Home తాజా వార్తలు జమిలికి సై

జమిలికి సై

లోక్‌సభ, అసెంబ్లీల ఏకకాల ఎన్నికలకు మద్దతు పలికిన టిఆర్‌ఎస్ 

 లా కమిషన్‌కు ముఖ్యమంత్రి కెసిఆర్ లేఖ 

ఆదివారం నాటి చర్చల్లో పాల్గొన్న ఎంపి వినోద్ 

Elections

హైదరాబాద్/ న్యూఢిల్లీ : లోక్‌సభకు, శాసనసభలకు కలిపి ఒకేసారి ఎన్నికలు నిర్వహించే జమిలి ఎన్నికల విధానానికి తెలంగాణ రాష్ట్ర సమితి సం పూర్ణ మద్దతు తెలియజేసింది. ఈ విధానాన్ని స్వాగతిస్తున్నట్లు స్పష్టం చేసింది. ఎన్నికల నిర్వహణకు కనీసంగా నాలుగు మాసాల నుంచి గరిష్టంగా ఆరు మాసాల వరకు సమయాన్ని వెచ్చించాల్సి వస్తోందని, లోక్‌సభకు, శాసనసభకు విడివిడిగా ఎన్నికలు నిర్వహించడం ద్వారా సమయాన్ని ఖర్చు చేయాల్సి వస్తోందని, కలిపి నిర్వహించడం ద్వారా ఆదా చేయవచ్చునని పేర్కొన్నది. టిఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కెసిఆర్ భారత లా కమిషన్‌కు రెండు రోజుల క్రితం రాసిన లేఖలో ఈ విషయాన్ని స్పష్టం చేశారు. జమిలి ఎన్నికల నిర్వహణపై వివి ధ పార్టీల అభిప్రాయాలను తెలుసుకునే నిమిత్తం భారత లా కమిషన్ గత రెండు రోజులుగా ఏడు జాతీయ పార్టీలు, 59 గుర్తింపు పొందిన పార్టీల నుంచి అభిప్రాయాలను సేకరిస్తూ ఉంది. టిఆర్‌ఎస్ తరఫున కరీంనగర్ పార్లమెంటు సభ్యులు బి.వినోద్‌కుమార్ ఢిల్లీలోని భారత లా కమిషన్ చైర్మన్ ఏర్పాటు చేసిన సమావేశానికి హాజరై పార్టీ అభిప్రాయాన్ని తెలియజేయడంతో పాటు కెసిఆర్ రాసిన రెండు పేజీల లేఖను అందజేశారు. లోక్‌సభ లేదా శాసనసభ ఎన్నికలు జరిగినప్పుడల్లా రాష్ట్ర ప్రభుత్వ యం త్రాంగం జిల్లాస్థాయి వరకు ఏర్పాట్లలో నిమగ్నం కావాల్సి వస్తోందని, శాంతిభద్రతల అవసరాల కోసం పోలీసు యంత్రాంగాన్ని వినియోగించాల్సి వస్తోందని, ఐదేళ్ళ వ్యవధి లో లోక్‌సభకు, శాసనసభకు వేర్వేరుగా ఎన్నికలు నిర్వహించ డం ద్వారా రెండుసార్లు ఈ కసరత్తుపై దృష్టి పెట్టాల్సి వస్తోంద ని కెసిఆర్ ఆ లేఖలో పేర్కొన్నారు. ఎన్నికల సందర్భంగా ప్రవర్తనా నియమావళి అమలులోకి వస్తున్నందువల్ల అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించడానికి ఆంక్షలు అడ్డు వస్తున్నాయని పేర్కొన్నారు. దీనికి తోడు భారీ మొత్తంలో ప్రజా ధనాన్ని వెచ్చించాల్సి వస్తోందని, రాజకీయ పార్టీలు, వాటి తరఫున పోటీ చేసే అభ్యర్థులు సైతం రెండు దఫాలుగా ఎన్నికల ప్రచారానికి ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని వివరించారు. ఈ నేపథ్యంలో లోక్‌సభకు, శాసనసభకు కలిపి ఒకేసారి (జమిలి) ఎన్నికలను నిర్వహించే విధానానికి తెలంగాణ రాష్ట్ర సమితి సంపూర్ణ మద్దతు తెలియజేస్తోందని, ఈ విధానాన్ని స్వాగతిస్తోందని ఆ లేఖలో స్పష్టం చేశారు.
మూడున్నర దశాబ్దాలుగా జరుగుతున్న చర్చ : ఎంపి వినోద్‌కుమార్
లోక్‌సభకు, శాసనసభకు కలిపి ఒకేసారి జమిలి ఎన్నికలను నిర్వహించాలన్న చర్చ ఇప్పటిది కాదని 1983 నుంచి ఉందని, అయితే ఇటీవలి కాలంలో ప్రధాని నరేంద్రమోడీతో పాటు నీతి ఆయోగ్ కూడా ఈ అంశాన్ని మళ్ళీ చర్చ కోసం తెరపైకి తీసుకొచ్చిందని కరీంనగర్ ఎంపి బి.వినోద్‌కుమార్ పేర్కొన్నారు. భారత లా కమిషన్ చైర్మన్ చౌహాన్‌తో ఢిల్లీలో ఆదివారం ఉదయం భేటీ అయిన అనంతరం వినోద్‌కుమార్ మీడియాతో మాట్లాడుతూ, జమిలి ఎన్నికల ఆవశ్యకతతో పాటు లాభ నష్టాలు, అనుకూల ప్రతికూలతల అంశాలను వివరించామని తెలిపారు. టిఆర్‌ఎస్ అధ్యక్షుడు కెసిఆర్ రాసిన లేఖను కూడా అందజేశామని తెలిపారు. భారత లా కమిషన్ ప్రస్తావించిన అంశాలకు కెసిఆర్ ఈ లేఖలో స్పష్టమైన సమాధానం ఇచ్చారని, పార్టీ నిశ్చితాభిప్రాయాన్ని తెలియజేశారని వివరించారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత 1967 వరకు దేశవ్యాప్తంగా లోక్‌సభకు, శాసనసభలకు ఒకేసారి ఎన్నికలు జరిగాయని, 1968 అనంతరం కొన్ని రాష్ట్రాల్లో శాసనసభలు రద్దు కావడం వలన, మధ్యంతర ఎన్నికలు రావడం వలన ఒకేసారి జరగాల్సిన ఎన్నికల షెడ్యూలు మారిపోయిందని పేర్కొన్నారు. ఫలితంగా లోక్‌సభకు, శాసనసభలకు వేర్వేరుగా ఎన్నికలు జరుగుతున్నాయని గుర్తుచేశారు. వాస్తవానికి దేశవ్యాప్తంగా ఒకేసారి లోక్‌సభకు, శాసనసభలకు ఎన్నికలు జరపడం మంచిదా కాదా అనే చర్చ ఇప్పటిది కాదని, 1983లోనే లా కమిషన్ ప్రస్తావించిందని, చాలా సంవత్సరాల నుంచి ఈ చర్చను కొనసాగిస్తూనే ఉందని, దురదృష్టవశాత్తూ సీరియస్‌గా చర్చ జరగకపోవడం వలన ఇంతకాలం కాలయాపన జరిగిందని వివరించారు. ఇటీవల నీతి ఆయోగ్, ప్రధాని దీన్ని మళ్ళీ తెరపైకి చర్చకు తీసుకొచ్చారని, కానీ ప్రధాని మోడీ, బిజెపి ఏజెండాగా దీన్ని చాలా మంది భావిస్తున్నారని, అయితే ఇది వాస్తవం కాదని పేర్కొన్నారు. భారత లా కమిషన్ జమిలి ఎన్నికల చర్చలకు నాంది పలికిందని గుర్తుచేశారు. భారత ప్రజాస్వామ్యంలో ఒకసారి ఎన్నికైన ప్రభుత్వం ఐదేళ్ళు పనిచేయాల్సి ఉంటుందని, కానీ లోక్‌సభకు, శాసనసభకు వేర్వేరుగా ఎన్నికలు జరుగుతున్నందున ఐదేళ్ళ వ్యవధిలోనే రాష్ట్రాలు రెండు ఎన్నికలకు సిద్ధం కావాల్సి వస్తోందని అన్నారు. రాష్ట్రంలో ఎన్నికలు జరిగిన తర్వాత గెలిచిన పార్టీ, దాని నాయకుడు (చాలా సందర్భాల్లో ముఖ్యమంత్రి) పరిపాలనా క్రమంలో రెండు లేదా మూడేళ్ళకు పార్లమెంటు ఎన్నికలను ఎదుర్కోవాల్సి వస్తోందని, దాని వెన్నంటి ఎన్నికల నోటిఫికేషన్, ఎన్నికల ప్రవర్తనా నియమావళి, పోలింగ్ తదితర ప్రక్రియలకు విధిగా రాష్ట్ర ప్రభుత్వ అధికారులను, సిబ్బందిని కేటాయించాల్సి వస్తోందని పేర్కొన్నారు. ఆ ఎన్నికల ప్రచారం కోసం ముఖ్యమంత్రులు, మంత్రులు గణనీయంగా సమయాన్ని కూడా వెచ్చించాల్సి వస్తోందని అన్నారు. ఐదేళ్ళలో జరిగే వేర్వేరు ఎన్నికల కోసం ప్రధాని, కేంధ్ర మంత్రులు ఆయా రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారం కోసం తిరగాల్సి వస్తోంది, విలువైన సమయాన్ని కేటాయించాల్సి వస్తోందని గుర్తుచేశారు. 2014లో లోకసభ ఎన్నికలు జరిగిన తర్వాత ప్రతీ ఏటా రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతూనే ఉన్నాయని, ఈ నాలుగేళ్ళ వ్యవధిలోనే ప్రధాని, కేంద్ర మంత్రులు అనేక రాష్ట్రాల్లో ప్రచారంలో పాల్గొన్నారని పేర్కొన్నారు. ఒకేసారి ఎన్నికలను నిర్వహించడానికి అవసరమైన రాజ్యాంగాన్ని సవరించుకునే అధికారం రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ద్వారా మనకు లభించిందని, రాజ్యాంగంలోని ఆర్టికల్ 368లో సవరణ కోసం చలాఆ స్పష్టమైన ప్రస్తావనే ఉందని గుర్తుచేశారు. ఆ ప్రకారం జమిలి ఎన్నికల కోసం అవసరమైన తీరులో రాజ్యాంగాన్ని సవరించుకునే అధికారం మనకు ఉందని పేర్కొన్నారు. రాజ్యాంగంలోని మౌలిక స్వరూపాన్ని మనం మార్చాల్సిన అవసరం లేదని, కొన్ని సవరణలు మాత్రమే చేసుకుంటే సరిపోతుందని వివరించారు. ఇటు రాష్ట్రాల్లో ఎన్నికైన ప్రభుత్వాలు, అటు కేంద్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో దృష్టి పెట్టి సక్రమంగా పరిపాలన సాగించాలంటే ఐదేళ్ళ సమయం వృధా కాకుండా, పూర్తిస్థాయిలో వెచ్చించే విధంగా జమిలిగా ఎన్నికలు జరగడమే మంచిదని నొక్కిచెప్పారు.
ముందస్తు, జమిలి ఎన్నికలు వేర్వేరు అంశాలు : ముందస్తు ఎన్నికలు, జమిలి ఎన్నికలు వేర్వేరు అంశాలని, ఈ రెండింటినీ కలిపి ఆలోచించరాదని ఎంపి వినోద్‌కుమార్ నొక్కిచెప్పారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1999లో, 2004లో, 2009లో, 2014లో లోక్‌సభ, శాసనసభ ఎన్నికలు కలిసే జరిగాయని, జమిలి ఎన్నికల అంశం రెండు తెలుగు రాష్ట్రాలకూ కొత్తదేమీ కాదని, నిర్వహణ పెద్దగా సమస్య కాదని వివరించారు. కానీ దేశంలో చాలా రాష్ట్రాల్లో మాత్రం లోక్‌సభ, శాసనసభలకు ఎన్నికలు వేర్వేరుగా జరుగుతున్నాయని, అలాంటి రాష్ట్రాలకు ఇది కొత్తగా అనిపించినా, నిర్వహణాపరంగా అసాధ్యమని అనిపించినా ఆశ్చర్యం లేదని, కానీ సానుకూల అంశాలు చాలానే ఉన్నాయని పేర్కొన్నారు.
జమిలి ఎన్నికలపై టిఆర్‌ఎస్ అధినేత కెసిఆర్ భారత లా కమిషన్‌కు రాసిన లేఖలో చాలా స్పష్టత ఇచ్చారని, రెండు ఎన్నికలూ ఒకేసారి జరగాలన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారని గుర్తుచేశారు. ఇతర పార్టీలు ఏ విధంగా అభిప్రాయ పడుతున్నాయనేదానిపై టిఆర్‌ఎస్‌కు సంబంధం లేదని, ఆ పార్టీలు జమిలి ఎన్నికలకు సానుకూలంగా ఉన్నాయా లేక వ్యతిరేకంగా ఉన్నాయా లేక టిఆర్‌ఎస్ వ్యక్తం చేసిన అభిప్రాయానికి సానుకూలమా, వ్యతిరేకమా అనేది తమ పార్టీకి అవసరం లేదని కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. ఏ పార్టీ అభిప్రాయం దానికుంటుందని, టిఆర్‌ఎస్ తన అభిప్రాయాన్ని సూటిగానే చెప్పిందని అన్నారు. లా కమిషన్ చైర్మన్ తమ పార్టీ అభిప్రాయంపైనా, మొత్తంమీద జమిలి ఎన్నికల నిర్వహణలోని సాధ్యాసాధ్యాలు, అనుకూల ప్రతికూల అంశాలపైన స్పష్టమైన ప్రశ్నలు అడిగారని, టిఆర్‌ఎస్ ప్రతినిధిగా తాను కూడా సూటిగానూ, వివరంగానూ జవాబు ఇచ్చానని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. లా కమిషన్ ఛైర్మన్ అనేక ప్రశ్నలు అడిగారని, అవసరమైన వివరణను ఇచ్చానని, తాను ఇచ్చిన వివరణతో సంతృప్తి వ్యక్తం చేయడంతో పాటు లోతైన సమాచారంతో వచ్చాననే అభిప్రాయాన్ని వ్యక్తం చేసి రాజ్యాంగపరమైన అంశాలకు సంబంధించి లిఖితపూర్వకంగా వివరణలు ఇవ్వాలని కోరారని తెలిపారు. టిఆర్‌ఎస్ అధినేత కెసిఆర్ అనుమతితో లిఖితపూర్వకంగా ఇస్తానని స్పష్టం చేసినట్లు తెలిపారు.