూర్యాపేట పార్టీ హుషార్… నాయకుల బేజార్… !!

పార్టీ హుషార్… నాయకుల బేజార్… !!

TRS MLAs dont want local poll win rider for 2019 tickets

మన తెలంగాణ/ సూర్యాపేట : సూర్యాపేట జిల్లా టిఆర్ఎస్ పార్టీ అంతర్గత కుమ్ములాటలతో సతమతమవుతున్నది. జిల్లాలో ముఖ్యంగా హుజుర్‌నగర్, కోదాడ, తుంగతుర్తిలతో పార్టీ గ్రూపులు, ఉపగ్రూపులుగా చీలిపోయినవి. బలమైన క్యాడర్‌తో పటిష్టంగా ఉన్న హుజుర్‌నగర్‌లో మూడు వర్గాలు, ఆరు గ్రూపులుగా వర్దిల్లుతున్నది. పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ శంకరమ్మ పార్టీ పటిష్టతకు కృషి చేస్తున్నప్పటికీ అసమ్మతి తీవ్రంగా కనిపిస్తుంది. నియోజకవర్గంలో అన్ని మండలాల్లో కాంగ్రెస్, తెలుగుదేశంకు చెందిన సీనియర్ నాయకులు, కార్యకర్తకలు టిఆర్ఎస్‌లో చేరారు. వారంతా కూడా అసంతృప్తితో ఉన్నారు. అల్లం ప్రభాకర్‌ రెడ్డి మరో వర్గంగా నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తూ పార్టీ పటిష్టతకు కృషి సల్పుతున్నారు. సీనియర్ నాయకులు సాములు శివారెడ్డి వివాదాలకు దూరంగా ఉంటూ పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొన లేకపోతున్నారు. ఎన్ఆర్ఐ గా ఉండి ఇటీవలనే ఇండియాకు తిరిగివచ్చి సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్నారు. ఈ నేపద్యంలో శంకరమ్మ , సైదిరెడ్డి వర్గీయులకు ఘర్షణ జరిగింది. నియోజకవర్గ టిఆర్‌ఎస్ టికెట్ సైదిరెడ్డికి వస్తుందనే ఆందోళన శంకరమ్మ వర్గీయుల్లో కనపడుతుంది. ఏది ఏమైనా నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో నాయకులు, గ్రూపులు, సబ్ గ్రూపులుగా విడిపోయి ఎవరి ఇష్ట ప్రకారం వారు కార్యక్రమాలు నిర్వహిస్తుండడంతో కార్యకర్తలు సానుభూతిపరులు బెంబేలెత్తిపోతున్నారు.
కోదాడ నియోజకవర్గంలో పార్టీలో కూడా మూడు వర్గాలుగా చీలిపోయింది. పార్టీ కేడర్‌తో పటిష్టంగా కనపడుతున్నప్పటికీ గ్రూపులు, ఉప గ్రూపులుగా నాయకులు వ్యవహరిస్తున్న తీరుతో కార్యకర్తలు అయోమయానికి గురవుతున్నారు. మాజీ శాసనసభ్యుడు వేనేపల్లి చందర్‌రావు, డిసిసిబి చైర్మన్ ముత్తవరపు పాండురంగారావు ఒక వర్గంగానూ, రాష్ట్రపార్టీ కార్యదర్శి ఎర్నేని బాబు,మార్కెట్ చైర్మన్ శశిధర్‌రెడ్డి మరోవర్గంగానూ, మున్సిపల్ చైర్‌పర్సన్ ఒంటిపులి అనితనాగరాజులు మరొక గ్రూపుగా వ్యవహరిస్తున్నారు. పైకి ఒకేలాగా కనిపిస్తున్నప్పటికీ అంతర్గతంగా మాత్రం విబేదాలు ప్రస్పుటంగా కనిపిస్తున్నాయన్న వాదనలూ లేకపోలేదు. మండలాల్లో, కోదాడ పట్టణంలో పార్టీ పటిష్టంగా ఉన్నప్పటికీ నాయకుల విబేదాలతో కార్యకర్తలు అయోమయంలో కొట్టుమిట్టాడుతున్నారు.
తుంగతుర్తి నియోజకవర్గంలో శాసనసభ్యుడు గాదరి కిషోర్ నియోజకవర్గ అబివృద్దికి, పార్టీ పటిష్టతకు తీవ్రంగా కృషి చేస్తున్నారు. మండలాల్లో విస్తృతంగా పర్యటిస్తూ పార్టీవైపు ప్రజలను ఆకర్షితులను చేస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నారు. ఇటీవల మంత్రులు కెటిఆర్ హరీశ్‌రావులతో మంత్రి సభలు జరిపి తన సత్తా చాటుకున్నారు. అయినప్పటికీ అక్కడక్కడ నిరసన దోరణలు వినిపిస్తూనే ఉన్నాయి. రాష్ట్ర గిడ్డంగుల సంస్థ ఛైర్మన్ మందుల సామేలు నియోజకవర్గంలో విస్తృతంగా తిరుగుతూ తన వర్గాన్ని బలోపేతం చేసుకుంటూ పోతున్నారు. అవకాశం వస్తే తాను కూడా పోటీ చేస్తాననని ప్రకటనలు వెలువరిస్తున్నారు. తెలంగాణ జాగృతి రాష్ట్ర ఉపాధ్యక్షులు మేడే రాజీవ్‌సాగర్ కూడా నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తూ కార్యకర్తలతో మమేకమవుతున్నారు. ఎంపీ కల్వకుంట్ల కవిత అండదండలతో నియోజకవర్గంలో పర్యటిస్తూ పార్టీ అభివృద్ధికి కృషి చేస్తున్నారు. నియోజకవర్గంలో పార్టీ మూడు గ్రూపులుగా ఉన్న పరిస్థితి కనపడుతున్నప్పటికీ ‘కిషోర్’ అన్నింటా తానై వ్యవహారాలు నడిపిస్తూ పార్టీని ముందుకు తీసుకెళ్తున్నారు.
సూర్యాపేట నియోజకవర్గంలో మంత్రి జగదీశ్‌రెడ్డి అందరినీ కలుపుకొని పోతూ పార్టీ అభివృద్ధికి నిరంతరం కృషి సల్పుతున్నారు. అభివృద్ధి కార్యక్రమాలతో మంచి ఊపులో కన్పిస్తున్నారు. టిడిపి, కాంగ్రెస్, ఇంకా ఇతర పార్టీల నుండి వచ్చిన నాయకులు, కార్యకర్తలకు మంత్రి మంచి ప్రోత్సాహం ఇస్తున్నా అక్కడక్కడ నిరసన దోరణులు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా పట్టణంలో పార్టీ కౌన్సిలర్లు, కొందరు నాయకులు రెండు వర్గాలుగా విడిపోయిన సంగతి తెలిసిందే. మంత్రి హెచ్చరికలతో కలిసినట్లు కన్పించినా మార్పు వచ్చినట్లు కనబడటం లేదు. స్థానిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో పార్టీలో విభేదాలు ఉండడంతో హుజూర్‌నగర్, కోదాడలలో పార్టీకి తీవ్ర నష్టం కల్గించే విధంగా పార్టీల ఫలితాలు ఉంటాయోమనని కార్యకర్తలు ఆందోళనలు చెందుతున్నారు.
మిర్యాలగూడెం నియోజకవర్గంలో ఎమ్మెల్యే భాస్కర్‌రావు, అమరేందర్‌రెడ్డిల మధ్య పొసగడం లేదు. ఇరువురు కూడా గ్రూపులుగా ఏర్పడడంతో కార్యకర్తలు అయోమయానికి గురవుతున్నారు. అదే విధంగా నాగార్జున సాగర్ నియోజకవర్గంలో నోముల నర్సింహయ్య, యెడవెళ్లి విజయేందర్‌రెడ్డిల మధ్య కూడా సఖ్యత కన్పించడం లేదు. పార్టీ అభివృద్ధి, పటిష్టతతకు కృషి చేయాల్సిన నాయకులు, పట్టుదల పట్టింపులకు పోవడం ఎవరివైపు ఉంటే ఏమి అనార్ధాలు జరగనున్నాయోనన్న సందిగ్ధంలో కార్యకర్తలు కొట్టుమిట్టాడుతున్నారు. నల్లగొండ నియోజకవర్గంలో కంచర్ల భూపాల్‌రెడ్డి, దుబ్బాక నర్సింహారెడ్డిల మధ్య కోల్డ్‌వారు నడుస్తుంది. ఇరువర్గాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు ఉన్నాయి. అదే విధంగా దేవరకొండ నియోజకవర్గంలో ఎమ్మెల్యే రవీంద్రకుమార్, జెడ్పి ఛైర్మన్ బాలు నాయక్‌ల మధ్య అంతర్గత విభేదాలు తీవ్రమవుతున్నట్లు తెలుస్తుంది. నేనంటే నేనంటూ పోటాపోటీగా వర్గపోరుతో కత్తులు దూస్తున్నారు. మునుగోడు నియోజకవర్గం ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్‌ల మధ్య విభేదాలు ఉన్నాయి. నకిరేకల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే వేముల వీరేశం, శాసనమండలి డిప్యూటి ఛైర్మన్ నేతి విద్యాసాగర్‌రావుల మధ్య కూడా విభేదాలు భగ్గుమంటున్నాయి. ఎవరికీ వారు యమునా తీరే అన్నట్లు ఎడముఖం, పెడముఖంగా ఉంటున్నారు. వర్గ పోరు పరిస్థితిలో, ఆలేరు, భువనగిరి నియోజకవర్గాలకు కూడా పాకింది. చాపకిందు నీరులా ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకుల మధ్య వర్గ విభేదాలు తారాస్థాయికి చేరడంతో కార్యకర్తలకు ఎటూ పాలుపోని పరిస్థితులు నెలకొన్నాయి.
టీఆర్‌ఎస్ పార్టీ ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా అభివృద్ధితో పటిష్టంగా ఉన్నప్పటికీ నాయకుల మధ్యన ఉన్న వర్గ విభేదాలు పార్టీ బలోపేతానికి తూట్లు పొడిచేలా కన్పిస్తున్నాయి. నాయకుల మధ్య విభేదాలు, ముఖ్య నాయకులు, కార్యకర్తలకు భేదాలు, అంతర్గత తగాదాలు, పంతాలు, పట్టింపులతో జిల్లా టిఆర్‌ఎస్ పార్టీ సతమతమవుతుంది. ప్రజల అండదండలు, మద్ధతు పార్టీకి పుష్కలంగా ఉన్నప్పటికీ అందరినీ కలుపుకుపోయి ఎలాంటి విభేదాలు లేకుండా చూడాల్సిన శాసనసభ్యులు, సెకండ్ క్యాడర్ గొడవలు, ఈగో పట్టింపులతో ఉండడంతో కార్యకర్తలు, ప్రజలు అయోమయానికి గురవుతున్నారు. జిల్లాలోని ఇలాంటి పరిస్థితులపై మంత్రి జగదీశ్‌రెడ్డి, ముఖ్యమంత్రి కెసిఆర్‌లు దృష్టి సారించి అందరి మధ్య సమన్వయం చేయాల్సిన అవసరముంది.