Home ఆదిలాబాద్ పరిషత్ మూడో విడత ఎన్నికలపై ప్రత్యేక దృష్టి…

పరిషత్ మూడో విడత ఎన్నికలపై ప్రత్యేక దృష్టి…

TRS special focus on Third phase Parishad election

 

ఆదిలాబాద్: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రెండు విడతల్లో జరిగిన ఎంపిటిసి, జడ్పిటిసి ఎన్నికల ఫలితాలు ఏకపక్షంగా వస్తాయని అధికార పార్టీ ఎంఎల్ఎలు, పార్టీ నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మూడో విడతలో ఆరు మండలాల్లోని జడ్పిటిసి, ఎంపిటిసి స్థానాలకు ఎన్నికలు జరగనుండగా వాటిపై ప్రత్యేక దృష్టి సారించేందుకు సిద్దమవుతున్నారు. సిరికొండ, ఇచ్చోడ మండలాలు బోథ్ నియోజకవర్గంలోని వస్తుండగా, ఇంద్రవెల్లి, ఉట్నూర్ మండలాలు ఖానాపూర్ నియోజకవర్గంలోకి, నార్నూర్, గాదిగూడ మండలాలు ఆసిఫాబాద్ నియోజకవర్గంలోని ఈ మండలాలు రావడం గమనార్హం. ఇప్పటికే ఈ మండలాలలో ఎంఎల్ఎలు పర్యటించగా, నార్నూర్, గాదిగూడ మండలాల్లోనూ ప్రచారాన్ని విస్తృతంగా చేపడుతున్నారు. రెండు విడతల్లో జరిగిన జడ్పిటిసి, ఎంపిటిసి ఎన్నికలలో ఏకపక్ష తీర్పు వస్తుందని అంచనాల్లో ఉన్న టిఆర్‌ఎస్ పార్టీ, మూడో విడతలోనూ స్థానాలన్నింటిని కైవసం చేసుకొనే పనిలో పడింది.

అసెంబ్లీ, పంచాయతీ ఎన్నికలలో వచ్చిన తీర్పే పునరావృతం అవుతుందని జిల్లా పరిషత్ స్థానాలతో పాటు అన్ని ఎంపిపి స్థానాలను గెలుచుకుంటామని జిల్లా ఇన్‌చార్జీగా వ్యవహరిస్తున్న ఆదిలాబాద్ ఎంఎల్ఎ జోగురామన్న అన్నారు. గత ఎన్నికలలో మండలాలు, బూత్‌ల వారీగా పోలైన ఓట్లు, తదితర అంశాలను బేరీజు వేసుకొని మెజార్టీ స్థానాలను కైవసం చేసుకుంటామనే ధీమా వ్యక్తం చేస్తున్నారు. మండలానికి ఒకటి, రెండు స్థానాలలో మెజార్టీ కొంత తక్కువగా వచ్చినా అన్ని స్థానాలను దక్కించుకుంటామని, వారీగా బలాలు, బలహీనతలను బేరీజు వేసుకుంటూ ఇంటింటి ప్రచారాన్ని చేపడుతున్నారు. ఇచ్చోడ, సిరికొండ మండలాలలో ఎంఎల్ఎ రాథోడ్ బాపూరావ్ విస్తృతంగా పర్యటిస్తున్నారు. మండలాలు, గ్రామాల వారీగా పార్టీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పని చేస్తూ మెజార్టీ స్థానాలను కైవసం చేసుకోవడంపై దృష్టి సారించాలని సూచిస్తున్నారు.

ఇదిలా ఉంటే ఎంపిటిసి, జడ్పిటిసి ఎన్నికలలో కాంగ్రెస్, బిజెపిల తరపున బరిలో నిలిచిన అభ్యర్థులు అధికార టిఆర్‌ఎస్ పార్టీ చేస్తున్న ప్రచారంతో పోటీ పడలేక పోతున్నారు. ఓటమి ఖరారు కావడంతో దిక్కుతోచని పరిస్థితులో కొట్టుమిట్టాడుతూ మెజార్టీ తగ్గించి పరువు కాపాడుకొనే పనిలో ఉన్నారు. కాంగ్రెస్, బిజెపి జిల్లా స్థాయి నాయకులు సైతం ఎన్నికలలో పోటీ చేస్తున్న అభ్యర్థుల తరపున ప్రచారం చేయడంలో నిరాసక్తత కనబర్చుతున్నారు. రాష్ట్రంలో చేదు ఫలితాలను మూటగట్టుకున్న కాంగ్రెస్ పార్టీ ఆ తరువాత పార్టీ తరపున గెలిచిన ఎంఎల్ఎలు అధికార పార్టీలో చేరుతుండడంతో ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొంటోంది. మెజార్టీ ప్రజలు అధికార పార్టీకి మద్దతు పలుకుతుండడం, ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను స్వాగతిస్తుండడంతో అధికార పార్టీని పూర్తి స్థాయిలో ఎదుర్కొనే పరిస్థితులు కనిపించడం లేదు.

TRS special focus on Third phase Parishad election