Home ఖమ్మం టిఆర్‌ఎస్ ప్లీనరీ తీర్మానాలివే..

టిఆర్‌ఎస్ ప్లీనరీ తీర్మానాలివే..

తెలంగాణలో కోతలు లేని నిరంతర విద్యుత్

Jagadish-Reddyతెలంగాణాలో కోతలు లేని నిరంతర విద్యుత్ అందించే దశకు చేరుకున్నామని విద్యుత్ మంత్రి జి.జగదీశ్ రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి 15వ ప్లీనరీ సమావేశం బుధవారం నగరంలోని చెరుకూరి వారి మామిడి తోటలో జరిగింది.  ప్లీనరీలో “తపస్సు నుండి ఉషస్సు వైపు – తెలంగాణ నిరంతర విద్యుత్‌” అనే తీర్మానాన్ని రాష్ట్ర విద్యుత్, షెడ్యూల్డ్ వెల్ఫేర్ శాఖ మంత్రి జి. జగదీశ్‌రెడ్డి ప్రతిపాదించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయిన నాటి నుండి తమ పాలనను హేళన చేసిన ప్రతిపక్షాలు వారికి తగ్గట్టుగా పాలన కొనసాగించి ఆగస్టు నుండి తెలంగాణలో హైదరాబాద్‌తో పాటు 9 జిల్లాలకు విద్యుత్‌ను అందించేందుకు చత్తీస్‌ఘడ్ రాష్ట్రంతో ఒప్పందం కుదుర్చుకున్నామని తెలిపారు. ఈ తీర్మానాన్ని రాష్ట్ర సినిమా ఫొటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ బలపర్చి మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో కెసిఆర్ నేతృత్వంలో పాలనను అందిస్తూ బడుగు, బలహీన వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలతో పాటు నిరంతరం విద్యుత్‌ను అందించేందుకు ఎంతో పాటు పడుతున్నామని అన్నారు.

పేదలకు అందుబాటులో కెజి టు పిజి గురుకుల విద్య 
Balka-sumanపేదలకు అందుబాటులో ఉండేందుకు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు మానస పుత్రిక – కెజి టు పిజి గురుకుల విద్య అం దించేందుకు అహర్నిశలు శ్రమిస్తున్నారని పెద్దపల్లి పార్లమెంటు సభ్యులు బాల్క సుమన్ అన్నారు. కెజి టు పిజి గురుకుల విద్య తీర్మానాన్ని ఆయన ప్రతిపాదించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను కూడా ఐదు నుండి ఇంటర్ వరకు గురుకులంలో చదువుకుని ఈ స్థాయికి ఎదిగానని గుర్తు చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో బడుగు, బలహీన వర్గాలకు చెందిన పేదల పిల్లలు గురుకుల విద్య అభ్యసించేందుకు టిఆర్‌ఎస్ ప్రభుత్వం విద్య అందుబాటులో ఉండే విధంగా అనేక మార్పులు చేసిందని అన్నారు. కెసిఆర్ అందించే ప్రతి సంక్షేమ పథకాలు అర్హులైన పేదలకు అందే విధంగా చర్యలు తీసు . వరంగల్ పడమర శాసన సభ్యులు వినయ్ భాస్కర్ ఈ తీర్మానాన్ని బలపర్చి మాట్లాడారు. ముఖ్యమంత్రి కెసిఆర్‌కు ప్రీతిపాత్రమైన గురుకుల విద్యను పేదలందరికీ అందించేందుకు కృషి చేస్తున్నారని అన్నారు.

కృష్ణా పుష్కరాలు- నదీమ తల్లితో అనుబంధాలు 

Indra-Karan-Reddyకృష్ణా పుష్కరాలు విజయవంతం అయ్యేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయించి భక్తులకు అన్ని ఏర్పాట్లు చేస్తుందని రాష్ట్ర హౌసింగ్, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్ర కరణ్ రెడ్డి అన్నారు. కృష్ణా పుష్కరాలు – నదీమ తల్లితో అనుబంధాలు అనే తీర్మానాన్ని ప్రతిపాదించి మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం గతంలో నిర్వహించిన గోదావరి పుష్కరాల మాదిరిగా కృష్ణా పుష్కరాలకు భక్తులకు అన్ని ఏర్పాట్లు చేసి విజయవంతం చేసేందుకు ప్రణాళికలు రూపొందించిందన్నారు. నల్గొండ జిల్లా పరిషత్ అధ్యక్షులు బాలు నాయక్ బలపర్చి మాట్లాడారు. కృష్ణా పుష్కరాలు జరిగే ప్రదేశంలో దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక నిధులు కేటాయించి ఏర్పాట్లకు ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. పుష్కరాలు విజయవంతం అయ్యేందుకు భక్తులు సహకరించాలని కోరారు.

శాంతి భద్రతల పరిరక్షణ ప్రభుత్వ ధ్యేయం

padmadevender-reddyతెలంగాణ రాష్ట్రంలో శాంతి భధ్రతల పరిరక్షణే ప్రధాన ధ్యేయంగా తమ ప్రభుత్వం పని చేస్తుందని రాష్ట్ర డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి అన్నారు. శాంతి భధ్రతల పరిరక్షణ – పేకాట, గుడుంబా నిర్మూలన అనేతీర్మానాన్ని ఆమె ప్రతిపాదించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళలకు రక్షణ కల్పించాలనే ప్రధాన ధ్యేయంతో శాంతి భధ్రతల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. మరో పక్క పేకాట, గుడుంబా నిర్మూలనకు గ్రామీణ ప్రాంతాల నుండే దాడులు నిర్వహించి కేసులు నమోదు చేస్తున్నట్లు తెలిపారు. ఎంఎల్‌సి రాములు నాయక్ ఈ తీర్మానాన్ని బలపర్చి మాట్లాడారు. శాంతి భద్రతల పరిరక్షణలో ఇటీవల పోలీసు శాఖలో పలు మార్పులు చేసి శాంతి భద్రతలు కాపాడుతున్నామన్నారు.

అనావృష్టి, నీటి ఎద్దడి – నివారణా చర్యలు 

mahamood-ali2ఈ ఏడాది తెలంగాణ రాష్ట్రంలో సకాలంలో వర్షాలు రాకపోవడంతో అనావృష్టి తోడై నీటిఎద్దడి తలెత్తిందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మహమూద్ ఆలీ అన్నారు. అనావృష్టి నీటి ఎద్దడి – నివారణా చర్యలు అనే తీర్మానాన్ని ఆయన ప్రతిపాదించి మాట్లాడారు. నీటి ఎద్దడి తలెత్తిన ప్రతి చోట నివారణ చర్యకు తమప్రభుత్వం చిత్త శుద్దితో పని చేసి ట్యాంకర్ల ద్వారా ప్రజలకు నీటిని అందిస్తుందన్నారు. అనావృష్టి, కరువు పరిస్థితులను ఎదుర్కొనేందుకు మిషన్ భగీరథ పథకాన్ని ప్రవేశ పెట్టి ఇంటింటికి నల్లా ద్వారా తాగునీరు అందించేందుకు కోట్లాది రూపాయల నిధులు కేటాయించి ప్రాజెక్టు నిర్మాణానికి కృషి చేస్తున్నామన్నారు. రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు నిరంజన్ రెడ్డి మాట్లాడారు. అనావృష్టి కారణంగా ఈ ఏడాది భూగర్భ జ లాలు అడుగంటడంతో తాగునీటి ఎద్దడి ఏర్పడిందని నివారణా చర్యలు తమ ప్రభుత్వం చేపడుతుందన్నారు.

పారిశ్రామికంగా తెలంగాణ ముందంజ

ktrపారిశ్రామికంగా తెలంగాణ ముందజలో ఉండేందుకు వివిధ రకాల టెక్నాలజీతో ముందు వరుసలో నిలిచే విధంగా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహిస్తున్నామని పరిశ్రమలు, ఐటి, మున్సిపల్ శాఖ మంత్రి కె.తారక రామారావు అన్నారు. టెక్నాలజీకి జోడించిన మానవీయ కోణం – తెలంగాణ పారిశ్రామిక ఐటి విధానం అనే తీర్మానం ప్రతిపాదించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వివిధ దేశాలకు చెందిన పారిశ్రామిక వేత్తలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టేవిధంగా పలు ఒప్పందాలు చేసుకుంటున్నామన్నారు. పారిశ్రామికంగా రాష్ట్రం ముందు ఉంటే నిరుద్యోగ యువతకు ఉపాధి లభిస్తుందన్నారు. గ్రేటర్ హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్ ఈ తీర్మానం బలపర్చి మాట్లాడారు.

విభజన చట్టం హామీలు 

vinod-kumarవిభజన చట్టం హమీలు – కేంద్ర ప్రభుత్వ వైఖరి అనే తీర్మానాన్ని ఎంపి బి. వినోద్ కుమార్ ప్రతిపాదించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతానికి తీరని అన్యాయం జరిగిందని ఆందోళన వ్యక్తం చేశారు. విభజన చట్టం హమీలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం నిధుల మంజూరులో తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం చేస్తుందన్నారు. మహబూబ్ నగర్ శాసన సభ్యులు శ్రీనివాస గౌడ్ తీర్మానాన్ని బలపర్చి మాట్లాడారు. విభజన చట్టం హమీల విషయంలో కేంద్ర ప్రభుత్వం మొండిగా వ్యవహరించడంతో తెలంగాణకు కొంతమేర నష్టం జరుగుతుందని తమ పార్టీకి చెందిన పార్లమెంటు సభ్యులు ప్రత్యేక నిధుల కోసం పోరాటం చేస్తున్నారని అన్నారు.

ప్రకృతి రమణీయం – తెలంగాణ హరిత హారం

JOGU-RAMANNAతెలంగాణలో హరిత హారం ద్వారా పచ్చదనాన్ని పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం హరిత హారం పేరుతో బృహత్తర ప్రణాళికను అమలు చేస్తుందని రాష్ట్ర అటవీ శాఖ మంత్రి జోగు రామన్న అన్నారు. ప్రకృతి రమణీయం – తెలంగాణ హరిత హారం అనే తీర్మానాన్ని మంత్రి జోగు రామన్న ప్రతిపాదించి మాట్లాడారు. ఈ ఏడాది ఖరీఫ్‌లో కోట్లాది రూపాయల మొక్కలు నాటి వాటి పరిరక్షణకు ప్రత్యేక చర్యలు తీసు కుం టున్నామన్నారు. అటవీ శాఖ, అగ్ని మాపక శాఖ సిబ్బంది మొక్కల పరిరక్షణకు పలు ప్రాంతాల్లో చర్యలు తీసుకుంటూ ప్రశంసలు పొందుతున్నారని అన్నారు. అచ్చంపేట శాసన సభ్యులు గువ్వల బాలరాజు ఈ తీర్మానాన్ని బలపర్చి మాట్లాడారు. రానున్న ఏడాది రాష్ట్రమంతా హరిత హారం కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు..