Home తాజా వార్తలు పరిషత్ ఎన్నికలకు టిఆర్‌ఎస్ సన్నద్ధం

పరిషత్ ఎన్నికలకు టిఆర్‌ఎస్ సన్నద్ధం

TRSనేడు తెలంగాణ భవన్‌లో పార్టీ విస్తృతస్థాయి సమావేశం
హాజరుకానున్న మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపిలు
దిశానిర్దేశం చేయనున్న పార్టీ అధ్యక్షుడు కెసిఆర్

మనతెలంగాణ/హైదరాబాద్: జిల్లా పరిషత్, మండల పరిషత్ ఎన్నికలకు టిఆర్‌ఎస్ పార్టీ సన్నద్ధం అవుతోంది. అందులో భాగంగానే నేడు (సోమవారం) మధ్యాహ్నం 2.30 గంటలకు పార్టీ శ్రేణులకు టిఆర్‌ఎస్ భవన్‌లో పార్టీ అధ్యక్షుడు, సిఎం కెసిఆర్ దిశా, నిర్ధేశం చేయనున్నారు. ఈ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలతో పాటు ప్రణాళికలను పార్టీ అధ్యక్షుడు వారికి వివరించనున్నారు. జిల్లా పరిషత్, మండల పరిషత్ ఎన్నికలకు దృష్టిలో పెట్టుకొని టిఆర్‌ఎస్ పార్టీ విస్తృతస్థాయి సమావేశం నిర్వహించాలని, దీనికి అందరూ హాజరుకావాలని పార్టీ వర్గాల నుంచి ఇప్పటికే అందరికీ ఆదేశాలు అందాయి. ఈ నేపథ్యంలో స్థానికంగా ఉన్న సమస్యలను, అంశాలను కెసిఆర్ దృష్టికి తీసుకెళ్లాలన్న ఆలోచనలో పార్టీ నాయకులు ఉన్నారు.

రాష్ట్రంలోని 535 జెడ్పీటిసి స్థానాలతో పాటు 5,857 ఎంపిటిసి సభ్యుల స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. వారం, పది రోజుల్లో దీనికి సంబంధించి నోటిఫికేషన్ వెలువడనున్న నేపథ్యంలో అన్ని స్థానాలను గెలవాలన్న లక్షంతో పార్టీ అధ్యక్షుడు దీనిపై పార్టీ వర్గాలకు దిశా, నిర్ధేశం చేస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు పూర్తి మెజార్టీతో టిఆర్‌ఎస్ అభ్యర్థులను గెలిపించిన విషయం తెలిసిందే. దీంతోపాటు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో టిఆర్‌ఎస్ బలపరిచిన సర్పంచ్‌లు 80 శాతం మంది గెలుపొందారు. అదేవిధంగా ఈ రెండు ఎన్నికల్లో కూడా అన్ని స్థానాలను టిఆర్‌ఎస్ అభ్యర్థులే గెలవాలన్న లక్షంగా కెసిఆర్ ముందుకు సాగుతున్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. ఇప్పటికే టిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్, రాష్ట్ర జనరల్ సెక్రటరీలతో ఈ రెండు ఎన్నికలకు సంబంధించి సమావేశమయిన విషయం తెలిసిందే.

ఎంపిటిసి, జెడ్పీటిసి ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలతో పాటు స్థానికంగా నెలకొన్న అంశాలపై ఆయన వారితో చర్చించారు. ఈ నేపథ్యంలో పార్టీ అధ్యక్షుడు విస్తృతస్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈసమావేశానికి రాజ్యసభ సభ్యులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు, సీనియర్ నాయకులు, ఎంపిలతో చర్చించి అభ్యర్థులను ఎంపిక చేయాలని కెసిఆర్ నిర్ణయించినట్టు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. అందులో భాగంగానే ప్రతి నియోజకవర్గంలో ఎంపి, ఎమ్మెల్యే, మంత్రులు, నియోజకవర్గ ఇన్‌చార్జీలు సూచించిన వారికి టికెట్ ఇవ్వడంతో పాటు గెలుపు, ఓటములకు వారినే బాధ్యలను చేయాలని కెసిఆర్ భావిస్తున్నట్టు తెలిసింది.

ఇప్పటికే ఈ ఎన్నికలకు సంబంధించి నివేదికను జిల్లాల వారీగా కెసిఆర్ తెప్పించుకున్నట్టు తెలిసింది. ముఖ్యంగా వివిధ పార్టీల నుంచి టిఆర్‌ఎస్‌లోకి వలస వచ్చిన నాయకులకు కూడా ఈ ఎన్నికల్లో అవకాశం ఇవ్వాలని దీనిపై ముఖ్యంగా కెసిఆర్ చర్చించనున్నట్టు తెలిసింది.

TRS Party Starts Work on Mandal, Zilla Elections