Home ఎడిటోరియల్ మోడీకి ఇదో సదవకాశం

మోడీకి ఇదో సదవకాశం

Article about Modi china tour

అవ్వ బువ్వ రెండూ కావాలంటే కుదరదంటూ అమెరికా భారత్‌ను హెచ్చరిస్తున్నది. భారత్ రక్షణ వ్యవస్థను తమ చెప్పుచేతల్లో ఉంచుకునే విధంగా భారత్‌పై ఒత్తిడి పెంచుతున్న అమెరికా, మీకు మేము కావాలో రష్యా కావాలో తేల్చుకోండని హెచ్చరిస్తున్నది. రష్యా నుంచి ఐదు ఎస్400 ట్రింఫ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ కొనుగోలును భారత్ తలపెట్టటం అమెరికాకు ఆగ్రహం తెప్పించింది. వాటిని కొనే పక్షంలో ఆంక్షలు విధిస్తామని బెదిరిస్తున్నది. రష్యాతో గణనీయమైన రక్షణ సహకారం కలిగిఉన్న దేశాలపై ఆంక్షలు విధించేందుకు వీలు కల్పించిన 2017 నాటి ‘ఆంక్షల చట్టం ద్వారా అమెరికా ప్రత్యర్థులను ఎదుర్కోవటం (సిఎఎటి)’ అనే చట్టాని భారత్‌కు గుర్తు చేస్తున్న ది. క్రిమియాను రష్యాలో కలుపుకోవటం, ఉక్రేన్‌పై దాడిని కారణంగా చూపి రష్యాపై అమెరికా ఆర్థిక ఆంక్షలు విధించినందున ఆ దేశం నుంచి ఆయుధ వ్యవస్థల కొనుగోలు పుతిన్ ప్రభుత్వానికి మేలు చేస్తుందని అది పైకి చెబుతున్న కారణం. సిరియా యుద్ధంలో అమెరికా, ఇజ్రాయిల్ జోక్యాన్ని వ్యతిరేకిస్తూ రష్యా తిరిగి అంతర్జాతీయ శక్తిగా ముందుకు రావటం, రష్యా, చైనా, భారత్ సన్నిహితం కావటం అమెరికాకు మింగుడు పడటం లేదు. వాస్తవానికి, డోనాల్డ్ ట్రంప్ అధికారం చేపట్టాక ‘అమెరికా ఫస్ట్’ పేరుతో స్వయం రక్షణవాదం (ప్రొటెక్షనిజం) తో ప్రపంచీకరణను తమ ప్రయోజనాలకు విరుద్ధంగా ఉన్న మేరకు తిరస్కరించటం, వాణిజ్య యుద్ధాలు మొదలుపెట్టటం, 196 దేశాలు సంతకాలు చేసిన పర్యావరణ పరిరక్షణ ఒప్పందం నుంచి, ఇరాన్ అణు కార్యక్రమంపై అంతర్జాతీయ ఒప్పందం నుంచి ఉపసంహరించుకోవటం వంటి ఏకపక్ష చర్యలే రష్యా, చైనా, భారత్‌లను సన్నిహితం చేశాయి. రష్యా, ఇరాన్‌లపై ట్రంప్ ఆంక్షలు విధించారు కాబట్టి ఆ దేశాలతో వ్యాపార, వాణిజ్యం నెరిపే దేశాలు కూడా ఆ ఆంక్షలను పాటించాలన్న హుకుంతో అమెరికా ఇతర దేశాల సార్వభౌమత్వంలోకి, స్వయం నిర్ణయాధికార స్వేచ్ఛలోకి చొరబడుతున్నది. ఏ దేశంపైనైనా ఐక్యరాజ్య సమితి విధించే ఆంక్షలు శిరోధార్యం తప్ప అమెరికా ఏకపక్షంగా విధించే ఆంక్షలను శిరసావహించాల్సిన పనిలేదు.
ఉవాన్‌లో చైనా అధ్యక్షుడు క్సీ జిన్‌పింగ్‌తో, సోచీలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో భారత ప్రధాని నరేంద్ర మోడీ ముఖాముఖీ ఇష్టాగోష్టి చర్చలు ఈ నేపథ్యంలో ప్రాధాన్యత సంతరించుకున్నాయి. చైనాకు వ్యతిరేకంగా భారత్‌ను ఉపయోగించుకోవాలనే అమెరికా వ్యూహాన్ని తిరస్కరిస్తున్నట్లుగా, ‘ప్రగతి, ఆర్థికాభివృద్ధిలో భారత్ చైనా భాగస్వాములు’గా ముందుకు సాగాలని ఉవాన్‌లో అంగీకారం కుదిరింది. విభేదాలకన్నా సారూప్యతలే ఎక్కువ ఉన్నాయని క్సీ మోడీ ఏకీభావానికి వచ్చారు.
రష్యా చైనా భారత్ సహకారం పెంపొందించుకోవటానికి అనువైన మరోవేదిక ‘షాంఘై సహకార సంస్థ (ఎస్‌సిఒ). ప్రస్తుతం చైనాలోని క్వింగ్‌డావోలో జరుగుతున్న ఎస్‌సిఒలో భారత్, పాకిస్థాన్‌లు తొలిసారి పూర్తి సభ్యత్వ హోదాతో పాల్గొంటున్నాయి. మధ్య ఆసియా రిపబ్లిక్‌లైన కజక్‌స్థాన్, ఉబ్బెకిస్థాన్, కిర్ఘీజిస్థాన్, తజకిస్థాన్ ఇతర సభ్యదేశాలు. రాజకీయ వ్యవస్థల్లో భిన్నత్వం ఉన్నప్పటికీ సమ్మిళితం, సహకారం ఎస్‌సిఒ ధ్యేయం.
చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్, రష్యా అధ్యక్షుడు పుతిన్‌లతో గత మాసపు చర్చలను కొనసాగించేందుకు ప్రధాని మోడీకి ఇది మరో అవకాశం. భారత్‌కు అమెరికా బెదిరింపులను ఈ నేపథ్యంలో చూడవలసి ఉంటుంది. కొద్ది వారాల క్రితం ఢిల్లీ వచ్చిన అమెరికా ముఖ్య అధికారిణి టినా కైడానోవ్, రష్యా నుంచి ఆయుధాలు కొంటే ఆంక్షలు తప్పవని హెచ్చరించింది. అలాగే పెండింగ్‌లో ఉన్న రెండు ప్రాథమికమైన రక్షణ ఒప్పందాలపై సంతకాలు చేయాలని కోరింది. జపాన్‌లాగా భారత్‌ను అమెరికా అంతర్జాతీయ భద్రతా వ్యవస్థలోకి లాగే ఈ ఒప్పందాల్లోని క్లాజులతో భారత్ విభేదిస్తున్నది. వీటిపై జులై ఆరంభంలో వాషింగ్టన్‌లో జరిగే 2–+2 సంభాషణ (ఇరు దేశాల రక్షణ, విదేశాంగ మంత్రుల మధ్య) కీలకం. రష్యా నుంచి ఎస్400 ఒప్పందం తప్పక చర్చకు వస్తుంది. తమ రక్షణ అవసరాలకు ఉత్తమమని ఎంచుకున్న ఆయుధ వ్యవస్థలను ఏ దేశం నుంచైనా కొనుగోలు చేసేందుకు తమకు గల స్వేచ్ఛను భారత అధికారులు అమెరికన్‌లకు కరాఖండీగా చెప్పగలిగితేనే దేశ ప్రతిష్ట నిలబడుతుంది. ట్రంప్‌ను అతిగా నమ్మిన మోడీకిది విదేశాంగ విధానంలో పరీక్షా సమయం.