Search
Thursday 15 November 2018
  • :
  • :
Latest News

ఎంఎల్ సిలకూ పరిమితి

TRS should support Women Reservation Bill

కౌన్సిల్ ఎన్నికల్లో అభ్యర్థులకూ గరిష్ఠ ఖర్చు నిబంధన ఉండాలి                                                                                    చట్టసభల్లో మహిళల ప్రాతినిధ్యం పెరగాలి : ఎన్నికల సంఘం నిర్వహించిన అఖిలపక్ష భేటీలో టిఆర్‌ఎస్ ఎంపి వినోద్ కుమార్ 

మన తెలంగాణ/ న్యూఢిల్లీ : మహిళలకు పార్లమెంట్‌లో ప్రాతినిధ్యం పెరగాలని, మహిళా రిజర్వేషన్ బిల్లును వెంటనే ఆమోదించాలని టిఆర్‌ఎస్ ఎంపి వినోద్ కుమార్ వ్యాఖ్యానించారు. ఎన్నికల సంస్కరణలపై కేంద్ర ఎన్నికల సంఘం సోమవారం ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశంలో టిఆర్‌ఎస్ తరఫున ఎంపి వినోద్ కుమార్ హాజరయ్యారు. అఖిలపక్ష సమావేశం తర్వాత ఆయన మీడియా తో మాట్లాడుతూ ‘నేను టిఆర్‌ఎస్ తరపున హాజరయ్యా ను. ఎజెండాలో ఇచ్చిన అంశాలపై పార్టీల వారీగా అందరి అభిప్రాయాలనూ ఎన్నికల సంఘం అడిగి తెలుసుకుంది. మహిళా రిజర్వేషన్ బిల్లు పార్లమెంట్‌లో ఉంది. మహిళలకు పార్లమెంట్‌లో ప్రాతినిధ్యం పెరగాలి. మహిళా రిజర్వేషన్ బిల్లును వెంటనే ఆమోదించాలి’ అని పేర్కొన్నారు. ‘శాసనమండలి ఎన్నికల్లో ఎంఎల్‌సి అభ్యర్థులకు గరిష్ట ఖర్చు నిబంధన లేదు. ఎంఎల్‌ఎలు, ఎంపిలకు ఉన్నట్లు ఎంఎల్‌సిలకూ ఈ నిబంధన పెట్టాలని ఎన్నికల సంఘాన్ని కోరాం.

రాజకీయ పార్టీల ఖర్చులపై కూడా నియంత్రణ పెట్టాలి. ఇసికి టిఆర్‌ఎస్ పూర్తిగా సహకరిస్తోంది. ఎన్నికలు జరిగే రోజు కూడా  లోకల్ ఛానల్స్‌లో పార్టీ ప్రచారానికి వాణిజ్య ప్రకటనల రూపంలో అడ్వర్టయిజ్‌మెంట్స్ వస్తున్నాయి. వీటిపై దృష్టి పెట్టాలని ఈసిని కోరాం. వికలాంగులకు ప్రత్యేక బూత్‌లు పెట్టాలి. జాతీయ పార్టీలు ఎక్కువ ఖర్చు చేస్తున్నాయి. వాటిని నియంత్రించాలి,’ అని వినోద్‌కుమార్ చెప్పారు. ఎన్నికల సంస్కరణలకు సంబంధించిన పలు అంశాలపై టిఆర్‌ఎస్ అభిప్రాయాలను వినోద్‌కుమార్ రాతపూర్వకంగా కేంద్ర ఎన్నికల సంఘానికి అందించారు. పోటీచేసే చట్ట సభలలో, రాజకీయ పార్టీల సంస్థాగత నిర్మాణంలో మహిళల ప్రాతినిధ్యం పెంచాలన్న ఎన్నికల సంఘం సలహా మంచిదని, రాజకీయ పార్టీల వివిధ కమిటీ లలో ఎంత శాతం మహిళలకు ప్రాతినిధ్యం ఉండాలనే అంశాన్ని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించవచ్చునని వినోద్ కుమార్ ఎన్నికల సంఘానికి రాసిన లేఖలో పేర్కొన్నారు.

చట్ట సభలలో మహిళలకు 33 శాతం రేజర్వేషన్లు కల్పించాలని టిఆర్‌ఎస్ గతంలోనే తీర్మానించిందని, పార్లమెంట్‌లో మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందడానికి ప్రభుత్వం తగు చర్యలు చేపడుతుందని ఆశిస్తున్నామని వినోద్‌కుమార్ తెలిపారు. ఎంపిలు, ఎమ్మెల్యేలకు ఎన్నికల వ్యయంపై ఎన్నికల సంఘం ఇప్పటికే సీలింగ్ విధించిందని, అయితే ఎంఎల్‌సిలకు ప్రస్తుతం ఆ విధమైన సీలింగ్ లేదన్నారు. ఎంఎల్‌సి ఎన్నికలలో కూడా వ్యయంపై సీలింగ్ విధించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని వినోద్ కుమార్ సూచించారు. అంతేకాకుండా పార్టీల ఎన్నికల వ్యయంపై ఎన్నికల నిబంధనల్లో ఏ విధమైన సీలింగ్ లేదన్నారు. పార్టీల ఎన్నికల వ్యయంపై సీలింగ్ విధించాలని కేంద్ర ఎన్నికల సంఘం భావిస్తే విధి విధానాలను రూపొందించి పార్టీలకు ప్రతిపాదించాలని వినోద్ కుమార్ సూచించారు. ఆ విధమైన ప్రతిపాదన అందిన తర్వాత టిఆర్‌ఎస్ అభిప్రాయాన్ని అందజేస్తామని ఎంపి తెలిపారు. ఎన్నిక ప్రక్రియ ముగియడానికి 48 గంటల ముందే ప్రచార కార్యక్రమాలను నిషేధిస్తారని, కానీ 24 గంటల న్యూస్ ఛానెళ్ళు, శాటిలైట్ టెక్నాలజీ, సోషల్ మీడియా ఎన్నిక సమయంలోనూ, అంతకుముందు చివరి క్షణాలలో ఓటర్లను ప్రభావితం చేస్తున్నాయని వినోద్ కుమార్ చెప్పారు. ప్రచార నిషేధిత సమయంలో ఎన్నికల సంఘం ఆదేశాలను ఉల్లంఘించిన ప్రింట్ మీడియాపై చేపట్టే చర్యలను, ఒక వేళ ఓటర్లను ప్రభావితం చేస్తే సోషల్ మీడియాపై కూడా చేపట్టాలని వినోద్ కుమార్ సూచించారు.

Comments

comments