Home తాజా వార్తలు గెలుపు బాధ్యత ఎంఎల్‌ఎలదే

గెలుపు బాధ్యత ఎంఎల్‌ఎలదే

KTR

16 లోక్‌సభ స్థానాలను భారీ మోజారిటీలతో గెలుచుకుంటేనే కేంద్రం మనం చెప్పినట్టు వింటుంది : ఎంఎల్‌ఎలకు కెటిఆర్ స్పష్టీకరణ ?

మన తెలంగాణ/హైదరాబాద్: ఢిల్లీని యాచించే స్థాయి నుంచి శాసించే స్థాయి వరకు ఎదగాలంటే ఎట్టిపరిస్థితుల్లోనూ టిఆర్‌ఎస్ పదహారు పార్లమెంట్ స్థానాల్లో గెలిచి తీరాలని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదేపదే చెప్తుండడంతో క్షేత్రస్థాయిలో కార్యాచరణ ఇప్పటికే మొదలైంది. తాజాగా ముగిసిన అసెంబ్లీ ఎన్నికల్లో టిఆర్‌ఎస్ అభ్యర్థులను గెలిపించడానికి ఎంపిలు కష్టపడి పనిచేసినందున ఇప్పుడు ఆ గెలుపొందిన ఎంఎల్‌ఎలంతా రానున్న పార్లమెంటు ఎన్నికల్లో ఎంపి అభ్యర్థులను గెలిపించే బాధ్యతలను తీసుకోవాలని కూడా కెటిఆర్ సూచించినట్లు తెలిసింది. రాష్ట్రంలోని 16 పార్లమెంట్ స్థానాల్లో భారీ మెజారిటీతో గెలిస్తేనే కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ప్రజల ఆధీనంలో ఉంటుందనే పట్టుదలతో నాయకత్వం పనిచేయాలని ఇప్పటికే టిఆర్‌ఎస్ అధిష్టానం క్షేత్రస్థాయిలోని పార్టీ శ్రేణులకు సూచించింది. గడిచిన శాసన సభ ఎన్నికల్లో టిఆర్‌ఎస్ ఎంఎల్‌ఏలను గెలిపించే బాధ్యతలు పార్లమెంట్ సభ్యులు తీసుకుని విజయం సాధించినట్లే ఎంపి ఎన్నికల్లో టిఆర్‌ఎస్ శాసన సభ్యులు నియోజకవర్గాలవారీగా పార్లమెంట్ సభ్యులను భారీ మెజారిటీతో గెలిపించాల్సిన బాధ్యత ఉందని పార్టీ ముఖ్యనాయకులు సంకేతాలు ఇచ్చారు.

తాజా శాసనసభ ఎన్నికల్లో ఓటమికి గురైన నియోజకవర్గాలపై పార్టీ శ్రేణులు దృష్టి సారించి ఈసారి పార్లమెంటు ఎన్నికల్లో ఆ వెలితిని భర్తీ చేసే విధంగా కార్యాచరణకు సూచనలు చేసింది. ఓట్లు చీలకుండా ఉండేలా చర్యలు చేపట్టింది. ఈనెల 25 వరకు ఓటర్ల జాబితాలో పేర్ల నమోదుకు అవకాశాలు ఉండటంతో అర్హులైన వారందరినీ నమోదు చేయించాలని ఇప్పటికే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ పిలుపు ఇచ్చారు. టిఆర్‌ఎస్ మంత్రులు మహేందర్ రెడ్డి, అజ్మీరా చందులాల్, జూపల్లి కృష్ణారావు, స్పీకర్ మదుసుధనాచారి ఓడిన నియోజకవర్గాల్లో పార్టీ శ్రేణులు మరింత దృష్టి సారించి పార్లమెంట్ ఎన్నికల్లో మెజారిటీ కోసం కృషి చేయాలని అధిష్టానం ఆదేశించింది. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్, బిజెపి పార్టీలు ఒంటరిగానైనా, కలిసైనా మెజారిటీ సాధించే అవకాశాలు లేవని టిఆర్‌ఎస్ పేర్కొనింది. కాంగ్రెస్ కనుమరుగైపోతుందని, మోడి గ్రాఫ్ రోజురోజుకు తగ్గుతోందని పార్టీ శ్రేణులకు ఇటీవల వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ స్పష్టత ఇచ్చారు. ఈనేపథ్యంలో టిఆర్‌ఎస్ 16 లోక్‌సభ స్థానాలు సాధిస్తే కేంద్ర ప్రభుత్వంలో తెలంగాణ కీలకం కానుందని చెప్పారు. పార్లమెంటు ఎన్నికల్లో ఖమ్మం, నల్లగొండ జిల్లాలపై దృష్టి సారించాలని టిఆర్‌ఎస్ భావిస్తోంది. శాసనసభ ఎన్నికల్లో ఖమ్మంలో టిఆర్‌ఎస్ ఘన విజయం సాధించకపోవడమే దీనికి కారణం. పంచాయితీ ఎన్నికల్లోను పార్టీ బలపర్చిన అభ్యర్థులు విజయం సాధించేందుకు కృషిచేయడంతో పాటు టిఆర్‌ఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన 3,400 వేల గిరిజన తండాల్లో ఏకగ్రీవ ఎన్నికలు జరిగేందుకు కృషిచేయాలని పార్టీ నాయకులను ఆదేశించారు.

ఓటర్ల నమోదు కీలకం

శాసన సభ ఎన్నికల్లో ఓట్లు రాలేదని వేలాది మంది అందోళనకు గురయ్యారు. వారందరి పేర్లను జాబితాను పోలింగ్ కేంద్రాల వారీగా సేకరించి ఓటర్ల నమోదు జాబితాలో చేర్పించాలని ఇప్పటికే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ఆదేశించారు. ఓటర్ల నమోదుతో మెజారిటీ పెంచుకోవాలని భావిస్తోంది. ప్రతీ వంద కుటుంబాలకు ఒక టిఆర్‌ఎస్ నాయకుడు ఉండేలా శాసనసభ్యులు స్థానిక నాయకత్వాన్ని తీర్చి దిద్ది రాష్ట్ర నాయకత్వానికి నివేదికలు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు.

TRS Party Plans To 16 Lok Sabha Seats in Telangana