Home తాజా వార్తలు సూర్య ఆంక్షల వల్లనే ఝాన్సీఆత్మహత్య

సూర్య ఆంక్షల వల్లనే ఝాన్సీఆత్మహత్య

నటించొద్దని ఝాన్సీకి హుకుం
ఏడాది ప్రేమలో మూన్నెళ్ల వేధింపులు
కలత చెంది ఆత్మహత్య చేసుకున్న ఝాన్సీ
మన తెలంగాణ/హైదరాబాద్‌ః బుల్లితెర నటి ఝాన్సీ, సూర్యల ఏడాది కాలంగా సాగిన ప్రేమ వ్యవహారంలో మూడు నెలల పాటు వేధింపులు చోటుచేసుకున్నాయని ఎసిపి విజయ్‌కుమార్ వివరించారు. ఝాన్సీ నటనకు స్వస్తి పలకాలని ప్రియుడు సూర్య వేధించిన కారణంగా కలత చెంది ఝాన్సీ బలన్మరాణానికి పాల్పడినట్లు తమ ప్రాధమిక దర్యాప్తులో తేలిందన్నారు. రాష్ట్రంలో సంచలనం రేపిన టివి నటి ఝాన్సీ ఆత్మహత్య కేసులో పంజాగుట్ట పోలీసులు పురోగతి సాధించారు. ఝాన్సీ ప్రియుడు సూర్యతేజను అదివారం పంజాగుట్ట ఎసిపి విజయ్‌కుమా అదుపులోకి తీసుకుని సెల్ ఫోన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకుని ప్రశ్నించారు. ఝాన్సీ, సూర్యలకు మధ్య జరిగిన వాట్సప్ సంభాషణలను పోలీసులు పరిశీలించారు.

అలాగే విచారణలో కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఝాన్సీ ప్రియుడు సూర్య ఇదివరలో టివి నటి మధుతో ప్రేమ వ్యవహారం నడిపినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. మధు అనే నటి ద్వారా పరిచయమైన ఝాన్సీ పరిచయమైంది. ఈ క్రమంలో సూర్య మధు ప్రేమకు గుడ్‌బై చెప్పి ఝాన్సీని తన వలలో వేసుకున్నట్లు పోలీసులు వివరిస్తున్నారు. ఇటీవల సూర్య పుట్టిన రోజు కానుకగా రెండు లక్షల విలువైన బైక్, రూ.10లక్షల రూపాయల విలువ చేసే బంగారు ఆభరాణాలు ఇచ్చినట్లు సమాచారం. తాను చేసే వ్యాపారానికి డబ్బు అవసరం ఉందని ఝాన్సీ నుంచి బంగారు ఆభరణాలు తీసుకున్నట్లు పోలీసులు వివరిస్తున్నారు. సూర్య, ఝాన్సీల మధ్య మూడునెలలుగా అభిప్రాయ బేధాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. మృతురాలి గదిలో డైరీని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అందులో ఝాన్సీ పేర్కొన్న వివరాలపైనా దర్యాప్తు చేపడుతున్నారు. ప్రధానంగా ఝాన్సీ నటనకు స్వస్తి చెప్పాలని సూర్య ఒత్తిడి చేశాడని, దీంతో వారి మధ్య విభేదాలు ఏర్పడ్డాయని ఎసిపి వివరించారు. గత ఏడాది కాలంగా వీరద్దరి మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తోందని ఎసిపి తెలిపారు. మూడు నెలలుగా ఝాన్సీని ప్రియుడు సూర్య వేధింపులకు గురిచేస్తున్నట్లు ఆధారాలు లభించాయి. ఝాన్సీ శ్రీనగర్ కాలనీలోని తన అపార్ట్‌మెంట్‌లో ఫిబ్రవరి 6న ఉదయం ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన విషయం విదితమే.

దీంతో రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తులో భాగంగా ఝాన్సీ నివాసముంటున్న అపార్ట్‌మెంట్ వాసుల నుంచి వివరాలను సేకరించారు. ఝాన్సీ ఆత్మహత్యకు పాల్పడిన రోజు సూర్యతేజతో పదేపదే ఫోన్లో మాట్లాడిందని పోలీసులు గుర్తించారు. ఝాన్సీ ఆత్మహత్యకు చివరి రోజు వారిద్దరి మధ్య సంభాషణల రికార్డులను పోలీసులు సేకరించారు. ఫోన్ కాల్స్‌తో పాటు చాటింగ్‌లలోనూ కీలక ఆధారాలు లభ్యమయ్యాయి. ఝాన్సీ ఉపయోగించిన శామ్‌సంగ్ ఫోన్,ఐ ఫోన్ లాక్ ఒపెన్ చేసిన పోలీసులు ఝాన్సీ ఆత్మహత్యకు ప్రియుడు సూర్య కారణమని వివరిస్తున్నారు. పెళ్లి విషయంలో వీరిద్దరి మధ్య విభేదాల కారణంగా ఝాన్సీ ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిందని దర్యాప్తు అధికారులు వివరిస్తున్నారు. ఇదిలావుండగా పోలీసుల అదుపులో సూర్య చెప్పిన మాటలకు పొంతనలేకుండా ఉన్నాయన్నది సమాచారం. ఝాన్సీకి గిరి, బాబి అనే ఇద్దరు ఫోటోలు షూట్ చేసేవారని, వారిద్దరినీ నమ్మొద్దని పలుమార్లు చెప్పినా నా మాట వినలేదని సూర్య పోలీసులకు వివరించాడు. ఝాన్సీని వారు ఇబ్బందులకు గురిచేశారని, సినిమా అవకాశం కల్పిస్తామని మోసం చేశారన్నారు. ఈ విషయాలను ఝాన్సీ నాతో చెప్పిందని, వెంటనే తాను గిరిని హెచ్చరించడం కూడా జరిగిందన్నారు. సినిమా ఆఫర్లు తగ్గడం వల్లే ఝాన్సీ ఆత్మహత్య చేసుకుందని సూర్య పోలీసులకు తెలిపాడు. అయితే ఝాన్సీ ఆత్మహత్య కేసులో గిరి, బాబిలను కూడా అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తామని ఎసిపి విజయ్‌కుమార్ తెలిపారు.

TV Actress Jhansi Murder case