Home తాజా వార్తలు ట్రాక్టర్ బోల్తా: ఇద్దరి మృతి

ట్రాక్టర్ బోల్తా: ఇద్దరి మృతి

Tractor-Accident

సూర్యాపేట:  ట్రాక్టర్ బోల్తా పడి ఇద్దరు మృతి చెందగా మరో ఆరుగురు గాయపడిన సంఘటన సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం గుంపుల తిరుమలగిరి గ్రామం వద్ద జరిగింది. మృతుల బంధువులు, స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. శుక్రవారం చివ్వెంల మండల పరిధిలోని దురాజుపల్లి విద్యుత్ సబ్‌స్టేషన్ వద్ద నుంచి కరెంట్ సిమెంట్ స్తంబాలను గ్రామాల్లో పాతడానికి ట్రాక్టర్‌లో ఆత్మకూర్ ఎస్ మండలం మంగళితండాకు చెందిన ఎనిమిది మంది కూలీలు ట్రాక్టర్ తీసుకరావాడానికి వెళ్లారు. విద్యుత్ కాంట్రాక్టర్ వద్ద గత రెండు సంవత్సరాలుగా పని చేస్తున్న మంగళితండాకు చెందిన కూలీలు కరెంట్ స్థంబాలను ట్రాక్టర్‌లో లోడ్ చేసుకుని మండల పరిధిలోని గుంజలూరు, తిరుమలగిరి గ్రామాల్లో పాతడానికి వెళ్తుండగా ట్రాక్టర్ డ్రైవర్ అతివేగంతో అదుపుతప్పడంతో ఒకేపక్కకు ఒరిగి ట్రాక్టర్ ట్రాలీతోపాటు అందులో కూలీలపై కరెంట్ స్తంబాలు పడ్డాయి.

దీంతో ఇద్దరు కూలీలు లకావత్ సుందర్ ( 25), మానావత్ సంగు (40)లు అక్కడికక్కడే మృతి చెందారు. క్షతగాత్రులు జటావత్ గోక్యా, బానావత్ గణేష్, లూనావత్ నాగు, ధరావత్ అమర్, జటావత్ మల్సూర్, బోడ శ్రీనులు సూర్యాపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు. డ్రైవర్ సురేందర్‌రెడ్డికి ఎలాంటి గాయాలు కాలేదు. కాంట్రాక్టర్ మృతుల కుటుంబాలకు న్యాయం చేయాలని, నష్టపరిహారం చెల్లించాలని మృతుల బంధువులు, గిరిజన సంఘ నాయకులు సూర్యాపేట ఏరియా ఆసుపత్రి వద్ద ధర్నాకు దిగారు. దీంతో కొద్దిసేపు పోలీసులకు, మృతుల బంధువులు, నాయకులకు వాగ్వవాదం జరిగింది. కాంట్రాక్టర్ వచ్చేదాకా ధర్నా విరమించబోమని గిరిజన సంఘ నాయకులు భీష్మించుకుని రోడ్డుపై భైఠాయించారు. పట్టణ, రూరల్ పోలీసులు రంగ ప్రవేశం చేసి పరిస్థితిని చక్కదిద్దారు. బంధువుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.