Home తాజా వార్తలు జంట దోషులకు ఉరి

జంట దోషులకు ఉరి

Two culprits were sentenced to death for bomb blasts

హైదరాబాద్ గోకుల్‌చాట్, లుంబినీ పార్కు
జంట పేలుళ్ల మారణహోమం దోషులిద్దరికి ఉరిశిక్ష,
ఆశ్రయమిచ్చిన అంజుమ్‌కు యావజ్జీవం

ఖరారు చేసిన ఎన్‌ఐఎ స్పెషల్ కోర్టు
సోమవారం సాయంత్రం వెలువడిన తీర్పు

మన తెలంగాణ/హైదరాబాద్: గోకుల్ చాట్, లుంబినీ పార్కు జంట బాంబు పేలుళ్ల కేసులో ఇద్దరు దోషులకు ఉరి శిక్ష ఖరారైంది. అత్యంత కట్టుదిట్టమైన పోలీసు బందోబస్తు మధ్య జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఎ) ప్రత్యేక న్యాయస్థానం దోషులకు ఉరి శిక్ష వేసినట్లు తీర్పు వెల్లడించింది. సోమవారం చర్లపల్లి జైలులో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన (డెజిగ్నేటెడ్) ప్రత్యేక న్యాయస్థానం న్యాయమూర్తి శ్రీనివాస్‌రావు ఈ తీర్పును వెల్లడించారు. 11 ఏళ్ల సుధీర్ఘ విచారణ అనంతరం దోషులకు ఉరి శిక్ష పడడంతో బాధితులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కేసుల్లో పూణెకు చెందిన అక్బర్ ఇస్మాయిల్ చౌదరి (37), మహారాష్ట్ర ఖాండ్వాకు చెందిన అనీఖ్ షఫిక్ సయ్యద్ (36)లు దోషులని ఈ నెల 4న ఎన్‌ఐఎ కోర్టు తేల్చిన విషయం తెలిసిందే. ఇదే కేసులో అరెస్టై రిమాండ్‌లో ఉన్న ముంబాయికి చెందిన సిఎంఎస్ కంప్యూటర్ చదివిన మహ్మద్ సాదిక్ అలియాస్ యాసీర్ అలియాస్ ఇమ్రాన్ (44), మహారాష్ట్ర ఖాండ్వాకు చెందిన అడ్వడైజ్‌మెంట్ ఎజెన్సీ నిర్వాహకుడు ఫారూఖ్ షర్ఫీద్దిన్ తర్కష్ అలియాస్ అబ్దుల్లా (37) నిర్ధోషులుగా బయటపడిన విషయం తెలిసిందే.

దోషులకు శిక్షలు ఏ విధంగా తీర్పు వెలువడుతుందోనని ఉదయం నుంచి స్థానిక, జాతీయ మీడియా ప్రతినిధులు, టివి ఛానల్స్ ప్రతినిధులు చర్లపల్లి జైలు వద్దకు చేరుకున్నాయి. ఉత్కంఠ లేపిన తీర్పు సాయంత్రం ఆరు గంటలకు తీర్పు వెలువడింది. ఆగస్టు 25, 2007న జనసమ్మర్థంగా ఉండే లుంబినీపార్కు, గోకుల్ ఛాట్ వద్ద జరిగిన వరుస బాంబు పేలుళ్లలో 42 మంది మరణించగా మరో 70 మందికిపైగా గాయపడ్డారు. మక్కా మసీదులో బాంబు పేలుడు, తదనంతరం చెలరేగిన అల్లర్లలో పోలీసులు జరిపిన కాల్పుల్లో ఐదు మంది మృతి చెందడాన్ని జీర్ణించుకోలేక తాము లుంబినీపార్కు, గోకుల్‌ఛాట్ బాంబు పేలుళ్లకు పాల్పడ్డామని దోషులు అక్బర్ ఇస్మా యిల్ చౌదరి, అనిఖ్ షఫిక్ సయ్యద్‌లు పోలీసుల విచారణలో వెల్లడించారు. దోషులిద్దరికి ఉరి శిక్షతో పాటు రూ.10 వేల జరిమానా కూడా కోర్టు విధించింది.

ఆశ్రయం కల్పించిన నిందితుడికి జీవిత ఖైదు…
లుంబినీపార్కు, గోకుల్‌ఛాట్ వరుస బాంబు పేలుళ్ల కేసులో దోషులుగా తేలిన ఇండియన్ ముజాహిద్దీన్ (ఐఎం) ఉగ్రవాద సభ్యులు అక్బర్ ఇస్మాయిల్ చౌదరి,అనీఖ్ షఫిక్ సయ్యద్‌లకు ఢిల్లీకి చెందిన మహ్మద్ తారీఖ్ అంజుమ్ ఎహసాన్ దోషేనని సోమవారం మధ్యాహ్నం 2 గంటలకే చర్లపల్లిలో ప్రత్యేకంగా ఏర్పాటైన ఎన్‌ఐఎ కోర్టు తీర్పు చెప్పింది. ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించి సహకరించడాన్ని కూడా కోర్టు తీవ్రంగా పనిగణించింది. దీంతో మహ్మద్ తారీఖ్ అంజుమ్ ఎహసాన్‌కు జీవిత శిక్షతో పాటు రూ.10 వేల జరిమాన కూడా విధిస్తున్నట్లు ఎన్‌ఐఎ కోర్టు సాయంత్రం ఆరు గంటలకు తీర్పు వెల్లడించింది.