Search
Monday 16 July 2018
  • :
  • :

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

two killed in road accident

చౌటుప్పల్: మరో వారం రోజుల్లో జరగనున్న తమ మేనమామ కూతురి వివాహాన్ని కన్నులారా వీక్షించాలన్న ఆ అల్లుల్ల ఆనందం నెరవేరలేదు… అట్టహాసమైన ఏర్పాట్లతో కళ్యాణాన్ని కన్నుల పండగగా నిర్వహించాలన్న వారి కోరిక తీరనేలేదు… ఇంతలోనే వారిని మృత్యువు రోడ్డు ప్రమాదం రూపంలో వెంటాడింది. చౌటుప్పల్ మండలం ఎస్ లింగోటం వద్ద బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో పెళ్లి పత్రికలు పంచడానికి బైక్‌పై వెళ్లుతున్న ఇద్దరు యువకులు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. ప్రమాద ఘటనకు సంబందించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… వలిగొండ మండలం గోకారం గ్రామంలో జూలై 5 న తమ మేనమామ కూతురి వివాహం నిర్వహించేందుకు గాను ఏర్పాట్లను చేస్తున్న నేపధ్యంలో అదే మండలంలోని టేకుల సోమారం గ్రామానికి చెందిన చీకూరి శ్రీకాంత్ (25), భూదాన్ పోచంపల్లి మండలం ముక్తాపూర్ గ్రామానికి చెందిన పాపగళ్ల గిరి (25) లు ఇద్దరు కలిసి పెళ్లి పత్రికలను పంచడానికి గోకారం నుంచి బైక్‌పై ఉదయాన్నే బయలుదేరారు. హుషారుగా ప్రయాణాన్ని ప్రారంభించిన వారు ద్విచక్ర వాహనంపై వేగంగా దూసుకు వస్తూ చౌటుప్పల్ మండలం ఎస్ లింగోటం శివారులోకి చేరుకోగానే ముందుగా వెళ్తున్న మరో బైక్‌ను ఢీ కొట్టారు. ఈ ప్రమాదంలో రెండు బైక్‌లు అదుపు తప్పి రోడ్డుపై పడిపోగా తీవ్ర గాయాలతో శ్రీకాంత్, గిరిలు అక్కడికక్కడే మృతి చెందారు. కాగా ముందు బైక్‌పై ప్రయాణిస్తున్న మండలంలోని జై కేసారం గ్రామానికి చెందిన పోగులోతు అశోక్ (20) తలకు బలమైన గాయాలు కావండతో అతడిని వెంటనే చికిత్స నిమిత్తం హైద్రాబాద్‌లోని కామినేని ఆసుపత్రికి తరలించారు. మృతి చెందిన వారు శ్రీకాంత్, గిరి లు పెట్రోల్ బంక్‌లో పని చేస్తుండగా గాయపడిన అశోక్ చౌటుప్పల్‌లోని హేర్ కటింగ్ షాప్‌లో పని చేస్తున్నాడు. అశోక్ ఆరోగ్య పరిస్థితి కూడా విషమంగానే వున్నట్టు తెలిసింది. మృత దేహాలకు చౌటుప్పల్ ప్రభుత్వాసుపత్రిలో పోస్టుమార్టం జరిపించి కేసు దర్యాప్తు జరుపుతున్నట్టు చౌటుప్పల్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ ఏరుకొండ వెంకటయ్య తెలిపారు.

Comments

comments