Home తాజా వార్తలు తిరుమలలో కెసిఆర్

తిరుమలలో కెసిఆర్

 

తిరుమలలో సిఎం కెసిఆర్‌కు టిటిడి ఘన స్వాగతం
రేణిగుంటలో వైఎస్‌ఆర్‌సిపి ఎంఎల్‌ఎలు, కార్యకర్తల సందడి
మిన్నుముట్టిన కెసిఆర్ జిందాబాద్ నినాదాలు
నేడు ఉ.530గం.కు దర్శనం, మధ్యాహ్నం తిరిగి హైదరాబాద్‌కు

మనతెలంగాణ/హైదరాబాద్: తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు తిరుపతికి వెళ్లిన ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుకు ఘన స్వాగతం లభించింది. రేణిగుంట ఎయిర్‌పోర్టులో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంఎల్‌ఎలు భూమన కరుణాకర్‌రెడ్డి,చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, ఎంపి మిథున్‌రెడ్డిలతో పాటు వైసిపి నాయకులు, కెసిఆర్ అభిమానులు ఆయనకు సాదర స్వాగతం పలికారు. పూల బొకేలు, శాలువాలతో తస్కరించారు. భారీగా తరలి వచ్చిన వైసిపి కార్యకర్తలు కెసిఆర్ జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు. అనంతరం ముఖ్యమంత్రి కెసిఆర్ తిరుమలకు బయలుదేరి వెళ్లారు. తిరుమల శ్రీవారి దర్శనం కోసం ఆదివారం మధ్యాహ్నం హైదరాబాద్‌లోని బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో కుటుంబ సభ్యులతో కలిసి సిఎం కెసిఆర్ తిరుపతికి బయలుదేరి వెళ్లారు.

 

రేణిగుంట ఎయిర్‌పోర్టు నుంచి రోడ్డు మార్గం ద్వారా తిరుమలలోని శ్రీకృష్ణ అతిథి గృహానికి చేరుకున్నారు. శ్రీకృష్ణ అతిథిగృహం వద్ద టిటిడి ఇవొ అనిల్‌కుమార్ సింఘాల్, జెఇఒ శ్రీనివాసరాజు సిఎం కెసిఆర్‌కు ఘన స్వాగతం పలికారు. ఆదివారం రాత్రి శ్రీకృష్ణ అతిథిగృహంలో కెసిఆర్ బస చేయనున్నారు. తిరుమల చేరుకున్న సిఎం కెసిఆర్ సతీమణి శోభ, కోడలు శైలిమా, పిల్లలు, ఇతర కుటుంబ సభ్యులు ఎత్తైన ప్రాంతంలో ఉన్న శ్రీవారి పాదాలను దర్శించుకున్నారు. అనంతరం శ్రీకృష్ణ అతిథి గృహానికి చేరుకున్నారు. సోమవారం ఉదయం 5.30 గంటలకు సిఎం కెసిఆర్ కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారిని దర్శించుకోనున్నారు. శ్రీవారి దర్శనం అనంతరం ఆలయం నుంచి తిరిగి అతిథి గృహానికి చేరుకోని మధ్యాహ్నం 12 గంటలకు అక్కడి నుంచి రోడ్డు మార్గంలో రేణిగుంట ఎయిర్‌పోర్టుకు రానున్నారు. అక్కడి నుంచి హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణం అవుతారు.

TTD grand welcome to CM KCR in Tirumala