Home రాష్ట్ర వార్తలు త్రీఆర్‌ఎస్

త్రీఆర్‌ఎస్

trs

మూడూ గులాబీలే

రాజ్యసభ ఎన్నికల్లో ఎదురులేని విజయం

కాంగ్రెస్ అభ్యర్థి బలరాంనాయక్ ఓటమి

మన తెలంగాణ/ హైదరాబాద్ : మూడు రాజ్యసభ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో టిఆర్‌ఎస్ అభ్యర్థులు విజయదుంధుభి మోగించారు. కాంగ్రెస్ అభ్యర్థిపై ముగ్గురూ భారీ విజయం సాధించారు. ఉద్యమకాలం నుండి అధినేత వెన్నంటే ఉన్న టిఆర్‌ఎస్ ప్రధాన కార్యదర్శి జోగినిపల్లి సంతోష్‌కుమార్‌తో పాటు, బండా ప్రకాశ్, బడుగుల లింగయ్య యాదవ్‌లు రాజ్యసభ సభ్యులుగా శుక్రవారం ఎన్నికయ్యారు. వీరికి ఎంపిలుగా ఎన్నికైనట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి డాక్టర్ వి.నరసింహాచార్యులు సర్టిఫికెట్‌ను అందజేశారు. కాంగ్రెస్ అభ్యర్థి బలరాంనాయక్ కంటే టిఆర్‌ఎస్ అభ్యర్థులు మూడింతలకు పైగా ఓట్లు సాధించారు. మొత్తం 117 ఓట్లు ఉండగా, 108ఓట్లు పోలయ్యాయి. ఇందులో స్వతంత్ర సభ్యుడు దొంతి మాధవరెడ్డి ఓటు చెల్లదని ఎన్నికల సంఘం నిర్ధారించింది. దీంతో చెల్లిన 107ఓట్లలో గెలుపు కోటా కింది 27 ఓట్లను నిర్థారించారు. టిఆర్‌ఎస్ అభ్యర్థుల్లో బండా ప్రకాశ్‌కు 33 ఓట్లు, సంతోష్‌కుమార్‌కు 32 ఓట్లు, బడుగుల లింగయ్య యాదవ్‌కు 32 ఓట్లు లభించాయి. కాంగ్రెస్ అభ్యర్థి బలరాంనాయక్‌కు కేవలం పది ఓట్లే లభించడంతో ఓటమి పాలయ్యారు. బరిలో ఉన్న నలుగురు అభ్యర్థులకూ మొదటి ప్రాధాన్యత ఓట్లే లభించాయి. ఈ గెలుపుతో రాజ్యసభలో టిఆర్‌ఎస్ బలం రెట్టింపైంది. ప్రస్తుతం పెద్దల సభలో టిఆర్‌ఎస్‌కు ముగ్గురు ఎంపిలు ఉండగా, వారికి మరో ముగ్గురు తోడవడంతో ఆ సంఖ్య ఆరుకు చేరుకుంది.
తొలి ఓటు ఈటల, తుది ఓటు జీవన్‌రెడ్డి :అటు శాసనసభ కొనసాగుతుండడం, మరోవైపు కమిటీ హాల్‌లో ఓటింగ్ జరగడంతో శాసనభ ప్రాంగణమంతా శుక్రవారం కోలాహలంగా మారింది. ఉదయం తొమ్మిది గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. టిఆర్‌ఎస్ సభ్యులంతా తెలంగాణ భవన్ నుండి పోలింగ్ ప్రారంభమయ్యే సమయానికి అసెంబ్లీకి చేరుకున్నారు. ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ అందరికంటే ముందు ఓటేశారు. తరువాత మంత్రులు మహేందర్‌రెడ్డి, హరీశ్‌రావులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఆ తరువాత వరుసగా ఇతర మంత్రులు, టిఆర్‌ఎస్ ఎంఎల్‌ఏలు ఓటు వేశారు. స్పీకర్ ఎస్.మధుసూదనాచారి 9ః30 గంటల ప్రాంతంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు మధ్యాహ్నం ఓటు వేశారు. ఎంఐఎం శాసనసభాపక్ష నాయకులు అక్బరుద్దీన్ ఓవైసీ ఆధ్వర్యంలో ఆ పార్టీకి చెందిన మొత్తం ఏడుగురు ఎంఎల్‌ఏలు ఓటు వేశారు. మరోవైపు కాంగ్రెస్ సభ్యులంతా ఉదయం పది గంటలకు సిఎల్‌పి చేరుకున్నారు. టిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎలలో చివరగా నారాయణ్‌పేట్ ఎంఎల్‌ఏ రాజేందర్‌రెడ్డి ఓటేశారు. ఆయన తిరుపతి నుండి నేరుగా శాసనసభకు వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారు.
మరోవైపు కాంగ్రెస్ ఎంఎల్‌ఏలు ఉదయం పది గంటలకు సిఎల్‌పి కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడ నుండి సిఎల్‌పి నేత కె.జానారెడ్డి, పిసిసి అధ్యక్షులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఎంఎల్‌ఏలు మల్లు భట్టి విక్రమార్క, డాక్టర్ జె.గీతారెడ్డి, డి.కె.అరుణ, పద్మావతి, టి.రామ్మోహన్‌రెడ్డిలు కలిసి పోలింగ్ కేంద్రానికి వెళ్ళి ఓటు వేశారు. అనంతరం ఎంఎల్‌ఏలు సి.హెచ్.వంశీచంద్‌రెడ్డి, డాక్టర్ జి.చిన్నారెడ్డిలు విడివిడిగా వెళ్ళి ఓటేసి వచ్చారు. అందరికంటే చివరగా సిఎల్‌పి ఉపనేత టి.జీవన్‌రెడ్డి మధ్యాహ్నం 3 గంటలకు తన ఓటు వేశారు. టిఆర్‌ఎస్‌కు చెందిన 82, ఎంఐఎంకు చెందిన ఏడుగురు, కాంగ్రెస్‌కు చెందిన 17 మంది, సిపిఐకి చెందిన ఒక్క ఎంఎల్‌ఏ ఓటు హక్కు వినియోగించుకోగా, బిజెపికి చెందిన ఐదుగురు, టిడిపికి చెందిన ముగ్గురు, ఒక్క సిపిఐ(ఎం) సభ్యుడు ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు. పోలింగ్ సాయంత్రం నాలుగు గంటలకు ముగిసిన తరువాత, ఐదు గంటలకు కౌంటింగ్ ప్రక్రియ చేపట్టారు. రెండు గంటల తరువాత కౌంటింగ్ పూర్తయింది.
చెల్లని దొంతి మాధవరెడ్డి ఓటు
అసెంబ్లీ రికార్డుల్లో స్వతంత్ర ఎంఎల్‌ఏగా ఉన్న దొంతి మాధవరెడ్డి ఓటు వేశాక తన బ్యాలెట్‌ను కాంగ్రెస్ పార్టీ ప్రతినిధిగా ఉన్న రేగా కాంతారావుకు చూపించారు. నిబంధనల ప్రకారం కేవలం పార్టీ టిక్కెట్‌పై గెలిచిన అభ్యర్థులు మాత్రమే ఆ పార్టీ ప్రతినిధికి బ్యాలెట్ చూపించాల్సి ఉంటుంది. ఇండిపెండెంట్ ఎంఎల్‌ఏగా గెలిచిన మాధవరెడ్డి ఓటును కాంగ్రెస్ ప్రతినిధికి చూపడంతో ఎన్నికల అధికారులు ఈ అంశంపై కేంద్ర ఎన్నికల సంఘంతో సంప్రదించినట్లు తెలిసింది. నిబంధనల ప్రకారం ఆ ఓటు చెల్లదని చెప్పడంతో, దొంతి మాధవరెడ్డి ఓటును కౌంటింగ్‌లో చెల్లనిదిగా పరిగణించారు.
ఏడు ఓట్లపై కాంగ్రెస్ ఫిర్యాదు
మరోవైపు కాంగ్రెస్ టిక్కెట్‌పై గెలిచిన రెడ్యానాయక్, అజయ్‌కుమార్, కోరం కనకయ్య, కాలె యాదయ్య, ఎన్.భాస్కర్‌రావు, చిట్టెం రామ్మోహన్‌రెడ్డి, జి.విఠల్‌రెడ్డిలు విప్‌ను ధిక్కరించి టిఆర్‌ఎస్‌కు ఓటేశారని కాంగ్రెస్ ప్రతినిధి రేగా కాంతారావు రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేశారు. వారి ఓటును పరిగణలోకి తీసుకోవద్దని, అలాగే టిఆర్‌ఎస్ అభ్యర్థులకు ఓటేసినందుకు వారిని అనర్హులుగా ప్రకటించాలని కోరారు. దీనిపై కేంద్ర ఎన్నికల సంఘంతో రిటర్నింగ్ అధికారి సంప్రదించారు.రాజ్యసభ ఎన్నికల నిబంధనల ప్రకారం ఇతర పార్టీ అభ్యర్థులకు వ్యతిరేకంగా ఓటేసినప్పటికీ తమ పార్టీ ప్రతినిధికి బ్యాలెట్ చూపించినా ఓటు చెల్లుతుందని ఇసి స్పష్టం చేయడంతో ఆ ఏడులు ఓట్లను పరిగణలోకి తీసుకున్నారు.