Home తాజా వార్తలు సిమ్‌కార్డుల కేసులో ట్విస్ట్!

సిమ్‌కార్డుల కేసులో ట్విస్ట్!

ph

రేషన్ డీలర్లకు సంతోష్ గాలం!

నకిలీ వేలి ముద్రలతో బియ్యం నొక్కేసిన వైనం ?

చెరో యాభై శాతంతో ఒప్పందం ?
రంగంలోకి దిగిన విజిలెన్స్, పౌరసరఫరాల శాఖలు

మన తెలంగాణ/హైదరాబాద్/ధర్మారం : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న వొడా ఫోన్ సిమ్ కార్డుల కుంభకోణంలో రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తోంది. ఆధార్, వేలి ముద్రలు సృష్టించి వేలాది వొడా సిమ్‌కార్డ్‌లు పొంది భారీ కుంభకోణంలో సూత్రధారిగా పోలీస్ కస్టడిలో నిజాలు కక్కుతున్న సంతోష్ ఉదంతంలో తాజాగా మరో ట్విస్ట్ ప్రచారం ఊపందుకుంది. తన సైబర్ నేర సామ్రాజ్యాన్ని విస్తరించే క్రమంలో వోడా సిమ్‌లతో పాటు రేషన్ డీలర్లనూ పావులుగా వాడుకున్నట్లు అత్యంత విశ్వసనీయంగా తెలిసింది. పేదల కోసం ప్రభుత్వం సబ్సిడిపై అందిస్తున్న రేషన్ బియ్యాన్ని నొక్కేసేందుకు కరీంనగర్ జిల్లాలోని చొప్పదండి, ధర్మారం, వెల్గటూర్, గొల్లపల్లి మండలాల్లోని కొందరు డీలర్లను ఉపయోగించుకున్నట్లు సమాచారం. రేషన్ సరుకుల పంపిణీలో ప్రతి నెల 15 వ తేది సాయంత్రంలోగా డీలర్ల వద్ద వేలి ముద్ర వేసి రిజిస్టర్‌లో సంతకం చేసి వినియోగదారులు బియ్యం పొందుతున్నారు. ఈ క్రమంలో బొంబాయి , హైదరాబాద్ లాంటి పట్టణాలకు బతుకు దెరువు కోసం వలస వెళ్లే కూలీల రేషన్‌ను నొక్కేసేందుకు ఎత్తుగడ వేసి అమలు చేశారు. వేలి ముద్రలు వేసే బయోమెట్రిక్ ఈ పాస్ మిషన్లలో సాంకేతిక లోపాలతో ఆగిపోవడం, కొందరి వేలిముద్రలు బయోమెట్రిక్‌లో సరిపోకపోవడం లాంటి సమస్యలతో చాల చోట్ల బియ్యం ఇతర రేషన్ సరుకులు వాపస్ వెళ్తున్న విషయాన్ని పసిగట్టిన సంతోష్ తన “మేధాశక్తి” ని ఉపయోగించి కొందరు డీలర్లను తన వ్యూహానికి అనువుగా మలుచుకున్నట్లు సమాచారం. తాను వొడాఫోన్ సిమ్‌ల కోసం ఉపమోగించే నకిలీ వేలిముద్రలను అచ్చంగా రేషన్ పంపిణీ వ్యవహారానికి ఉపమోగించి వేలాది క్వింటాళ్ల బియ్యాన్ని నొక్కేశారు. ఈ బియ్యాన్ని కొన్ని రైస్‌మిల్లులకు రీ సైక్లింగ్ కోసం పంపినట్లు సమాచారం. ఈ సమాచారాన్ని అందుకున్న విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్, పౌరసరఫరాల శాఖ రంగంలోకి దిగింది. ఏ రేషన్ షాపు నుండి ప్రతి నెలా ఎంతెంత సరుకు దారి మళ్లిందన్న అంశంపై రేషన్ డీలర్ల వారీగా విచారణ చేపట్టింది.
పోలీసు కస్టడీకి సంతోష్…
వేలి ముద్రల స్కామ్ కేసులో అరెస్టు అయి చంచల్‌గూడ జైలులో ఊచలు లెక్కబెడుతున్న సంతోష్‌కుమార్‌ను నాంపల్లి కోర్టు ఆదేశాల మేరకు ఎస్‌ఆర్‌నగర్ పోలీసులు గురువారం పోలీసు కస్టడీకి తీసుకున్నారు. వేలి ముద్రల కుంభకోణంపై ఇంకా ఎక్కడెక్కడ ఏమేం చేశారో? ఏదైనా బ్యాంకుల్లోనూ నగదు డ్రా చేసుకున్నారా? వంటి అంశాలను విచారించాలని నిర్ణయించారు. పోలీసులు తమదైన శైలిలో జరిపిన విచారణలో సంతోష్‌కుమార్ మొదటి రోజే విచారణలో పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. అయితే ఆ వివరాలను మాత్రం బయటికి పొక్కకుండా పోలీసులు జాగ్రత్త పడుతున్నారు. ఒక్క సిమ్ కార్డు విక్రయిస్తే వచ్చే కమీషన్ కోసమే తాను ప్లాస్టిక్ వేలి ముద్రలను తయారు చేసినట్లు విచారణలో సంతోష్‌కుమార్ పేర్కొన్నాడు. సంతోష్‌కుమార్ చెబుతున్న మాటల్లో వాస్తవాలను తెలుసుకునేందుకు పోలీసులు సదరు సెల్‌ఫోన్ కంపెనీ అధికారుల సహాయాన్ని కోరారు. సంతోష్‌కుమార్ మొత్తం ఎన్ని సిమ్‌కార్డులను విక్రయించాడు. వాటి నెంబర్లను ఇప్పటికే పోలీసులు సేకరించారు. కేవలం కమీషన్ కోసమే ఇతను వేలిముద్రలను సృష్టించాడా లేదా మరో కోణం ఏదైనా ఉందా అనే విషయంపై కూడా పోలీసులు దృష్టి సారించారు. కేవలం సంతోష్‌కుమార్ సిమ్‌కార్డుల కోసమే వేలి ముద్రలను సృష్టించాడా లేదా ఈ వేలి ముద్రలతో మరేదైన నేరాలకు పాల్పడ్డాడా అనేది పోలీసులను వెంటాడుతున్న ప్రశ్న.సంతోష్‌కుమర్ ఇంటారేగేషన్‌లో ఆధార్ అధికారులు కూడా పాల్గొన్నారు. ఆధార్‌తో అనుంసదానమైన వ్యక్తుల వేలి ముద్రలను సృష్టించడం సాధ్యమేనని సంతోష్‌కుమార్ నిరూపించడంతో అధికారులు భయపడుతున్నారు
ఈ ఫార్మూలా యమ డేంజర్ ! సంతోష్‌కుమార్ ఫార్మూలాను ఉగ్రవాదులు, నక్సలైట్లు కూడా వాడుకుంటే పెద్ద ప్రమాదమేనని అధికారులు భావిస్తున్నారు. ఇతరులెవరు వేలి ముద్రలు కృత్రిమంగా సృష్టించకుండా ఆధార్ వివరాలలో సాంకేతిక పరిజ్ఞానాన్ని కట్టుదిట్టం చేయాల్సిన అవసరం ఉందని అధికారులు నిర్ణయించారు
ఇంతకీ ఒడాఫోన్ అధికారులు ఏమంటున్నారు?
కాగాచట్టాలను పూర్తిగా గౌరవిస్తామని వొడాఫోన్ సంస్థ అధికారి ఒకరు మన తెలంగాణకు పేర్కొన్నారు. ఈ కేసుకు సంబంధించి తాము పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగిందని కూడా తెలిపారు. చట్ట అతిక్రమణ చేసిన వ్యక్తులపై తగిన చర్యలు తీసుకునేందుకు పోలీసులు చేస్తున్న దర్యాప్తు ప్రక్రియలో పూర్తిగా సహరిస్తామని ఆయన తెలిపారు.