Home అంతర్జాతీయ వార్తలు ట్రంప్ మాజీ పనిమనిషి వ్యాఖ్యలు

ట్రంప్ మాజీ పనిమనిషి వ్యాఖ్యలు

Donald-Trumpవాషింగ్టన్ : అమెరికా అధ్యక్ష పదవికి రిపబ్లిక్ పార్టీ నుంచి పోటీ పడుతున్న డోనాల్డ్ ట్రంప్ వివాదాస్పద వ్యాఖ్యలతో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు ట్రంప్‌కు మరో తలనొప్పి వచ్చి పడింది. ఆయన ఇంట్లో ఒకప్పుడు పనిమనిషిగా పని చేసని ఆంటోనీ సెనెకల్ అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాపై విద్వేషపూరిత వ్యాఖ్యలు చేశాడు. ఒబామాను హతమార్చాలంటూ 84 ఏళ్ల ఆంటోనీ ఆరోపణలు చేశాడు. ఈ మేరకు ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశాడు. ఆంటోనీ ఫేస్‌బుక్ పోస్టింగ్‌పై అమెరికా సీక్రెట్ సర్వీస్ విచారణ చేయనుంది. అమెరికా అధ్యక్షుడు , ఆయన కుటుంబ సభ్యుల భద్రత బాధ్యతను సీక్రెట్ సర్వీస్ చూస్తుంది. ఆంటోనీ వ్యాఖ్యలపై పూర్తిస్థాయి విచార చేస్తామని సీక్రెట్ సర్వీస్ ప్రతినిధి రాబర్ట్ హోబక్ వెల్లడించారు. ఆంటోనీ వ్యాఖ్యలను అతని ఫేస్‌బుక్ పాలోవర్లు చదవడం, ఇవి బహిరంగం కావడంతో సోషల్ మీడియాలో సంచలనం రేపింది. మదర్ జోన్స్ పత్రికలో ఈ వార్త రావడంతో దుమారం రేగింది.ఈ వ్యాఖ్యలను తానే రాశానని, ఒబామాను హతమార్చాలన్న వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నాని ఆంటోని స్పష్టం చేసినట్లు ఆ పత్రిక వెల్లడించింది. అయితే ఆంటోనీ వ్యాఖ్యలను ట్రంప్ శిబిరం ఖండించింది. ఆయన కొన్నేళ్ల నుంచి ట్రంప్ వద్ద పని చేయడం లేదని స్పష్టం చేసింది. ఒబామాపై ఆంటోనీ చేసిన వ్యాఖ్యలతో తమకు ఏమాత్రం సంబంధం లేదని ట్రంప్ ప్రతినిధి ఒకరు తెలిపారు. ప్లోరిడాలోని ట్రంప్ ఇంట్లో 17 ఏళ్ల పాటు ఆంటోనీ పని చేశాడు. రిపబ్లిక్ పార్టీ తరపున అభ్యర్థిగా ట్రంప్ బరిలో నిలవకముందే ఆయన పని మానేశాడు. ఆంటోనీ వ్యాఖ్యలపై వైట్ హౌస్ నుంచి ఎలాంటి ప్రకటన వెలువడలేదు. ఆంటోనీ గతంలో కూడా ఒబామాను ఉద్దేశించి విద్వేషపూరిత వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.