Home ఎడిటోరియల్ ట్రంప్ ఆంక్షలు చైనాకు వరం!

ట్రంప్ ఆంక్షలు చైనాకు వరం!

Trump administration imposes sanctions on China

ట్రంప్ ఇరాన్ పై ఆంక్షల విషయంలో చెప్పిన మాటలు ఆచరణలో సాధ్యం కాలేదు. మిత్రదేశాల అవసరాలు ఒకవైపు, అమెరికాలో రాజకీయ అవసరాలు మరోవైపు ఈ రెండింటి మధ్య ట్రంప్ ఇరుక్కుపోయాడు. ప్రపంచ చమురు రాజకీయాలను శాసించడం అంత తేలిక కాదని మరోసారి ట్రంప్‌కు అర్థమయ్యింది. ఇరాన్‌ను దారికి తీసుకువస్తానంటూ విధించిన ఆంక్ష ల్లో సడలింపులు ఇవ్వక తప్పలేదు. ఇరాన్ ఆర్ధిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసే ఆర్ధిక ఆంక్షలు ఇప్పుడు నామమాత్రంగా మిగిలిపోయాయి.
అమెరికా తన మిత్రదేశాలకు ఈ విషయంలో మినహాయింపులు ఇచ్చింది. అలాగే చైనాకు కూడా మినహాయింపులు ఇచ్చింది. ఇరాన్ నుంచి ఈ దేశాలు చమురు ఉత్పత్తులు దిగుమతి చేసుకోవచ్చును. వాటిపై ఆంక్షల ప్రభావం ఉండదు. ఇరాన్ పై ఆర్ధిక ఆంక్షలను విధించి, ఇతర దేశాలపై ఒత్తిడి రాజకీయాలు కొనసాగిస్తే ప్రపంచ చమురు మార్కెటు సంక్షోభంలో పడిపోతుందన్న భయాందోళనల నేపథ్యంలో ట్రంప్ వద్ద మరో దారి మిగల్లేదు. అమెరికా కాంగ్రెసుకు మధ్యంతర ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో చివరి నిమిషంలో ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నాడు. ఇరాన్‌పై అత్యంత కఠినమైన ఆంక్షలు మేం విధించాం, కాని చమురు విషయంలో మేం కాస్త నెమ్మదించాలనుకుంటున్నాం, ఎందుకంటే, ప్రపంచంలో చమురు ధరలు ఆకాశాన్నంటే పరిస్థితి రాకూడదని భావించాను అంటూ ట్రంప్ వివరణ ఇచ్చుకున్నాడు. తలచుకుంటే ఇరాన్ చమురు ఎగుమతులు పూర్తిగా స్తంభించేలా చేయగలమని, కానీ, మార్కెట్ కుప్పకూలుతుంది కాబట్టి ఆలా చేయడం లేదని అన్నాడు. ఇరాన్ అణు క్షిపణుల తయా రీ కార్యక్రమాన్ని మధ్యప్రాచ్యంలో సాయుధ పోరాటాలకు సహాయ సహకారాలు మానుకునేలా ఒత్తిడి చేయడానికి ఈ ఆంక్షలు విధిస్తున్నట్లు అమెరికా చెబుతోంది. 2015లో అణుఒప్పందం తర్వాత ఇరాన్ పై ఉన్న ఆంక్షలను ఎత్తేశారు. ట్రంప్ ఈ ఒప్పందం నుంచి వైదొలిగి మళ్ళీ పూర్తిస్థాయిలో ఆ ఆంక్షలను అమలు చేయాలని భావించాడు. ఇరాన్ విషయంలో ఒబామా చాలా మెత్తగ్గా వ్యవహరించారన్నది ట్రంప్ ఆరోపణ. అణు కార్యక్రమాలు మానుకున్నందువల్ల అప్పట్లో ఇరాన్‌కు బిలియన్ల డాలర్లు కూడా ఇవ్వవలసి వచ్చింది.
ఇరాన్‌పై కఠిన వైఖరి అవలంబించడానికి అమెరికా తీసుకున్న చర్యల్లో భాగంగా ట్రెజరీ డిపార్ట్‌మెంట్ 700 ఇరాన్ కంపెనీలు, ఇరానీ పౌరులపై జరిమానాలు విధించింది. అందులో 50 ఇరానియన్ బ్యాంకులు ఉన్నాయి. 200 ఇరానియన్ ఓడలున్నాయి. ఇరాన్ ప్రభుత్వరంగ విమానయాన సంస్థ ఇరాన్ ఎయిర్‌పై, 65 విమానాలపై కూడా ఈ జరిమానాలు విధించారు. ఈ జరిమానాల ఫలితంగా ఈ కంపెనీలకు, వ్యక్తులకు సంబంధించి అమెరికాలో ఉన్న ఆస్తులు, బ్యాంకు ఖాతాలు స్తంభింపజేస్తారు. ఈ కంపెనీలతో, వ్యక్తులతో వ్యాపార లావాదేవీలు అమెరికాలోని కంపెనీలేవీ నిర్వహించరాదు. అమెరికా కంపెనీలే కాదు, ఈ నిషేధిత కంపెనీలతో మరే దేశంలోని కంపెనీలు కూడా వ్యాపార లావాదేవీలు జరపరాదు. అందువల్ల ఇరాన్ నుంచి చమురు దిగుమతి చేసుకునే దేశాలపై కూడా ఈ ఆంక్షల ప్రభావం పడుతుంది. ఈ విధంగా ఇరాన్ చమురు ఆదాయాన్ని దెబ్బతీయాలన్నది ట్రంప్ ఆలోచన. కాని ఇప్పుడు గ్రీస్, ఇండియా, ఇటలీ, జపాన్, దక్షిణ కొరియా, తైవాన్, టర్కీ దేశాలకు వాటితో పాటు చైనాకు మినహాయింపు ఇచ్చారు. ఈ దేశాలు ఇరాన్ నుంచి చమురు దిగుమతి చేసుకోవచ్చు. అయితే చమురు దిగమతులను తగ్గించడానికి ప్రయత్నించాలి. ప్రపంచంలో చాలా పెద్దపెద్ద ఆర్ధిక వ్యవస్థలకు ఇరాన్ చమురు ఆధారం. మరో ప్రత్యామ్నాయమేదీ ఇప్పుడు అందుబాటులో లేదు. ఇరాన్ చమురు లేకపోయినా, ప్రపంచ చమురు మార్కెట్ సంక్షోభంలో పడకుండా చూడాలని, ఒపెక్ దేశాల నుంచి చమురు ఉత్పత్తిని పెంచాలని కూడా ట్రంప్ ప్రయత్నాలు చేశాడు. కాని ఫలించలేదు. ఇరాన్ పై ఒత్తిడి పెంచే ప్రయత్నాలు అనేక దేశాల ఆర్ధిక వ్యవస్థలనే కాదు స్వయంగా అమెరికా ఆర్ధిక వ్యవస్థపై కూడా ప్రభావం వేస్తాయని స్పష్టమైంది. ఇప్పుడు ట్రంప్ మినహాయింపులు ఇచ్చిన దేశాల్లో గ్రీస్, ఇటలీ, టర్కీ దేశాలు నాటో సభ్యదేశాలు. ఆ విధంగా అమెరికాకు సన్నిహిత దేశాలు. జపాన్, దక్షిణ కొరియా దేశాలకు అమెరికాతో రక్షణ ఒప్పందాలున్నాయి. ఉత్తరకొరియాపై ఒత్తిడి పెంచి అణ్వాయుధీకరణను ఆపడంలో ఈ రెండు దేశాలు కీలకపాత్ర పోషిస్తున్నాయి. ఇక ఇండియా విషయానికి వస్తే ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్యం. ఇండో పసిఫిక్ ప్రాంతంలో ఇండియాది కీలకపాత్ర. ఈ దేశాలన్నీ చైనాను కట్టడి చేయడానికి ఉపయోగపడే దేశాలే. ఈ దేశాలన్నీ ఆరునెలల పాటు మినహాయింపులు ఇవ్వాలని కోరాయి. ఈ వ్యవధిలోగా ఇరాన్ చమురు దిగుమతులను తగ్గిస్తామని హామీ ఇచ్చాయి.
ఇరాన్ నుంచి అత్యధికంగా చమురు దిగుమతి చేసుకునే దేశం చైనా. ఇరాన్ నుంచి చైనా చమురు దిగుమతులు ఆపేస్తే ఇరాన్ ఆర్ధిక వ్యవస్థపై తీవ్రమైన ప్రభావం పడుతుంది. చైనా ఇప్పటికే అమెరికాతో వాణిజ్య యుద్ధం కొనసాగిస్తోంది. అమెరికా మినహాయింపులు ఇచ్చినా ఇవ్వకపోయినా చైనా లక్ష్యపెట్టదు. ఇక దక్షిణ కొరియా విషయానికి వస్తే ఇరాన్ చమురు దక్షిణ కొరియా ఆర్ధిక వ్యవస్థకు చాలా అవసరం. ట్రంప్ చెప్పే మాటలకు, చేసే చేతలకు పోలిక లేదని అమెరికాలో విమర్శలు ప్రారంభమయ్యాయి. ఇరాన్‌కు వ్యతిరేకంగా అమెరికాలో బలమైన యూదులాబీ పనిచేస్తోంది. ఈ లాబీ నుంచి తీవ్రమైన విమర్శలు ప్రారంభమయ్యాయి. ఈ విమర్శలకు సెక్రటరీ ఆఫ్ స్టేట్ పాంపియో జవాబిస్తూ, అమెరికా ఆంక్షల వల్ల ఇరాన్ చమురు ఎగుమతులు రోజుకు పదిలక్షల బ్యారెళ్ళకు తగ్గిపోయాయని అన్నాడు. ఇప్పుడు కొన్ని దేశాలకు ఇచ్చిన మినహాయింపులు కేవలం తాత్కాలికమైనవనీ, ఒకసారి మాత్రమే ఈ మినహాయింపులు ఇస్తామని నచ్చచెప్పడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇరాన్ వ్యతిరేక లాబీని నచ్చచెప్పడం అమెరికా రాజకీయాల్లో ట్రంప్‌కు ఇప్పుడు తలకు మించిన భారమైంది.
ఇరాన్‌పై ఆంక్షలు ప్రభావం చూపాలంటే చైనా సహకారం చాలా అవసరం. అమెరికా, ఇరాన్‌ల మధ్య కొట్లాటలో చైనా లాభం పొందుతోంది. ఇరాన్ నుంచి చమురు దిగుమతులను తగ్గించుకుంటామని హామీ ఇచ్చిన దేశాలకే మినహాయింపులు ఇచ్చామని మైక్ పాంపియో అన్నాడు, కాని చైనా అలాంటి హామీ ఇచ్చిందా అంటే ఆయన జవాబీయలేదు. చైనా తదితర దేశాలకు నచ్చచెప్పడానికి అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధులు ప్రపంచమంతా తిరిగారు. చైనా ఈ విషయమై అమెరికాకు ఎలాంటి హామీలు ఇచ్చిందో ఎవరికీ తెలియదు. ఇరాన్ నుంచి చైనా అగష్టులో రోజుకు 8 లక్షల బారెళ్ళ చమురు దిగుమతి చేసుకున్నది. సెప్టెంబరులో ఈ దిగుమతులు 5 లక్షల బారెళ్ళకు తగ్గిపోయాయని కొందరు అంటున్నారు. కాని చైనా అధికారులు మాత్రం ఇరాన్ చమురు దిగుమతులు ఆపే ఆలోచనేదీ తమకు లేదని కుండబద్దలు కొట్టారు. ట్రంప్ ఆంక్షల తర్వాత చైనా చమురు దిగుమతుల కోసం ఇరాన్ ట్యాంకర్లనే ఉపయోగిస్తోంది. తన స్వంత ట్యాంకర్లను వాడడం లేదు.ఆ విధంగా ఆంక్షల ప్రభావం తమ ట్యాంకర్లపై లేకుండా చేసింది. ఆంక్షలను లక్ష్యపెట్టనందువల్ల ఇరాన్ నుంచి చైనాకు భారీ డిస్కౌంటులు లభించాయి. ఇరాన్‌కు చైనా వస్తువులను అధిక ధరలకు ఎగుమతి చేసి ఫ్రీజ్ అయిన ఖాతాల్లోనుంచి ఆ చెల్లింపులు సర్దుబాటు చేసే అవకాశం చైనాకు లభించింది. ట్రంప్ ఇరాన్ పాలసీ చైనాకు లాభిస్తోంది. ట్రంప్ ఇప్పుడు ఇరాన్ విషయంలో ఎలా వ్యవహరించాలో తెలియని స్థితికి చేరుకున్నాడు. చైనా సహకరించకపోతే ఈ ఆంక్షల వల్ల ప్రయోజనమేమీ ఉండదు. చైనా ఒక్కటే కాదు, ఈ విషయం లో ఇండియా సహకారం కూడా అమెరికాకు చాలా అవసరం.

Trump administration imposes sanctions on China

Telangana News