Home తాజా వార్తలు 17న వైజాగ్‌లో టిఎస్‌ఆర్ నేషనల్ ఫిల్మ్ అవార్డుల ప్రదానం

17న వైజాగ్‌లో టిఎస్‌ఆర్ నేషనల్ ఫిల్మ్ అవార్డుల ప్రదానం

 

‘కళాకారులకు జాతీయ స్థాయిలో ఫిల్మ్ అవార్డులను ఇవ్వాలని పదేళ్ల క్రితం నాకు ఓ ఆలోచన వచ్చింది. ప్రజాభిప్రాయం మేరకు ఈ అవార్డులను అందించాలని భావించాను. ప్రజాభిప్రాయ సేకరణకు టివి9తో కలిసి ‘టిఎస్‌ఆర్ టివి9 నేషనల్ ఫిల్మ్ అవార్డ్’ను అందజేస్తున్నాను”అని కళాబంధు, అవార్డుల కమిటీ ఛైర్మన్ టి.సుబ్బరామిరెడ్డి అన్నారు. 2017, 2018 సంవత్సరాలకుగాను ఈ అవార్డులకు ఎంపికైన వారి వివరాలను ఆయన తెలియజేశారు. హైదరాబాద్‌లో ఏర్పాటైన విలేకరుల సమావేశంలో టి.సుబ్బరామిరెడ్డి మాట్లాడుతూ “ఈ అవార్డ్ ఫంక్షన్‌ను ఈనెల 17న వైజాగ్‌లోని పోర్ట్ స్టేడియంలో నిర్వహిస్తాం. తెలుగు, హిందీ, పంజాబీ, భోజ్‌పురి, తమిళ్, కన్నడ, మలయాళం… ఇలా దేశంలోని అన్ని భాషల నటీనటులకు అవార్డులు ఇస్తున్నాం. ఇక 2017 సంవత్సరానికిగాను ఉత్తమ నటుడిగా బాలకృష్ణ (గౌతమిపుత్ర శాతకర్ణి), 2018 సంవత్సరానికిగాను నాగార్జున (దేవదాస్) ఈ పురస్కారాలను అందుకోబోతున్నారు. ఇక శ్రీదేవి, దాసరి నారాయణరావు పేరిట కూడా అవార్డులను ఇస్తున్నాం. అవార్డుల జ్యూరీ మెంబర్లుగా నగ్మా, జీవిత రాజశేఖర్, మీనా, పరుచూరి గోపాలకృష్ణ, కె.ఎస్.రామారావు, నరేశ్, రఘు రామకృష్ణంరాజు, పింకీ రెడ్డి, శోభన కామినేని వ్యవహించారు. ఈ వేడుకలో అన్ని భాషల నుంచి దాదాపు 60 మంది ఫిల్మ్ స్టార్స్ అవార్డులు తీసుకోనున్నారు”అని అన్నారు. జీవిత సాఫల్య పురస్కారానికి ఎంపికైన నటి నగ్మా మాట్లాడుతూ “నాకు జీవిత సాఫల్య పురస్కారాన్ని ప్రకటించినందుకు ఆనందంగా ఉంది. ఈ అవార్డుతో పాటు సామాజిక సేవ చేసినందుకు మార్చిలో రాజీవ్‌గాంధీ అవార్డు కూడా అందుకోబోతున్నాను. తెలుగులో నా సినీ ప్రయాణం ఇంకా కొనసాగాలని కోరుకుంటున్నాను”అని తెలిపారు. ఈ సమావేశంలో పరుచూరి గోపాలకృష్ణ, డా.శోభన కామినేని, రఘురామ కృష్ణంరాజు పాల్గొన్నారు.
విజేతలు వీరే..
2018కి ఉత్తమ కథానాయకుడిగా రామ్‌చరణ్ (రంగస్థలం), ఉత్తమ నటిగా కీర్తిసురేష్ (మహానటి), ఉత్తమ కథానాయికగా పూజా హెగ్డే (అరవింద సమేత వీర రాఘవ), 2017కి ఉత్తమ నటిగా రకుల్ ప్రీత్ సింగ్ (రారండోయ్ వేడుక చూద్దాం), ఉత్తమ కథానాయికగా రాశీఖన్నా (జై లవకుశ) ఎంపికయ్యారు. ఇక షాలిని పాండే, రాజేంద్రప్రసాద్, వివి వినాయక్, క్రిష్, సుకుమార్, రాజశేఖర్, అఖిల్, నాగచైతన్య, కల్యాణ్‌రామ్, సుమంత్, ఆది పినిశెట్టి, దేవిశ్రీ ప్రసాద్, తమన్, కళ్యాణ్‌దేవ్, అలీ, వి.జయ, బోనీకపూర్‌లకు పలు విభాగాలలో అవార్డులు దక్కాయి. శ్రీదేవి స్మారక పురస్కారం విద్యాబాలన్‌కు, దాసరి స్మారక పురస్కారం మోహన్‌బాబుకు లభించింది. ‘అవుట్‌స్టాండింగ్ సినీ లిరిక్ రైటర్’ అవార్డును సిరివెన్నెల సీతారామశాస్త్రికి ప్రకటించారు.

TSR TV9 National Film Awards 2017 & 2018 on Feb 17th