Home రాష్ట్ర వార్తలు కృష్ణమ్మకు వందనం

కృష్ణమ్మకు వందనం

1

రెండవ రోజు రెండింతలైన పుష్కర రద్దీ

హైదరాబాద్ : కృష్ణా పుష్కరాలకు క్రమేపీ రద్దీ పెరుగు తున్నది. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పలు కార్యక్రమాలతో వసతిసౌకర్యాలు కొంతమేర సజావుగా ఉందన్న ప్రచారం, దీనికి తోడు రవాణా వ్యవస్థ కూడా ప్రజలకు తగిన విధంగా బస్సులు,మరో వైపు రైళ్ళను అందుబాటులోకి తేవడంతో భక్తులు పుష్కరాలకు వెళ్ళేందుకు ఉత్సుకతను ప్రదర్శిస్తున్నారు. తొలి రోజు మహిళలకు అత్యంత ప్రీతిపాత్ర మైన శ్రావణ శుక్రవారం కావడంతో లక్ష్మీదేవి వ్రతానికే ప్రాముఖ్యతను ఇచ్చారు. దీంతో ప్రభుత్వం అనుకున్న మేర రద్దీ లేకుండా పోయింది. ఇక రెండవ శనివారం, ఆదివారం,పంద్రాగస్టులను పురస్కరించుకుని వరుసగా మూడు రోజుల పాటు సెలవుదినాలు కావడంతో శనివారం నుంచి ఘాట్ల వద్ద భక్తుల తాకిడి పెరిగిపోయింది.దీనికి తోడు ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తుల రాక మొదలయింది. తెల్లవారుఝాము నుంచే భక్తులు పుణ్యస్నానాల కార్యక్రమం మొదలయింది. మహబూబ్ నగర్ జిల్లా కొల్లాపూర్ మండలంలోని సోమశిల ఘాట్ తో పాటు ఇతర ఘాట్లలో సాయంత్రం నాలుగు గంటల ప్రాంతానికి సుమారు 75 వేల మంది వరకు భక్తులు పుణ్యస్నానాలు ఆచరించినట్లు అధికారులు నమోదు చేశారు.రాత్రి వరకు ఈ సంఖ్య లక్షగా నమోదు కావచ్చునని అధికారులు అంచనావేసారు. నల్లగొండ జిల్లా దామరచర్ల మండలంలోని మరో ప్రధాన వాడపల్లి తదితర 10 ఘాట్లలో మధ్యాహ్నం వరకు 36 వేల మంది భక్తులు స్నానాలు ఆచరించినట్లు అధికారులు నమోదు చేశారు.సాయంత్రానికి ఈ సంఖ్య 50 నుంచి 60 వేలకు చేరుకోవచ్చునని అంచనావేసారు.ఇక శుక్రవారం ముఖ్యంత్రి కె. చంద్రశేఖర్ రావు పుష్కరాలను ప్రారంభించిన గొందిమళ్ల వద్ద శనివారం ఉదయం 10 గంటలకే 60 వేల మంది భక్తులు స్నానాలు ఆచరించినట్లు అధికారులు రికార్డు చేశారు. ఇప్పటికే నల్లగొండ,మహబూబ్ నగర్ జిల్లాల్లోని ఘాట్లకు చేరుకునేందుకు హైదరాబాద్ నగరం నుంచి బయలుదేరిన వందల సంఖ్యలో ఆర్‌టిసి బస్సులు, ప్రైవేటు వాహనాలతో ఇరు మార్గాల్లోని టోల్ గేట్ల వద్ద భారీగా వాహనాలు నిలిచిపోయాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఇప్పటికే టోల్ వసూలు నిలిపివేసి వాహనాలను వదలాలని ఇచ్చిన ఉత్తర్వులను టోల్ సిబ్బంది ఖాతరు చేయడంలేదన్న వార్తలు వస్తున్నాయి. దీనిపై ఆయా టోల్ గేట్ల వద్ద వాహన రవాణాను క్రమబద్దీకరించేందుకు ఉన్న పోలీసులు కూడా తమకు ఎటువంటి ఆదేశాలు అందలేదనే చెపుతున్నారు. దీన్నిబట్టి ఆది, సోమవారాల్లో ఘాట్లకు లక్షల్లో భక్తులు చేరుకునే అవకాశం ఉందని అధికార వర్గాలు వెల్లడిస్తున్నాయి. కాగా శనివారం మహబూబ్ నగర్ జిల్లాలోని కృష్ణా రైల్వే బ్రిడ్జి, గుడివల్లూరు పుష్కర ఘాట్‌లను మంత్రి లకా్ష్మరెడ్డి సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. అదే విధంగా మరో మంత్రి జూపల్లి కృష్ణారావు సోమశిల,రంగాపూర్, గొందిమల్ల,బీచుపల్లి ఘాట్లను సందర్శించగా, రంగాపూర్ పుష్కర ఘాట్‌ను ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు ఎస్. నిరంజన్ రెడ్డి, గొందిమళ్ల పుష్కర ఘాట్‌ను రవాణా శాఖ కమీషనర్ సందీప్ కుమార్,ఐజి శ్రీనివాస్ రెడ్డితో సహ కలెక్టర్ టికె శ్రీదేవి,జిల్లా ఎస్‌పి రెమా రాజేశ్వరి వివిధ పుష్కర ఘాట్లను సందర్శించి పుష్కర ఏర్పాట్లను పరిశీలించారు.ఎస్‌పి రెమా రాజేశ్వరి బీచుపల్లి వద్ద సాయంత్రం కృష్ణమ్మకు సమర్పించిన నదీ హారతి కార్యక్రమంలో పాల్గొన్నారు. మహబూబ్ నగర్ జిల్లాలోని బీచుపల్లి,రంగాపూర్, కృష్ణ, సోమశిల, పస్పుల ఘాట్ల వద్ద కూడా వేలాది మంది భక్తులు హాజరయ్యారు.
నల్లగొండలో పోటెత్తిన భక్తులు
నల్లగొండ జిల్లాలో కూడా రద్దీ శుక్రవారం కన్నా అధికంగా నమోదయింది. జిల్లాలోని ప్రధాన ఘాట్లయిన వాడపల్లి, మట్టపల్లి, నాగార్జున సాగర్ కు అధిక సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. అయితే జిల్లాలో నేడు ఎండ తీవ్రత అధికంగా ఉండడం మూలంగా ఇటు భక్తులు అటు విధులు నిర్వహిస్తున్న సిబ్బందితోపాటు పురోహితులు నానా ఇబ్బందులు ఎదుర్కున్నారు. పిండప్రదానాలు చేసేందుకు కనీసం టెంట్లు ఏర్పాటు చేయకపోవడం వల్ల ఎండల్లోనే కార్యక్రమాలు నిర్వహించాల్సి వచ్చింది. శనివారం హైదరాబాద్ నగరం నుంచి విధుల నిర్వహణకు వాడపల్లి వచ్చిన ఒక కానిస్టేబుల్ ఎండదెబ్బకు గురికావడంతో ఆయనకు వైద్య ఆరోగ్య శాఖ స్థానికంగా ఏర్పాటు చేసిన వైద్య శిబిరంలో చికిత్సనందించారు.ఇక నల్లగొండ సమీపంలోని పానగల్లు వద్ద ఏర్పాటు చేసిన ఘాట్ వద్ద విద్యుత్ షాక్‌కు గురై తమిళనాడులోని శివగంగ జిల్లాకు చెందిన పెరుమాళ్ళు(52) మృత్యువాత పడ్డారు. సాగర్‌లోని శివాలయ ఘాట్ వద్ద భక్తులు మంచినీటి కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవలసి వచ్చింది. పుష్కర ఘాట్లకు వచ్చే భక్తులకు అనుగుణంగా ఏర్పాట్లు లేవన్న ఆరోపణలు ఈ జిల్లాలో వినిపిస్తున్నాయి. జిల్లాలోని 8 పుష్కర ఘాట్లకు నీరు చేరుకోకపోవడంతో షవర్ బాత్‌ను ఏర్పాటుచేయగా స్నానాలు ఆచరించేందుకుత భక్తులు అనాసక్తిని కనబరిచారు. కాగా కాసరాజుపల్లి,పెద్దమునిగల్, అజ్మాపురం, ఉట్లపల్లి, పొట్టిచెల్మ, బుగ్గమాదారం, వజినేపల్లి, పుష్కర ఘాట్లు జనం లేక వెలవెలబోతున్నాయి. పుష్కర స్నానాల తీరు తెన్నులను అడిషనల్ డీజీ అంజన్ కుమార్, డిజి అకున్ సబర్వాల్ హెలికాప్టర్‌లో ఏరయల్ సర్వే చేశారు.