Home జాతీయ వార్తలు రోడ్ల అభివృద్ధి.. ప్రాజెక్టులకు సహకరించండి

రోడ్ల అభివృద్ధి.. ప్రాజెక్టులకు సహకరించండి

tummala

కేంద్ర మంత్రులకు తుమ్మల విజ్ఞప్తి

న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర రహదారుల అభివృద్ధి, నీటి పారుదల ప్రాజెక్టుల నిర్మాణానికి అన్ని విధాలుగా సహకరించాలని పలువురు కేంద్ర మంత్రులను రాష్ట్ర రోడ్డు, భవనాలు, మహిళా శిశు సంక్షేమ శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు కోరారు. మంగళవారం ఢిల్లీలోని పరివాహన్ భవన్‌లోని కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీని ఆయన కార్యాలయంలో మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు, తెలంగాణ పార్లమెంట్ సభ్యులు ఎపి జితేందర్ రెడ్డి, బి.వినోద్ కుమార్, బూర నర్సయ్య గౌడ్‌లు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సమావేశంలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో రోడ్ల అభివృద్ధికి, రహదారుల నిర్మాణానికి నిధులు కేటాయించాలని మంత్రి తుమ్మల కోరారు.  కొత్త జిల్లాలు ఏర్పడిన నేపథ్యంలో రహదారుల అభివృద్ధికి నిధులు కేటాయించాలని కేంద్ర మంత్రిని కోరారు. అనంతరం కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ మంత్రి హర్షవర్దన్‌తో  తుమ్మల, తెలంగాణ ఎంపిలు సమావేశమయ్యారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం, సీతారామ ప్రాజెక్టు, పాలమూరు ఎత్తిపోతల పథకానికి కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ త్వరతగతిన అనుమతులు కేటాయిస్తున్న నేపథ్యంలో కృతజ్ఞతలు తెలిపారు. ప్రాజెక్టు నిర్మాణంలో మరింత వేగం పెరిగేలా మిగిలిన అనుమతివ్వలని తుమ్మల, కేంద్ర మంత్రిని కోరారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ స్వాతంత్య్రం వచ్చిన  నాటి నుంచి కేవలం 2 వేల కిలోమీటర్ల రోడ్లను మాత్రమే సాధించిందని, కానీ, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత దాదాపు 3 వేల కిలోమీటర్ల రోడ్లను నిర్మించుకున్నామని మంత్రి తెలిపారు. ఆ 3 వేల కిలోమీటర్లకు సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్‌ను విడుదల చేయాలని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీనీ కోరామని మంత్రి వివరించారు.  10 లక్షల ఎకరాలకు నీరందించే సీతారామ ప్రాజెక్టుకు సంబంధించి ఇప్పటికే కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ మొదటి దశ అటవీ, పర్యావరణ అనుమతులు ఇచ్చిందని మంత్రి తెలిపారు. అయితే వన్య ప్రాణుల సంరక్షణకు సంబంధించిన అనుమతులు రావాల్సి ఉందని మంత్రి తెలిపారు. ఈ అనుమతికి సంబంధించి కేంద్ర పర్యావరణ అటవీ శాఖ మంత్రి అధ్యక్షతన సమావేశం జరగాల్సి ఉందని, త్వరితగతిన ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసి అనుమతులు మంజూరు చేయాలని కోరినట్లు మంత్రి తెలిపారు. తమ విజ్ఞప్తులపై కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారని, రెండు, మూడు రోజుల్లో అనుమతులు మంజూరు చేస్తామని కేంద్ర మంత్రి హామీ ఇచ్చారని మంత్రి తెలిపారు.