Home ఆంధ్రప్రదేశ్ వార్తలు మద్యంతాగి స్కూల్‌కి వచ్చిన ఇద్దరు బాలికలకు టిసి !

మద్యంతాగి స్కూల్‌కి వచ్చిన ఇద్దరు బాలికలకు టిసి !

Girl with Alcoholఅమరావతి: మద్యంతాగి పాఠశాలకు వచ్చిన ఇద్దరు విద్యార్థినిలకు ప్రధానోపాధ్యాయుడు టిసిలు ఇచ్చి పంపించేశారు. మద్యం తాగి వచ్చిన సదరు బాలికలు తరగతి గదిలో తూలుతూ తోటివారి మీద పడుతుండటంతో పాటు బూతులు మాట్లాడుతుండటంతో తోటి విద్యార్థినులు ప్రధానోపాధ్యాయునికి ఫిర్యాదు చేశారు. దీంతో సదరు విద్యార్థినులను పరీక్షించగా వారు మద్యం తాగి తరగతులకు హాజరవున్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో ఆ ఇద్దరు విద్యార్థినులకు వారి తల్లిదండ్రుల సమక్షంలోనే ప్రధానోపాధ్యాయుడు టిసి ఇచ్చి పంపించేశారు. ఈ ఘటన ఎపి రాజధాని నగరం అమరావతి శివారులోని ఓ ప్రభుత్వ పాఠశాలలో జరిగింది. వివరాల్లోకి వెళితే… తొమ్మిదో తరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్థినులు గతకొద్ది రోజులుగా శీతలపానీయాల్లో లిక్కర్ కలిపిన బాటిళ్లతో పాఠశాలకు వస్తున్నారు. అనంతరం సమయం దొరికినప్పుడల్ల వాటిని ఎవరికీ కనపడకుండా కొద్దికొద్దిగా తాగుతున్నారు.

శనివారం ఉదయం విరామ సమయంలో తాగడంతో మత్తు ఎక్కువై పక్కన కూర్చున్న తోటి విద్యార్థినులపై తూలారు. మొదట నిద్రమబ్బుతో తూలుతున్నారని అనుకున్న తోటి విద్యార్థినులకు వారి నుంచి మద్యం తాగిన వాసన వస్తుండటం గమనించారు. దీంతో విషయాన్ని ఉపాధ్యాయులకు చెప్పారు. అనుమానం వచ్చిన ప్రధానోపాధ్యాయుడు వైద్య నిపుణుల సమక్షంలో మద్యం పరీక్ష చేయించారు. దాంతో సదరు విద్యార్థినులు మద్యం తాగినట్లు నిర్ధారణ కావడంతో ఉపాధ్యాయులకు నోటమాట రాలేదు. వెంటనే వారి తల్లిదండ్రులను పిలిపించారు. తోటి విద్యార్థులు పాడైపోతారని కుటుంబసభ్యుల సమక్షంలోనే బాలికలకు టిసి ఇచ్చి పంపించేశారు. కాగా, వీరిద్దరూ గతంలో చదువుకున్న పాఠశాలలోనూ ఇలాగే మద్యం తాగడంతో టిసిలు ఇచ్చినట్లు తెలిసిందని, తండ్రికి మద్యం తాగే అలవాటు ఉండటంతో సీసా అడుగు భాగంలో మిగిలిన మద్యాన్ని తాగడం కారణంగా బాలికలకు అలవాటై ఉంటుందని ప్రధానోపాధ్యాయుడు తెలిపారు.

Two Girls suspended from School after Drinking Alcohol