Search
Saturday 22 September 2018
  • :
  • :

కిమ్ – ట్రంప్ చర్చలు ఓకే

ఉత్తర కొరియాలో అమెరికా బృందం

Trump

వాషింగ్టన్ : ఉత్తర కొరియా అధినేత కిమ్‌తో చర్చల పట్ల అమెరికా అధ్యక్షులు ట్రంప్ సుముఖత వ్యక్తం చేశారు. ప్రస్తుతం తమ ప్రతినిధి బృందం ఒకటి ఉత్తర కొరియాలో ఉందని, కిమ్‌తో శిఖరాగ్ర సదస్సుకు చర్చలు జరుపుతోందని సోమవారం ట్రంప్ వెల్లడించారు. తొలుత అనుకున్న దాని ప్రకారం జూన్ 12న సింగపూర్‌లో ట్రంప్ కిమ్ సమ్మిట్ జరగాలి. అయితే ఇటీవలే కిమ్‌తో చర్చల ప్రసక్తి లేదని ట్రంప్ ప్రకటించారు. ఈ దశలోనే ఉత్తర కొరియా తమ దేశంలో అణు పరీక్షల కేంద్రాన్ని నిర్మూలించింది. చర్చలకు తాము సానుకూలంగా ఉన్నట్లు తెలియచేసుకుంది. గురువారం నాడే ట్రంప్ తాము చర్చలకు వెళ్లేది లేదని తెలిపారు. కానీ ఇప్పుడు మనసు మార్చుకుని అంతా సవ్యంగా జరుగుతుందని చెప్పారు. దీనితో జూన్ 12 నాటి చర్చలపై తిరిగి ఆశలు చిగురించాయి. కొన్ని రెచ్చగొట్టే ప్రకటనలతో చర్చలకు బ్రేక్ పడినట్లు ట్రంప్ తెలిపారు.

అయితే తమ దేశ బృందం ఒకటి ఇప్పుడు ఉత్తర కొరియాలో ఉందని , సమ్మిట్ సజావుగా సాగే విషయంలో చర్యలు తీసుకొంటోందని వివరించారు. అయితే ఇటీవలే ట్రంప్ ఆకస్మికంగా దక్షిణ కొరియా అధ్యక్షులు మూన్‌తో భేటీ కావడం సమ్మిట్ పునరుద్ధరణకు దారితీసిందని భావిస్తున్నారు. ప్రస్తుతం ఉత్తర కొరియాలో ఉన్న అమెరికా బృందంలోని వారి పేర్లను ట్రంప్ వెల్లడించలేదు. దక్షణ కొరియాలో గతంలో అమెరికా రాయబారిగా ఉన్న సంగ్ కిమ్ ట్రంప్ ప్రతినిధి వర్గం నాయకుడిగా పంపించినట్లు వాషింగ్టన్ పోస్టు పత్రిక వెల్లడించింది. ప్రస్తుతం సంగ్ కిమ్ ఫిలిప్పీన్స్‌లో అమెరికా రాయబారిగా ఉన్నారు. సమ్మిట్‌కు సన్నాహాల కోసం ఆయనను ఉత్తర కొరియాకు పంపించినట్లు పత్రికలో వార్త వెలువడింది. అణ్వాయుధాల అంశంపై అమెరికా, ఉత్తర కొరియా మధ్య తీవ్రస్థాయిలో గత ఏడాది ప్రచ్ఛన్న యుద్ధం వాతావరణం నెలకొంది. క్రమేపీ జరిగిన పరిణామాలు, ఉత్తర కొరియా, దక్షిణ కొరియా నేతల కీలక చర్చలు , ట్రంప్ నుంచి కూడా సంప్రదింపులకు సానుకూలత వ్యక్తం కావడంతో చివరికి జూన్ 12న కీలక సమ్మిట్‌కు దారితీసింది.

Comments

comments