Friday, March 29, 2024

ధాన్యం సమస్యపై నేడు టిఆర్‌ఎస్‌ఎల్‌పి భేటీ

- Advertisement -
- Advertisement -

TRSLP meeting today on grain issue

సిఎం కెసిఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్‌లో ఏర్పాటు

కేంద్రం విధానాలను ఎండగడుతూ రైతులను ఆదుకోవడంపై చర్చ
సమావేశం తీసుకోబోయే
నిర్ణయాలపై సర్వత్రా ఆసక్తి
కేంద్రంపై పోరుకు ప్రణాళిక సిద్ధం చేసే అవకాశం

మన తెలంగాణ/హైదరాబాద్ : ధాన్యం కొనుగోళ్లపై కేంద్రం అనుసరిస్తున్న ద్వంద్వ వైఖరిపై తీవ్ర అసంతృప్తి, హూసీగహంతో ఉన్న సిఎం కెసిఆర్ భవిష్యత్ కార్యాచరణపై దృష్టి సారించారు. దీనిపై ఎలా ముందుకువెళ్లాలన్న అంశంపై మంగళవారం ప్రగతి భవన్‌లో టిఆర్‌ఎస్ పార్టీ శాసనసభా పక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో కేంద్రం విధానాలను ఎం డగడుతూనే రైతులను ఆదుకునేందుకు తీసుకోవాల్సిన అంశాలపై కూలంకషంగా చర్చించనున్నారు. యాసంగిలో పండించిన పంటను కొనుగోలు చేసేది లేదని కేంద్రప్రభుత్వం ఖరాఖండిగా చెబుతోంది. అదే సమయంలో మన రాష్ట్రంలో వరి ఉత్పత్తి రికార్డు స్థాయిలో జరిగింది.

ఈ నేపథ్యంలో పండించిన మొత్తం ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. పలుమార్లు ఒత్తిడి తీసుకొచ్చింది. అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తులను కేంద్రం ఏ మాత్రం పరిగణలోకి తీసుకోవడం లేదు. కాగా రాష్ట్రంలోని బిజెపి నేతలు మాత్రం కేంద్రం చెబుతున్నదానికి విరుద్దంగా వరినే పండించాలని రైతులకు విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ వైఖరిపైనే రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర ఆగ్రహంతో ఊగిపోతున్నది. కేంద్రంలోని బిజెపి నేతలు ఒక విధంగా…రాష్ట్రంలోని ఆ పార్టీ నేతలు మరో విధంగా వ్యవహరిస్తూ రైతుల్లో అయోయమాన్ని సృష్టిస్తున్నారని రగిలిపోతున్నది.

ఈ అంశంపైన ప్రస్తుతం దీనిపైనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య మాటల యుద్దం కొనసాగుతోంది. పరస్పరం ఆరోపణలు… ప్రత్యారోపణల పర్వం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ధాన్యం కొనుగోళ్ల అంశం ప్రస్తుతం టిఆర్‌ఎస్, బిజెపిల మధ్య ఉప్పు… నిప్పుగా మారింది. వారి తీరును గర్హిస్తూనే అధికార టిఆర్‌ఎస్ పార్టీ ఈ నెల 12వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల కేంద్రాల్లో పెద్దఎత్తున ధర్నాలను నిర్వహించింది. కాగా దానికి ఒక రోజు ముందు బిజెపి కూడా అన్ని జిల్లాల కలెక్టర్ కార్యాలయాలను ముందు ధర్నాలను చేసింది. ఇలా రెండు పార్టీల మధ్య పోటాపోటీగా కార్యక్రమాలను జరుగుతుండడంతో రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్ల అంశం ప్రస్తుతం హాట్‌టాపిక్‌గా మారింది.

ఇదిలా ఉండగా ధాన్యం కొనుగోళ్లలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపిస్తూ బిజెపి రాష్ట్ర శాఖ అధ్యక్షుడు బండి సంజయ్ సోమవారం తలపెట్టిన నల్గొండ పర్యటన కూడా పూర్తిగా ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. ఆయన పర్యటనను టిఆర్‌ఎస్‌శ్రేణులు అడుగడుగునా అడ్డుకునేందుకు యత్నించారు. దీంతో ఇరుపార్టీల నేతల మధ్య తోపులాటులు చోటుచేసుకున్నాయి. పరిస్థితి అదుపుతప్పి పరిసర్పం దాడులు చేసుకునే వరకు వెళ్లారు. వెంటనే పోలీసులు జోక్యం చేసుకుని ఇరువర్గాలను చెదరగొట్టారు. దీంతో పరిస్థితి అదుపులోకి వచ్చినప్పటికీ… ఉద్రిక్త పరిస్థితుల్లో మాత్రం ఎలాంటి మార్పు కనిపించడం లేదు.

ఈ నేపథ్యంలో తెలంగాణ భవన్‌లో నేడు సిఎం కెసిఆర్ అధ్యక్షతన టిఆర్‌ఎస్ ఎల్‌పి సమావేశం జరుగుతుండడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ సమావేశంలో సిఎం కెసిఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్న విషయంపై రాజకీయ వర్గాల్లో వాడివేడి చర్చ జరుగుతోంది. ముఖ్యంగా ధాన్యంపై కేంద్రంపై పోరు కొనసాగించడానికి అవసరమైన ప్రణాళికలను ఖరారు చేసే అవకాశముందని టిఆర్‌ఎస్ వర్గాల్లో వినిపిస్తోంది. ఈ పోరును మరింత ఉదృతంగా తీసుకెళ్లే విధంగా సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశముందని తెలుస్తోంది. అవసరమైతే ఢిల్లీలోనే టిఆర్‌ఎస్ పక్షాన పెద్దఎత్తున ఆందోళన కార్యక్రమాలను చేపట్టేందుకు వీలుగా సిఎం కెసిఆర్ ఒక నిర్ణయానికి వచ్చే అవకాశముందని తెలుస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News