Home తాజా వార్తలు 100 అసెంబ్లీ 16 లోక్ సభ మావే

100 అసెంబ్లీ 16 లోక్ సభ మావే

TRS Party Always Ready for Elections is KTR

ముందస్తు సంగతి అధినేతే చెబుతారు : కెటిఆర్ 

మళ్లీ వచ్చి ఏం చేస్తామో ప్రగతి నివేదనలో చెబుతాం 

మన తెలంగాణ / హైదరాబాద్ : ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఎదుర్కొనడానికి టిఆర్‌ఎస్ పార్టీ సిద్ధంగా ఉందని ఐటి, పరిశ్రమల శాఖమంత్రి కెటి రామారావు స్పష్టం చేశారు. వంద శాసనసభ స్థానాల్లు, 16 పార్లమెంట్ స్థానాలను టిఆర్‌ఎస్ పార్టీ కైవసం చేసుకోవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. రంగారెడ్డి జిల్లా కొంగరకలాన్‌లో నిర్వహించనున్న టిఆర్‌ఎస్ ప్రగ తి నివేదన సభా ప్రాంగణం వద్ద ఏర్పాట్లను హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, ప్రభుత్వ విప్ డాక్టర్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎంపి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, టిఆర్‌ఎస్ యువజన విభాగం అధ్యక్షులు, ఎంఎల్‌సి శంభీపూర్ రాజులతో కలిసి మంగళవారం ఆయన పరిశీలించారు. అనంతరం మంత్రి కెటిఆర్ జర్నలిస్టులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. షెడ్యూలు కంటే ముందుగా శాసనసభకు ఎన్నికలు ఉంటాయా? ఉండవా? ఉంటే ఎప్పుడు ఉండవచ్చు? అనే ప్రశ్నలకు ఆయన తనదైన శైలిలో సమాధానం చెప్పారు. ‘పత్రికలు రాస్తూ వస్తున్నాయి.. మేమూ చదువుతూ ఉన్నాం.. మీకు ఎక్కడి నుండి సమాచారం అందిందో మాకెలా తెలుస్తుంది. ఈ విషయంపై సిఎం కెసిఆర్ కూడా ఎక్కడా మాట్లాడిన దాఖలాలు లేవు… ఎన్నికలు పెట్టించేందుకు మీరే మాకంటే ఉత్సాహంగా ఉన్నట్లున్నారు’అని ఆయన చమత్కరించారు. ఒకటి మాత్రం చెప్పగలనని, ఎన్నికలు ఎప్పుడు వచ్చినా టిఆర్‌ఎస్ పార్టీ మాత్రం సర్వసన్నద్ధంగా ఉన్నదని స్పష్టం చేశారు. శాసనసభ ఎన్నికలకు సంబంధించి మంత్రుల సమావేశంలో చర్చ జరగలేదని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. టిఆర్‌ఎస్ పార్టీ ఆవిర్భావం నుండి కూడా తమ అధినేత కెసిఆర్‌కు బహిరంగ సభలు పెట్టడం కొత్తేమీ కాదన్నారు.

సెప్టెంబర్ 2 కోసం జనం ఎదురు చూస్తున్నరు
తమ పార్టీ నేతలే కాదు, ప్రజలు, ప్రతిపక్షాలు ఇలా అందరి దృష్టీ వచ్చే నెల 2న జరుగనున్న ప్రగతి నివేదన సభపైనే ఉందని మంత్రి కెటిఆర్ అన్నారు. సభా ప్రాంగణం 450 ఎకరాల పైచీలుకు ఉందని, 25 లక్షల మంది వస్తారని అంచనా వేస్తున్నామన్నారు. దూర ప్రాంతాల నుండి వచ్చే వారి వాహనాలు రహదారి మధ్యలోనే చిక్కుకోకుండా ఉండేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశాలు జారీ చేశారన్నారు. ఈ నేపథ్యంలో సభా ప్రాంగణం వద్దకు వివిధ జిల్లాల నుండి తరలి వచ్చేందుకు నలు వైపుల నుండీ రోడ్లు వేస్తున్నామన్నారు. రావిర్యాల నుండి కొంగరకలాన్ వరకు, కొంగర కలాన్ నుండి ఇబ్రహీంపట్నం -బొంగ్లూరు గేట్ రహదారి ఇలా మొత్తం కొత్తగా 15 రోడ్లు వేస్తున్నామన్నారు. సభా ప్రాంగణ ఏర్పాట్ల ను రోడ్లు, భవనాలశాఖతో పాటు ఇతర ప్రభుత్వ శాఖలు చూస్తున్నాయన్నారు. సభా ప్రాంగణం వద్ద నాలుగు చోట్ల పార్కింగ్ స్థ లాలను పెట్టామన్నారు. ఒక్క కరీంనగర్ జిల్లా నుండే రెండున్నర లక్షల మంది తరలి వస్తారని ఆర్థిక శాఖమంత్రి ఈటల రాజేందర్ తమ దృష్టికి తీసుకువచ్చారన్నారు. ఖమ్మం నుండి 150 ట్రాక్టర్లలో ప్రజలు కొంగరకలాన్‌కు తరలి వచ్చేందుకు సిద్ధమవుతున్నారని ఖమ్మం ఎంపి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా తమకు తెలిపారన్నారు.

కొత్తగూడెం నుండి కూడా 50 ట్రాక్టర్లు సిద్ధంగా ఉన్నాయన్నారు. సిరిసిల్ల, నిజామాబాద్, గజ్వేల్ నుండి కూడా ప్రజానీకం పెద్ద సంఖ్యలో తరలి వచ్చేందుకు సెప్టెంబర్ 2 కోసం నిరీక్షిస్తున్నారన్నారు. చ్రేసినవి, చేయబోయేవి చెబుతాం, 51 నెలల్లో టిఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన వాగ్ధానం, సంక్షేమ అభివృద్ధి మేళవించిన కార్యక్రమాలను , సిఎం కెసిఆర్ పరిపాలన హామీలు అమలు వంటి అంశాలను సభలో చెప్పుకుంటామని మంత్రి కెటిఆర్ అన్నారు. అంతే కాదు మరోసారి అధికారం ఇస్తే వచ్చే ఐదేళ్లలో కూడా ఇంకా ఏమేం చెస్తామో కూడా చెబుతామన్నారు. 25 లక్షల మంది ఈ సభకు వస్తారని అంచనా వేస్తున్నామని, ఆ మేరకు సభా ప్రాంగణం వద్ద ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. పజల నుండి స్పందన అపూర్వంగా ఉండనుందని అంచనా వేస్తున్నామన్నారు. క్రితం సారి వరంగల్ లో నిర్వహించిన బహిరంగ సభ కంటే కూడా ఈ సారి ఇంకా బ్రహ్మాండంగా సక్సెస్ అవుతుందన్నారు. అప్పట్లో తాను ఆ సభకు వెళ్తూ మార్గమధ్యలో ట్రాఫిక్ జామ్‌లో చిక్కుకు పోయానని, రహదారి క్లియర్ చేసేందుకు పోలీసులు ఎంతగా శ్రమించినా రద్దీ కారణంగా వెళ్లలేక పోయిన విషయం గుర్తుకు వస్తోందన్నారు. సెప్టెంబర్ 2 సభకు కూడా జిల్లాల నుండి వచ్చే ప్రజానీకంతో ఆ స్థాయి రద్దీ, ట్రాఫిక్ జాంలు ఉండే అవకాశాలను తోసిపుచ్చలేమన్నారు.

కాంగ్రెస్ తీరు ఆడలేక.. అన్నట్లుంది
ముందస్తు ఎన్నికలకు సిద్ధం అవుతున్నందుకే టిఆర్‌ఎస్ ఈ బహిరంగ సభను ఏర్పాటు చేసిందని ప్రతిపక్ష పార్టీలు అంటున్నాయని వేసిన ప్రశ్నకు కెటిఆర్ సమాధానం చెబుతూ కాంగ్రెస్ నేతల తీరు ఆడలేక మద్దెలోడు అన్న చందంగా ఉందని ఎద్దేవా చేశారు. ఉప ఎన్నికలను కూడా గెలువలేని దైన్యం ప్రతిపార్టీదన్నారు. కాంగ్రెస్ పార్టీ సీట్లుగా ఉన్న పాలేరు, నారాయణఖేడ్‌కు ఉప ఎన్నికలు వస్తే ఆ సీట్లు మా ఖాతాలోనే చేరి పోయాయన్నారు. నారాయణ్‌ఖేడ్‌లో 53 వేల ఓట్ల మెజార్టీ, పాలేరులో 23 వేల ఓట్ల మెజార్టీని టిఆర్‌ఎస్ సాధించిందన్నారు. ‘మా బాస్‌లు తెలంగాణ గల్లీల్లో ఉన్నారు. వాళ్ల లా ఢిల్లీలో లేరు. మా పని తీరుపై బేరీజు వేసుకుని ఓట్లేయమని అడుగుతాం. అలా అడగడం తప్పు కాదే. వారికెందుకంట అంత దుగ్థ అన్నారు. అపురూపమైన సభను జరుపుకుంటాం. రోడ్లన్నీ కూడా కిక్కిరిసి పోతాయి. బస్సులన్నీ కూడా పార్టీ డబ్బులతోనే బుక్ చేసుకున్నాం. ఆదివారం కావడంతో ఆఫీసులు ఉండవు, స్కూళ్లూ ఉండవు, సభ కచ్చితంగా సక్సెస్ అవుతుంది’ అని కెటిఆర్ అన్నారు.

ఎపిలో అనైతిక పొత్తులు
ముందస్తు ఎన్నికలు వస్తే ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ తో కలిసి టిడిపి పోటీ చేసే వాతావరణం ఉందని కొందరు చెబుతున్నారని, ఇలా చేస్తే నైతిక విలువలకు విలువ ఎక్కడుంటుందని మంత్రి కెటిఆర్ అన్నారు. తెలుగుదేశం పార్టీ పుట్టిందే కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా అని టిడిపి మంత్రి కెఈ కృష్ణమూర్తి చెబుతున్న విషయాన్నైనా చంద్రబాబు గమనంలోకి తీసుకుంటే మంచిదన్నారు. తెలంగాణలో ఇప్పటికే ఆ పార్టీ ఉనికి కోల్పోయిందన్నారు. అమరావతికి చంద్రబాబు, లోకేశ్ బాబు మకాం మార్చాక, ఉన్న ఒకరిద్దరు సండ్ర వెంకట వీరయ్య, ఆర్ .కృష్ణయ్య లాంటి ఎంఎల్‌ఏలు కూడా ఉనికి కోసం పాకులాడే పరిస్థితి ఏర్పడిందన్నారు. బీహార్‌లో ఆర్‌జెడి కూడా అంతర్థానం అయ్యిందన్నారు.

ఐదు గురు ఎంఎల్‌ఏలు ఉన్న బిజెపి కూడా అదే పరిస్థితిని ఎదుర్కొంటోందన్నారు. జిహెచ్‌ఎంసి ఎన్నికల్లో ఒక్క కార్పోరేటర్‌ను కూడా వారి స్థానాల్లో గెలిపించుకోని దైన్యం ఆ నాయకులదని ఎద్దేవ చేశారు. టిఆర్‌ఎస్ నుండి 99 మంది కార్పోరేటర్లు ఎన్నిక కాగా, మజ్లీస్ పార్టీ 45 సభ్యులను గెలిపించుకుందని, ఇతరులు ఆరు స్థానాలకే పరిమితమయ్యారన్నారు.