Home ఎడిటోరియల్ అన్ని రహదారులూ రష్యా వైపు

అన్ని రహదారులూ రష్యా వైపు

Trump withdraws from the Iran nuclear deal

రష్యా అధ్యక్షుడు పుతిన్‌ను కలుసుకోవటానికి భారత ప్రధాని నరేంద్ర మోడీ కొద్ది రోజుల క్రితం రష్యన్ విశ్రాంతి కేంద్రం సోచీ వెళ్లారు. ఆయనొక్కడే ఆ పని చేయలేదు. ప్రపంచ నాయకులు అనేకమంది రష్యాకు, సైంట్ పీటర్స్‌బర్గ్‌లో దాని వార్షిక ఆర్థిక వేదికకు క్యూ కడుతున్నారు. సోచీ, సైంట్ పీటర్స్ బర్గ్ ఈ వారం ఒక విధంగా ప్రపంచానికి కేంద్ర స్థానమైనాయి. రష్యన్ ఆధునిక జార్ నుంచి తోడ్పాటు లేదా ఓదార్పు పొందటానికై వివిధ దేశాల నేతలు ఈ వారం ఆ రెండు కేంద్రాలు చేరుకుంటున్నారు. అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ జపాన్ ప్రధాని షింజో అబేను కలుసుకున్నారు. ఈ వారంలో జరిగే సైంట్ పీటర్స్‌బర్గ్ అంతర్జాతీయ ఆర్థిక ఫోరం (ఎస్.పి.ఐ.ఇ.ఎఫ్) సమావేశానికి ఆయన గౌరవనీయ అతిథిగా వస్తున్నారు. స్పీయిఫ్, సూక్ష్మంగా, పశ్చిమ ప్రపంచానికి చెందిన దావోస్‌కు రష్యన్ ప్రతిరూపం. స్పీయిఫ్‌ను ప్రారంభించిన నాటి నుంచి అది రష్యా ఆర్థిక, పెట్టుబడుల అవకాశాల ప్రదర్శన వేదికగా పని చేస్తున్నది. అయితే అది ట్రంప్ అధ్యక్ష పదవి చేబట్టాక ఈ సంవత్సరం ప్రపంచ నాయకులు కలుసుకునేందుకు దౌత్యవేదిక అయింది. ట్రంప్ విధానాలు దేశాలను వేరు చేస్తున్నందున, వారు మరోసారి రష్యా చేరుతున్నారు. అది కొద్దికాలం క్రితం వరకు పశ్చిమ దేశాల్లో చాలా వాటికి అంటరానిదిగా ఉండింది.
ఇరాన్‌తో ఐదు దేశాల అణు ఒప్పందాన్ని రద్దు చేసుకున్న ట్రంప్ నిర్ణయం తదుపరి స్పీయిఫ్ వారికి వేదిక కల్పించింది. అణు ఒప్పందం రద్దు ప్రమాదం కొంత కాలంగా ఉన్నప్పటికీ, ట్రంప్ ఇంతత్వరగా ఒప్పందం నుంచి తప్పుకుంటాడని, ఇరాన్‌పై తిరిగి ఆంక్షలు విధిస్తాడని ప్రపంచ నాయకులు ఊహించలేదు. దీర్ఘకాలం పాటు, కఠినమైన సంప్రదింపుల తదుపరి ఇరాన్‌తో ఒప్పందం జరిగింది. అమెరికా, రష్యా, చైనా, ఫ్రాన్స్, జర్మనీ భాగస్వాములు. ఇరాన్ అణు కార్యక్రమాన్ని నిరోధించటానికి ఉత్తమ అవకాశంగా ఆ ఒప్పందాన్ని వారు పరిగణించారు. ఇరాన్ ఒప్పందం నుంచి అమెరికా తప్పుకున్న తదుపరి అది ఇరాన్‌పైనే గాక దానితో వాణిజ్య సంబంధాలున్న దేశాలన్నిటిపై ఆంక్షలు మొదలుపెట్టటం చికాకుగా తయారైంది. అది చాలా ఇబ్బందికరం. యూరోపియన్ యూనియన్ దాన్ని వ్యతిరేకించింది. అమెరికా ఆంక్షలు భౌగోళిక పరిధిని దాటాయని చెబుతూ, వాటిని గుర్తించటానికి ఇ.యు. నిరాకరించింది. బ్యాంకుల మధ్య స్విఫ్ట్ (ఎస్.డబ్లు.ఐ. ఎఫ్.టి.) నెట్‌వర్క్ నుంచి (ఇది బెల్జియం కేంద్రంగా పని చేస్తుంది) ఇరాన్‌ను మినహాయించే విషయం తీవ్ర వివాదంగా మారింది.
దాంతోపాటు, ఇరాన్‌తో గతం నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తున్న యూరోపియన్ కంపెనీలు కూడా ఆంక్షల ఛత్రం కిందకు వస్తున్నాయి. ఇరాన్‌లో తమ పెట్టుబడులు నిలుపు చేస్తున్నట్లు, కొన్ని ప్రస్తుత కార్యకలాపాల నుంచి వైదొలుగుతున్నట్లు ఫ్రెంచి ప్రధాన ఆయిల్ కంపెనీ టోటిల్ ఇప్పటికే ప్రకటించింది. అనేక ఇతర యూరోపియన్ కంపెనీలు కూడా అదే పరిస్థితి ఎదుర్కొంటున్నాయి. ప్రతికూల ప్రభావాలు గమనించిన యూరప్ దేశాలు అమెరికా ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నాయి. ఈ పరిణామాలు రెండవ ప్రపంచ యుద్ధానంతరం యూరప్‌లో భద్రతా ఏర్పాటుకు హాని చేస్తున్నాయి. నాటోకు ఇంతవరకు నేరుగా దెబ్బతగలలేదు, అయితే చేటు సంభవమే. అమెరికాతో భవిష్యత్‌లో పెరిగే దూరం దృష్టా తమ సొంత రక్షణపాటవాన్ని అభివృద్ధి చేసుకోవటం గూర్చి యూరప్ మాట్లాడుతున్నది. ఈ ఆర్థిక, వ్యూహాత్మక వాతావరణంలో రష్యా ఆకర్షణీయత పెరిగింది. సైంట్ పీటర్స్‌బర్గ్ ఆర్థిక వేదిక ఎంతో అనువైన సమయంలో వచ్చింది. ఫ్రాన్స్ జాతీయ బాస్టిల్లి డే సమయంలో, వేడుకలతో డోనాల్డ్ ట్రంప్‌ను ఖుషీ చేసిన ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయిల్ మక్రాన్ ఆ తర్వాత వాషింగ్టన్ సందర్శించారు. ట్రంప్‌తో కొన్ని హేతుబద్ధమైన వాదనలతో ఇరాన్ ఒప్పందాన్ని కాపాడగలననుకున్న ఆయన ఆశలు అడియాసలైనాయి. ట్రంప్‌తో స్నేహం విశ్వసనీయంకాదని రుజువు కావటంతో మక్రాన్ ఇప్పుడు సైంట్ పీటర్స్‌బర్గ్ వెళ్లి జపాన్ ప్రధాని షింజో అబేతో పాటు స్పీయిఫ్ వేదిక అలంకరించబోతున్నారు. ఈ ఎత్తుగడలకు ద్విముఖ ప్రయోజనాలున్నాయి. క్రిమియాపై దండెత్తి దాన్ని తమ దేశంలో కలుపుకున్న రష్యాపై కూడా అమెరికా ఆంక్షలు విధించింది, అప్పుడు యూరప్ అమెరికా చర్యను బలపరిచింది. అమెరికా వాటిని కొనసాగిస్తూ ఇటీవల అదనపు ఆంక్షలు విధించింది. అంతర్జాతీయ వ్యాపారం చేస్తున్న రష్యన్ కంపెనీలు కూడా ఆంక్షలకు గురైనాయి. రష్యన్ ప్రధాన అల్యూమినియం కంపెనీ రూసల్ వాటిలో ఒకటి.ఇరాన్, రష్యాలపై అమెరికా ఇప్పుడు ఉదారంగా ఆంక్షలు విధించింది. వాటిపైనే కాదు, వాటితో వ్యాపారం చేసే దేశాలకు ఆంక్షలు వర్తిస్తాయి. ఇవి బెడిసికొడుతున్నాయి. ఆ రెండు దేశాలను శిక్షించటమేగాక అనేక దేశాల ప్రయోజనాలను అవి దెబ్బకొడుతున్నాయి. మనం ఇరాన్ నుంచి ఆయిలు తీసుకోకూడదు, రష్యా నుంచి అల్యూమినియం కొనకూడదు. ఎందుకంటే ఆంక్షలకుగురైన రష్యన్ కార్పొరేట్లకు వాటిలో వాటాలో, ప్రయోజనాలో ఉన్నాయి! అమెరికా ఆంక్షల ప్రభావానికి లోనయ్యే దేశాలు, వాటి ఆర్థిక సంస్థలు అమెరికాతో నిమిత్తం లేకుండా వ్యవహరించే యంత్రాంగాన్ని త్వరలో ఏర్పాటు చేసుకుంటే అది అమెరికాను, దాని అంతిమ వ్యూహాత్మక లక్షాలను దెబ్బతీస్తుంది. ఎందుకంటే, ఏ ప్రమాణంతో చూసినా ఇయు, చైనా, రష్యా ఆర్థికంగా, దౌత్యపరంగా శక్తిమంతమైనవి. అవి ఈ అన్ని సమస్యలపై అమెరికాను వ్యతిరేకిస్తున్నాయి. సైంట్ పీటర్స్‌బర్గ్‌లో జపాన్, ఫ్రెంచి అధ్యక్షులు, చైనా విదేశాంగమంత్రి హాజరు ఇందుకొక సూచన. భారత ప్రధాని మోడీ సోచీలో పుతిన్‌ను విడిగా కలిసి వచ్చారు.
స్విఫ్ట్
ప్రపంచ వ్యాప్తంగా బ్యాంకుల మధ్య నిధుల బదలాయింపుకు సంబంధించిన ఒక ఉదాహరణను చూదాం. బ్యాంకుల మధ్య పరస్పరం నిధుల బదలాయింపు మోకానిజం స్విఫ్ట్ (ఎస్.డబ్లు.ఐ. ఎఫ్.టి)లో ఇరాన్ లోగడ సభ్యురాలు. అది అణు కార్యక్రమం మొదలుపెట్టాక దాన్ని బయటకు పంపారు. అణు ఒప్పందం కుదిరాక తిరిగి చేర్చుకున్నారు. ఇప్పుడు అమెరికా దాన్నుంచి ఉపసంహరించుకుని ఇరాన్‌తో ఆర్థిక సంబంధాలపై ఆంక్షలు విధించింది. ఇరాన్‌తో ఆర్థిక లావాదేవీలు నడిపే ఏ బ్యాంక్‌కైనా ఈ ఆంక్షలు వర్తిస్తాయి. స్విఫ్ట్‌లో కొనసాగుతున్న ఇరాన్ సభ్యత్వం ఇప్పుడు సమస్య అయింది. వాస్తవానికి, ప్రస్తుత పునః పొందిక పుతిన్‌కు వరమైంది. పుతిన్ ఉక్రెన్‌పై దాడిచేసి క్రిమియాను స్వాధీనం చేసుకున్నాక రష్యా అంటరాని రాజ్యమైంది. యూరప్ దేశాలు దాని చర్యలను స్థూలంగా ఖండించాయి. ఇతర దేశాలు కూడా అటువంటి బరితెగించిన రష్యన్ ఉల్లంఘనను తటపటాయింపులతో నిరసించాయి. అమెరికా, యూరప్ రష్యాపై ఆర్థిక ఆంక్షలు విధించాయి. అవి రష్యన్ ఆర్థిక వ్యవస్థను కృంగదీశాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడ్ ఆయిలు ధరలు తగ్గుదల దానికి తోడై ఆయిలు ఆదాయంపై ఆధారపడిన రష్యన్ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసింది. ఇటీవల ఎన్నికల ప్రచారంలో పుతిన్ వక్కాణింపు అంతా ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించటం, సామాన్య రష్యన్‌ల జీవన ప్రమాణాలు పెంచటం. రష్యాను అదృష్టం వరించింది. ఆయిలు ధరలు పెరుగుతూ ఖజానా నింపుతున్నాయి. ఆయిలు మీదే ఆధారపడకుండా ఆర్థిక వ్యవస్థను బహుముఖీయం చేస్తానని పుతిన్ వాగ్దానం చేశాడు. అమెరికా అధ్యక్షుడిగా డోనాల్డ్ ట్రంప్ గెలుపు కూడా రష్యాకు అత్యంత అనుకూల పరిణామంగా కనిపిస్తున్నది. ఆయన ఎన్నికైన నాటి నుంచి ఇరాన్ ఒప్పందంపై, జెరూసలెంలో రాయబార కార్యాలయం, వాణిజ్యంపై ఆయన ప్రకటనలు అత్యంత శక్తిమంతమైన యూరప్, చైనాలను అమెరికాకు దూరం చేస్తున్నాయి. అత్యంత ముఖ్యమైన ప్రాథమిక సమస్యలు కొన్నింటిని ముందుకు తెస్తున్న ట్రంప్, అతి స్వల్ప కాలంలో అనేక రణ క్షేత్రాలను తెరిచినట్లు కనిపిస్తున్నది. మారుతున్న ప్రపంచ భౌగోళిక వ్యూహాత్మక దృశ్యంలో ప్రధాన లబ్ధిదారు రష్యాగా కనిపిస్తున్నది. అది ఇబ్బందుల నుంచి బయటపడుతున్నది. సైంట్ పీటర్స్‌బర్గ్ అంతర్జాతీయ ఆర్థిక ఫోరంకు హాజరవుతున్నవారి జాబితాయే ఇందుకు నిదర్శనం.